Telugu Global
National

ఇస్రో తర్వాత ఏ గ్రహం పైకి రాకెట్ పంపడానికి రెడీ అవుతోంది?

ఇస్రో ఈ సారి ఏ ప్రయోగం చేపట్టనుందని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దీనికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ సమాధానం చెప్పారు.

ఇస్రో తర్వాత ఏ గ్రహం పైకి రాకెట్ పంపడానికి రెడీ అవుతోంది?
X

చంద్రయాన్-3, ఆదిత్య ఎల్-1 విజయాలతో మంచి ఊపు మీద ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తర్వాత ఏం చేయబోతోంది. మన దేశ అంతరిక్ష పరిశోధనలను మరో మెట్టు ఎక్కించడానికి ఈ సారి ఏ ప్రయోగం చేపట్టనుందని ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దీనికి ఇస్రో చైర్మన్ సోమనాథ్ సమాధానం చెప్పారు. ఇస్రో తర్వాత శుక్ర గ్రహాన్ని టార్గట్ చేసిందని స్పష్టం చేశారు. సౌర వ్యవస్థలోనే అత్యంత ప్రకాశవంతమైన గ్రహమైన శుక్రుడి మీద వాతావరణాన్ని అధ్యయనం చేయాలని ఇస్రో నిర్ణయించిందని చెప్పారు.

ఇస్రో లిస్టులో పలు అంతరిక్ష ప్రయోగాలు లైన్‌లో ఉన్నాయి. ఇందులో శుక్రుడికి సంబంధించిన ప్రయోగం కూడా ఉందని చెప్పారు. ఇప్పటికే వీనస్ మిషన్‌కు అవసరమైన పేలోడ్లు కూడా అభివృద్ధి చేశామని సోమనాథ్ చెప్పారు. శుక్రుడు చాలా ఆసక్తికరమైన గ్రహం. సౌర వ్యవస్థలోనే అత్యంత ప్రకాశవంతమైన వీనస్ గురించి అనేక ప్రశ్నలకు సమాధానాలు రావల్సిన అవసరం ఉన్నదని సోమనాథ్ అన్నారు.

వీనస్ వాతావరణం చాలా దట్టంగా ఉంది. అక్కడ ఒత్తిడి భూమి కంటే 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఆ గ్రహం పూర్తిగా యాసిడ్స్‌తో నిండి ఉంది. ఆ గ్రహం ఉపరితలం ఎలా ఉంటుందో ఇప్పటికీ అంచనా లేదు. మెత్తగా ఉంటుందా.. గట్టిగా ఉంటుందా అనే విషయాలు తెలియదు. కాబట్టి ఆ గ్రహంపై దిగడం కుదరదు. అయితే దాని చుట్టూ పరిభ్రమిస్తూ అనేక విషయాలు తెలుసుకునే ఆస్కారం ఉందని సోమనాథ్ చెప్పారు.

భూమి కూడా ఏదో ఒక రోజు వీనస్ లాగా మారిపోవచ్చు. 10 వేల ఏళ్ల తర్వాత మన భూమి రూపు రేఖలు వీనస్ లాగా అవుతాయేమో చెప్పలేము. కొన్ని వేల ఏళ్ల క్రితం భూమి ఇప్పుడున్న మాదిరిగా లేదు. అప్పట్లో నివాస యోగ్యంగా లేదు. ఇక భవిష్యత్‌లో భూమి ఎలా మారుతుందో మనం అంచనా వేయలేమని సోమనాథ్ అన్నారు. సూర్యడి నుంచి రెండో గ్రహం శుక్రుడు. మన భూమికి అత్యంత దగ్గరగా ఉండటమే కాకుండా.. దాదాపు భూమి సైజులోనే శుక్రుడు ఉంటాడు. ఒక రకంగా సోలార్ సిస్టమ్‌లో భూమి, శుక్రుడిని ట్విన్స్ అని పిలవవచ్చు. అందుకే ఆ గ్రహానికి సంబంధించిన పరిశోధనలపై ఇస్రో ఆసక్తిగా ఉందని చెప్పారు.

First Published:  27 Sep 2023 4:33 AM GMT
Next Story