Telugu Global
National

భూమి చుట్టూ 3 రౌండ్లు కొట్టిన ఆదిత్య L1.. ఇప్పుడు నాలుగు..

అర్ధరాత్రి దాటిన తరువాత 2:15 నిమిషాల సమయంలో మారిషస్‌లోని గ్రౌండ్ స్టేషన్ నుంచి ఎర్త్‌బౌండ్ ఫైరింగ్‌తో నాల్గవసారి క‌క్ష్య‌ను మార్చిన‌ట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు.

భూమి చుట్టూ 3 రౌండ్లు కొట్టిన ఆదిత్య L1.. ఇప్పుడు నాలుగు..
X

భారతదేశం మొదటి సన్ మిషన్ ఆదిత్య L1 ప్రయోగాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తోంది ఇస్రో. ప్రస్తుతం భూ కక్ష్య చుట్టూ పరిభ్రమిస్తోన్న ఈ శాటిలైట్ క‌క్ష్య‌ను ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు మరోసారి విజ‌య‌వంతంగా మార్చారు. ఆదిత్య ఎల్1 ప్రయోగం అనంతరం దాని భూకక్ష్యను మార్చడం ఇది నాలుగోసారి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ విషయాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియజేసింది.

ఆదిత్య L1 ఇది భారతదేశపు మొదటి అంతరిక్ష అబ్జర్వేటరీ. సూర్యుడు, భూమి మధ్య ఐదు లాగ్రాంజ్ పాయింట్లు ఉన్నాయి. గ్రహణం లేదా అడ్డంకులు లేకుండా సూర్యుడు కనిపించే ప్రదేశాన్ని లాగ్రేంజ్ పాయింట్ అంటారు. ఆదిత్య ఎల్1 వ్యోమనౌకను లాగ్రాంజ్ పాయింట్ 1కి పంపుతున్నారు. భూమికి, ఈ లాగ్రాంజ్ పాయింట్ 1 దూరం 15 లక్షల కిలోమీటర్లు కాగా సూర్యుడి నుంచి భూమికి ఉన్న దూరం 15 కోట్ల కిలోమీటర్లు.

అర్ధరాత్రి దాటిన తరువాత 2:15 నిమిషాల సమయంలో మారిషస్‌లోని గ్రౌండ్ స్టేషన్ నుంచి ఎర్త్‌బౌండ్ ఫైరింగ్‌తో నాల్గవసారి క‌క్ష్య‌ను మార్చిన‌ట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని పనితీరు సంతృప్తికరంగా ఉందని, ప్రయాణం సజావుగా సాగుతోందని తెలిపారు. ప్ర‌స్తుతం ఆదిత్య ఎల్‌1 భూమికి 256 x 1,21,973 కిలోమీట‌ర్ల దూరంలో పరిభ్రమిస్తోంది.

సెప్టెంబరు 3, 5, 10 తేదీల్లో ఆదిత్య L1 అంతరిక్ష నౌక మూడు విన్యాసాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు చేసినది నాల్గవది కాగా.. తదుపరి విన్యాసం ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ (TL1I) సెప్టెంబర్ 19న తెల్లవారుజామున 2 గంటలకు జరుగుతుందని భారత అంతరిక్ష సంస్థ తెలిపింది.

ఇస్రో అంతరిక్ష నౌక భూమి చుట్టూ 16 రోజుల పాటు తిరగనుంది. ఈ సమయంలోనే తరువాత సూర్యునివైపుగా సాగే తదుపరి ప్రయాణానికి అవసరమైన వేగం పొందుతుంది. అలా ఐదవ ఎర్త్ బౌండ్ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, ఆదిత్య L1 లాగ్రాంజ్ పాయింట్‌కి బయలుదేరుతుంది. బెంగళూరు, మారిషస్, శ్రీహరికోట, పోర్ట్ బ్లెయిర్‌లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్‌లు ఈ ఉపగ్రహాన్ని విజయవంతంగా ట్రాక్ చేస్తున్నాయి.

First Published:  15 Sep 2023 5:24 AM GMT
Next Story