Telugu Global
National

హ‌త్రాస్ ఘ‌ట‌న‌కు రెండేళ్ళు... అక్కడ నిందితులకే మద్దతు ఎక్కువ

ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని హ‌త్రాస్ గ్రామంలో ఓ దళిత బాలికపై అగ్రకుల వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన జరిగి ఈ రోజుకు రెండేళ్ళు. అయితే ఈ రోజుకూ గ్రామంలో ఉన్న ఠాకూర్ల కుటుంబాలన్నీ నిందితులకు మద్దతుగానే నిలబడ్డాయి.

హ‌త్రాస్ ఘ‌ట‌న‌కు రెండేళ్ళు... అక్కడ నిందితులకే మద్దతు ఎక్కువ
X

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించిన హ‌త్రాస్ ఘ‌ట‌న‌కు నేటితో రెండేళ్లు. ఉత్త‌ర ప్ర‌దేశ్ లోని హ‌త్రాస్ గ్రామంలో 14 సెప్టెంబ‌ర్ 2020న ఓ ద‌ళిత బాలిక‌పై అగ్ర‌వ‌ర్ణాలకు చెందిన‌ వ్య‌క్తులు అత్యాచారం చేసి ఆమె మృతికి కార‌ణ‌మ‌య్యారు. ఆమె కొన ఊపిరితో చికిత్స పొందుతూ ఢిల్లీ లోని స‌ఫ్ద‌ర్ జంగ్ ఆస్ప‌త్రిలో 20 సెప్టెంబ‌ర్ న మ‌ర‌ణించింది. అక్టోబ‌ర్ 4, 2020న అత్యాచార ఆరోప‌ణ‌ల‌పై ఠాకూర్ వ‌ర్గానికి చెందిన న‌లుగురు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు.

బాధితురాలు మరణించిన రెండు నెలల తర్వాత డిసెంబర్ 2020లో, నిందితులు బాధితురాలిపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు పేర్కొంటూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో విచార‌ణ నేటికీ కొన‌సాగుతూనే ఉంది. ఈ దారుణ ఘ‌ట‌న జ‌రిగి రెండేళ్ళ‌యిన నేపథ్యంలో బాధిత కుటుంబం ఎలా ఉంది..గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఓ ఆంగ్ల వెబ్ సైట్ ప్ర‌తినిధి బృందం హ‌త్రాస్ గ్రామానికి వెళ్ళింది.

ఆ గ్రామంలో ఇంత దారుణం జ‌రిగినా ఇంకా అగ్ర‌వ‌ర్ణాల వారంతా నిందితుల వైపే నిలబడి, నిందితులంతా అమాయ‌కులంటూ చెప్ప‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఈ ఘ‌ట‌నలో అరెస్టులు జ‌రిగిన‌ప్పుడే ఆర్ఎస్ఎస్‌, క‌ర్ణిసేన‌. బ‌జ‌రంగ‌ద‌ళ్ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి క‌లిసి బిజెపి నేత మాజీ ఎమ్మెల్యే రాజ్ వీర్ ద‌లిర్ నిందితుల‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌ద‌ర్శన కూడా నిర్వ‌హించారు.

గృహ‌నిర్బంధంలో బాధిత కుటుంబం!

అయితే బాధిత కుటుంబీకులు మాత్రం బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే ఉంటున్నారు. ఒక ర‌కంగా చెప్పాలంటే తాము గృహ నిర్బంధంలో ఉంటున్నామ‌ని బాధిత కుటుంబీకులు చెప్పారు. ఉపాధి కోసం బ‌య‌టికి వెళ్ళే ప‌రిస్థితులు లేవ‌న్నారు. గ్రామంలో ప్ర‌జ‌ల మ‌ద్య‌కు వెళ్ళ‌డం సుర‌క్షితం కాద‌ని భ‌య‌ప‌డుతున్నామ‌ని బాధితురాలి సోద‌రుడొక‌రు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన లీగ‌ల్ వ్య‌వ‌హారాల‌న్నీ ఆయ‌నే చూసుకుంటున్నాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత వారి ఇంటిని సిఆర్పిఎఫ్ జ‌వాన్లు కాప‌లా కాస్తున్నారు. ఈ జ‌వాన్లు ఇక్క‌డినుంచి త‌ప్పుకుంటే మా ప్రాణాలు ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టేన‌ని భ‌యం వ్య‌క్తం చేశారు.

ఈ సంఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత గ్రామంలోంచి క‌నీసం ఒక్క‌రు కూడా త‌మ‌ను ప‌రామ‌ర్శించ‌డానికి కానీ ఓదార్చ‌డానికి కానీ రాలేద‌ని చెప్పారు. పైగా రోజు రోజుకీ నిందితుల‌కే గ్రామ‌స్తులు మ‌ద్ద‌తు పెరుగుతోంద‌ని అన్నారు.

గ్రామ‌స్తులంతా అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన వారు కావ‌డం వ‌ల్లే నిందితుల‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్నార‌ని బాధితురాలి సోద‌రుడు అంటున్నారు. "ఆడ కూతురికి అన్యాయం జరిగిన విష‌యాన్ని వారు త‌ప్పుగా ప‌రిగ‌ణించ‌డం లేదు. వారు కేవ‌లం కులాన్ని మాత్ర‌మే చూస్తున్నారు. కుల‌మే వారికి ప్ర‌ధానం.. మ‌నిషి జీవితం కాదు." అని అతను అన్నాడు. ఘ‌ట‌న జ‌రిగే నాటికి గ్రామంలో నాలుగు ద‌ళిత కుటుంబాలు ఉండేవి. ఆ త‌ర్వాత నెల రోజుల‌కే ప్రాణ‌ భ‌యంతో రెండు ద‌ళిత కుటుంబాలు గ్రామం విడిచి పారిపోయాయి. ఇప్పుడు మాతో పాటు ఒక కుటుంబం మాత్ర‌మే ఇక్క‌డ ఉంటోంద‌ని చెప్పారు. త‌మ‌కుటుంబం పట్ల గ్రామస్తుల ప్రవర్తన, వైఖరి గురించి చెప్పాలంటే కులతత్వం తప్ప మరోటి లేదని బాధితురాలి సోదరుడు చెబుతున్నాడు. "దేశవ్యాప్తంగా దళితులపై అణచివేత, అంటరానితనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్క‌డా అదే జరిగింది, జరుగుతున్నది." అని ఆయన అన్నారు.

వేళ్ళూనుకున్న కుల త‌త్వం ..

ఠాకూర్ కులస్తులు మాత్రం గ్రామంలో కులమతాలకు తావు లేదు అని చెప్తూనే కుల తత్వ మాటలు మాట్లాడారు.

''మా గ్రామంలో కులమతాలకు తావు లేదు.. దళితుల ఇంట్లో పెళ్లి జరిగినప్పుడల్లా వెళ్లి వధూవరులకు డబ్బులు ఇస్తుంటాము. అయితే మేము వారి పెళ్ళిళ్ళ‌కు వెళ్ళినా అక్క‌డ భోజ‌నాలు మాత్రం తినం..అది అసాధ్యం " అని విజ‌య సింగ్ అనే ఠాకూర్ కులస్తుడు చెప్పాడు. గ్రామంలో ఠాకూర్ల‌కు, ద‌ళిత కుటుంబాల‌కు మ‌ద్య ఎప్పుడైనా పెళ్ళిళ్లు జ‌రిగాయా అని అడ‌గ్గా..అటువంటివి ఇక్క‌డ ఎప్పుడూ జ‌రగలేదు.. ఇక ముందు కూడా జ‌ర‌గ‌బోవు అని అన్నాడు.

బాధిత దళిత కుటుంబానికి పొరుగున ఉన్న మధ‌న్ సింగ్ మాట్లాడుతూ.. హత్రాస్‌లో మహిళలపై నేరాలు జరుగుతున్నాయ‌న్న వాద‌న‌ను తోసిపుచ్చారు. మేమంతా కష్టప‌డి ప‌నిచేస్తుంటే మ‌హిళ‌లు మాత్రం విలాసంగా ఉంటుంటార‌ని చెప్పాడు. రెండేళ్ళ‌ క్రితం జ‌రిగిన అత్యాచారం సంగ‌తేంట‌ని ప్ర‌శ్నిస్తే.. అదంతా అబ‌ద్ధం. నిజం కాద‌న్నాడు. విచిత్రం ఏంటంటే.. పురుషులే కాదు గ్రామంలోని అగ్రకుల మ‌హిళ‌లు కూడా ఇక్క‌డ తామంతా స్వేచ్ఛ‌గా, సుర‌క్షితంగా తిరుగుతున్నామ‌ని చెప్పారు. "ఇక్కడ మహిళలను ఎవరూ ఇబ్బంది పెట్టరు. మేమంతా ఇక్కడ సురక్షితంగా జీవిస్తున్నాం" అని ఉన్నతి గెహ్లాట్ అనే మహిళ అన్నారు.

మాట‌ల‌కే ప‌రిమిత‌మైన ప్ర‌భుత్వ హామీలు..

బాధితురాలు మ‌ర‌ణించిన‌ప్పుడు ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప‌లు హ‌మీలు ఇచ్చింది. బాధిత కుటుంబానికి రూ.25 ల‌క్ష‌ల ప‌రిహారం, కుటుంబంలో ఒక‌రికి ప్ర‌భుత్వ‌ ఉద్యోగం, ప‌క్కా ఇల్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. కానీ నేటికీ ప‌రిహారం తప్ప‌ ఇతర ఏ హామీ అమ‌ల‌వ‌లేదు .

''మేము ప‌నుల కోసం బ‌య‌టికి వెళ్ళ‌లేక‌ పోవ‌డంతో ప్రభుత్వం ఇచ్చిన పరిహారం కూడా త్వరగా ఖ‌ర్చుఅయిపోతోంది.. అది అయిపోయాక ఏం చేస్తాం.. ఆ డబ్బుతో ఇల్లు నిర్వహణకు, కోర్టుకు వెళ్లేందుకు ఖ‌ర్చుల‌న్నీ మేమే చూసుకోవాలి. ప్రభుత్వం నుండి మరో సహాయం లేదు" అని బాధితురాలి సోదరుడు చెప్పాడు.

బాధితురాలి కుటుంబానికి లిఖితపూర్వకంగా ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులు బాధిత కుటుంబ సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని 2022 జూలై 26న అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొంది. బాధిత కుటుంబాన్ని హత్రాస్ వెలుపలకు తరలించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర అధికారులను ధర్మాసనం ఆదేశించింది.

Next Story