Telugu Global
National

ఇస్రో సత్తా తేలేది నేడే.. ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేస్తాయా..?

ప్రస్తుతం ల్యాండర్‌, రోవర్‌ ఉన్న జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద తిరిగి సూర్యోదయం అయింది. వాటిని నిద్ర నుంచి లేపి, కమ్యూనికేషన్‌ ను తిరిగి ప్రారంభించేందుకు ఇస్రో రెడీ అయింది.

ఇస్రో సత్తా తేలేది నేడే.. ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేస్తాయా..?
X

ఏదైనా వస్తువుని పునర్వినియోగించడంలో భారతీయులకు తిరుగులేదు అనే పేరుంది. ఇస్రో శాస్త్రవేత్తలు కూడా అందుకు మినహాయింపు కాదు. 14రోజుల జీవితకాలంతో తయారైన ల్యాండర్, రోవర్ ను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వాటిలోని సోలార్ ప్యానెళ్లు తిరిగి తెరచుకున్నాయి, అవి రీఛార్జ్ అయితే ల్యాండర్, రోవర్ మరికొన్నిరోజులు పనిచేస్తాయి. అంటే ఇస్రో మరో ఘనత సాధించినట్టే లెక్క.

చంద్రుడిపై పగలు 14 రోజులపాటు ఉంటుంది. చంద్రయాన్-3 ప్రయోగం కూడా ఈ పగటి సమయాన్ని ఆధారంగా చేసుకుని జరిగింది. పగలు ప్రారంభమయ్యే సమయంలోనే ల్యాండర్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ అయింది. ఆ తర్వాత రోవర్ బయటకొచ్చి పని మొదలు పెట్టింది. 14రోజులపాటు సమర్థంగా పనిచేశాయి. ఆ తర్వాత ల్యాండర్, రోవర్‌ను నిద్రాణ స్థితిలోకి పంపించారు. రాత్రి వేళ చంద్రుడిపై మైనస్ 120 డిగ్రీల నుంచి మైనస్ 200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ఆ పరిస్థితుల్లో ఈ రెండు పరికరాలు పనిచేయలేవు. అందుకే నిద్రాణ స్థితిలోకి పంపారు. తిరిగి చంద్రుడి దక్షిణ ధృవంపై సూర్యోదయం అయింది. ఇప్పుడు వాటిని నిద్రలేపి(చార్జ్ చేసి) తిరిగి పనిచేయించడానికి ఇస్రో ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం ల్యాండర్‌, రోవర్‌ ఉన్న జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద తిరిగి సూర్యోదయం అయింది. ఈ నేపథ్యంలో వాటిని నిద్ర నుంచి లేపి, కమ్యూనికేషన్‌ ను తిరిగి ప్రారంభించేందుకు ఇస్రో రెడీ అయింది. విక్రమ్‌, ప్రజ్ఞాన్‌ లోని బ్యాటరీలు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఈరోజు పూర్తిగా ఛార్జ్‌ అయ్యే అవకాశముందని ఇస్రో స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ డైరెక్టర్‌ నీలేష్‌ దేశాయ్‌ తెలిపారు. అదృష్టం బాగుండి ల్యాండర్‌, రోవర్‌ తిరిగి పనిచేయడం ప్రారంభిస్తే మరింత కీలక డేటా ఇస్రోకి చేరుతుంది. ఆ రెండిటినీ భారత్ మరింత సమర్థంగా ఉపయోగించుకున్నట్టవుతుంది.


First Published:  22 Sep 2023 6:21 AM GMT
Next Story