Telugu Global
National

మాంసం విక్రేతలకు ఇస్కాన్ ఆవులను అమ్మేస్తోంది..

ఇస్కాన్ ఒక పెద్ద మోసపూరితమైన సంస్థ. ఇది అనేక గోశాలలను నిర్వహిస్తోంది. వాటి పేరుతో ప్రభుత్వం నుంచి అనేక లాభాలు పొందింది. దేశవ్యాప్తంగా భారీగా భూములు కూడా సంపాదించిందని మనేకా గాంధీ ఆరోపించారు.

మాంసం విక్రేతలకు ఇస్కాన్ ఆవులను అమ్మేస్తోంది..
X

ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ క్రిష్ణ కాన్షియస్‌నెస్) ఈ దేశాన్ని మోసం చేస్తోంది. ఆ సంస్థ ఒక పెద్ద చీటర్. వారి గోశాలల నుంచి భారీగా ఆవులను మాంసం విక్రేతలు (కసాయి) లకు అమ్మేస్తోందని బీజేపీ ఎంపీ మనేకా గాంధీ ఆరోపించారు. కృష్ణ తత్వాన్ని బోధిస్తూ ప్రపంచ వ్యాప్తంగా అనే ఆలయాలను కలిగి ఉన్న ఇస్కాన్.. దేశంలో పలు చోట్ల గోశాలలను కూడా నిర్వహిస్తోంది. కాగా, ఆ సంస్థపై మేనక గాంధీ సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన ఆరోపణలు చేశారు. జంతు హక్కుల కార్యకర్తగా ఎప్పటి నుంచో పని చేస్తున్న మనేకా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

ఈ దేశంలో ఇస్కాన్ ఒక పెద్ద మోసపూరితమైన సంస్థ. ఇది అనేక గోశాలలను నిర్వహిస్తోంది. వాటి పేరుతో ప్రభుత్వం నుంచి అనేక లాభాలు పొందింది. దేశవ్యాప్తంగా భారీగా భూములు కూడా సంపాదించిందని మనేకా గాంధీ ఆరోపించారు. కొంత కాలం క్రితం తాను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఇస్కాన్ నిర్వహిస్తున్న గోశాలకు వెళ్లాను. అక్కడ పాలు ఇవ్వని ఆవు ఒక్కటి కూడా లేదు. వట్టి పోయిన ఆవులు అసలు ఆ గోశాలలో కనిపించలేదు. ఎందుకంటే ఆయా ఆవులన్నింటినీ ఇస్కాన్ కసాయిలకు అమ్మేసిందని మనేకా గాంధీ అన్నారు.

కసాయిలకు భారీ సంఖ్యలో ఆవులను ఇస్కాన్ అమ్ముకొని సొమ్ము చేసుకుంటోంది. దేశంలో ఇంత భారీ సంఖ్యలో ఆవులను ఎవరూ కసాయిలకు విక్రయించడం లేదు. రోడ్లపై 'హరే రామ హరే క్రిష్ణ' అంటూ నినాదాలు చేసుకుంటూ వెళ్తారు. కానీ వెనుక మాత్రం వీళ్లు చేసేది ఇలాంటి దుర్మార్గపు పనులని మనేకా ఆరోపించారు. ఆవులను అమ్ముకుంటూ.. తమ జీవితం మాత్రం పాల మీదే ఆధారపడిందని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు.

కాగా, మనేకా గాంధీ చేసిన ఆరోపణలను ఇస్కాన్ తీవ్రంగా ఖండించింది. ఇస్కాన్ జాతీయ ప్రతినిధి మాట్లాడుతూ.. ఆవులు, ఎద్దుల సంరక్షణలో ఇస్కాన్ ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. ఇస్కాన్ కోసం పాలను ఇచ్చే ఆవులు, సేవ చేసే ఎద్దులు ఎప్పుడు కూడా కసాయిలకు అమ్మలేదని పేర్కొన్నారు. బీఫ్ ఎక్కువగా తినే దేశాల్లో కూడా ఆవులను ఇస్కాన్ రక్షిస్తోందని గుర్తు చేశారు. ఇస్కాన్ గురించి మనేకా గాంధీ ఇలాంటి ఆరోపణలు చేయడం మాకు ఆశ్చర్యాన్ని కలిగించిందని అన్నారు.

First Published:  27 Sep 2023 3:30 AM GMT
Next Story