Telugu Global
National

జార్ఖండ్ లో అవమానం.. దర్యాప్తు సంస్థలతో బీజేపీ నీచ‌ రాజకీయం..

జార్ఖండ్ ఎమ్మెల్యేలకు ఆశ్రయమిచ్చిన మూడు రాష్ట్రాల నేతల ఇళ్లలో ఐటీ, ఈడీ, సీబీఐ సోదాలు జరిగాయి. జార్ఖండ్ లో `ఆపరేషన్ లోటస్` ఫెయిల్ కావడమే ఈ దాడుల వెనక ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.

జార్ఖండ్ లో అవమానం.. దర్యాప్తు సంస్థలతో బీజేపీ నీచ‌ రాజకీయం..
X

ఆపరేషన్ లోటస్ జార్ఖండ్ లో ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. జేఎంఎం ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి, హేమంత్ సోరెన్ ను పదవినుంచి దింపేయాలని బీజేపీ వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసికొట్టింది. విశ్వాస పరీక్షలో నెగ్గిన సోరెన్, బీజేపీకి షాకిచ్చారు. దీంతో మరో నీచ‌ రాజకీయానికి ఒడిగట్టింది బీజేపీ. జేఎంఎం ఎమ్మెల్యేలకు ఆశ్రయమిచ్చిన నాయకుల ఇళ్లపైకి ఐటీ, ఈడీ, సీబీఐని ఉసిగొల్పింది. రాజస్థాన్‌ హోంమంత్రి రాజేందర్‌ యాదవ్‌, చ‌త్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌, బెంగాల్ న్యాయశాఖ మంత్రి మలయ్ ఘటక్ ఇళ్లు, వారి అనుచరులపై మూడు దర్యాప్తు సంస్థలు దాడి చేశాయి. బుధవారం 8 రాష్ట్రాల్లో దాడులు జరిగినా.. ఈ మూడు రాష్ట్రాల విషయం ఇప్పుడు హైలెట్ అవుతోంది.

ఆదాయం లెక్కలు చూపని కారణంతో.. పలు స్వచ్ఛంద సంస్థలతోపాటు, ఎన్నికల కమిషన్‌ వద్ద రిజిస్టర్‌ అయి గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు(ఆర్.యు.పి.పి.) సంబంధించి ఐటీ అధికారులు 8 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు జరిపారు. దాడులకు సరైన కారణం ఉందని కేంద్రం సర్దిచెప్పుకుంటున్నా.. మూడు రాష్ట్రాల విషయంలో మాత్రం ప్రతీకారమే పరమావధి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జార్ఖండ్ లో విశ్వాస పరీక్ష సందర్భంగా సీఎం హేమంత్ సోరెన్ తన అనుచరుల్ని మూడు గ్రూపులుగా విడగొట్టి రాజస్థాన్, చ‌త్తీస్ గఢ్, బెంగాల్ కి తరలించారు. ఆ తర్వాత అందరూ చత్తీస్ గఢ్ వచ్చి అక్కడినుంచి నేరుగా విశ్వాస పరీక్షకు హాజరై తమ సత్తా చూపించారు. ఈ వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకున్న బీజేపీ ఇప్పుడు జేఎంఎం ఎమ్మెల్యేలకు ఆశ్రయమిచ్చినవారిపై ప్రతీకారం తీర్చుకుంటోంది. చత్తీస్ గఢ్ సీఎం అనుచరులైన వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. జార్ఖండ్ రాజకీయ సంక్షోభ సమయంలో జేఎంఎం ఎమ్మెల్యేలకు ఆశ్రయం ఇచ్చినందుకే తమ రాష్ట్రంపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పారని సీఎం భూపేష్ బఘేల్ విమర్శించారు. బెంగాల్‌ న్యాయ శాఖ మంత్రి మలయ్‌ ఘటక్‌, రాజస్థాన్‌ హోంమంత్రి రాజేంద్ర యాదవ్‌ కూడా ఇవి పూర్తిగా రాజకీయ ప్రతీకార దాడులేనని అంటున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని, ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసేందుకే దాడులతో భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.

First Published:  8 Sep 2022 2:20 AM GMT
Next Story