Telugu Global
National

చంద్రునిపై ఆక్సిజన్‌.. ల్యాండర్‌ నుంచి మరో కీలక అప్డేట్‌

చంద్రునిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు అక్కడి రసాయన ఖనిజాలను పరిశోధించేందుకు ఈ LIBS పేలోడ్‌ను పంపించారు. ఈ పేలోడ్‌ను బెంగళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ల్యాబొరేటరీలో అభివృద్ధి చేసినట్లు ఇస్రో తెలిపింది.

చంద్రునిపై ఆక్సిజన్‌.. ల్యాండర్‌ నుంచి మరో కీలక అప్డేట్‌
X

చంద్రయాన్‌-3 నుంచి మరో కీలక అప్డేట్ వచ్చేసింది. చంద్రుని ఉపరితలంపై సక్సెస్‌ఫుల్‌గా తిరుగుతున్న ప్రజ్ఞాన్‌ రోవర్‌.. అక్కడి ఉపరితలంపై చేసిన పరిశోధనలో కీలక అంశాలను గుర్తించింది. ఇందులోని లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ - LIBS పేలోడ్‌.. చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్‌ ఉనికిని స్పష్టంగా గుర్తించింది. దీంతో పాటు అల్యూమినియం, కాల్షియం, ఫెర్రమ్‌, క్రోమియం, టైటానియం, సిలికాన్, మాంగనీస్‌, ఆక్సిజన్‌ మూలకాలను సైతం గుర్తించింది. ఇక హైడ్రోజన్‌ ఉనికి కోసం పరిశోధన కొనసాగిస్తుందని ఇస్రో స్పష్టం చేసింది. ఇది చంద్రుడి మీద కొనసాగించబోయే అంతరిక్ష ప్రయోగాలకు అత్యంత కీలకమైన కానుంది.

చంద్రునిపై మట్టి, రాళ్లను అధ్యయనం చేసేందుకు అక్కడి రసాయన ఖనిజాలను పరిశోధించేందుకు ఈ LIBS పేలోడ్‌ను పంపించారు. ఈ పేలోడ్‌ను బెంగళూరులోని ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్స్ ల్యాబొరేటరీలో అభివృద్ధి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ పరికరం అత్యంత తీక్షణమైన లేజర్‌ను చంద్రుడి ఉపరితలంపైకి ప్రయోగిస్తుంది. దీంతో అక్కడి మట్టి కరిగి కాంతి విడుదల అవుతుంది. ఆ కాంతి విడుదల అయినప్పుడు.. దానిలోని తరంగ ధైర్ఘ్యాన్ని విశ్లేషించడం ద్వారా.. అక్కడున్న రసాయన మూలకాలను, పదార్థాలను గుర్తిస్తుంది. ఈ LIBS చంద్రుడి ఉపరితలంపై 14 రోజుల పాటు తిరుగుతూ.. వేర్వేరు చోట్ల విశ్లేషించిన సమాచారాన్ని ల్యాండర్‌కు పంపిస్తుంది. ఆ సమాచారాన్ని ల్యాండర్ భూమ్మీదున్న డీప్ స్పేస్ నెట్ వర్క్‌కు పంపిస్తుంది. ఆ డేటాను విశ్లేషించడం ద్వారా చంద్రుడి ఉపరితలంపై ఉన్న మూలకాల్ని ఇస్రో గుర్తిస్తుంది.

ఇక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రయాన్‌-3 మిషన్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా జూలై 14న చంద్రయాన్‌-3 శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. దాదాపు 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధృవంలో సాఫ్ట్ ల్యాండ్ అయింది. ఇప్పటికే ఈ మిషన్ వారం రోజులు పూర్తి చేసుకుంది. మరో వారం రోజుల పాటు ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు కొనసాగించనున్నాయి.

First Published:  30 Aug 2023 1:00 AM GMT
Next Story