Telugu Global
National

యూపీఏ పేరును మార్చబోతున్నారా? ఇవ్వాళ కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రతిపక్ష కూటమి!

సోమవారం సాయంత్రం బెంగళూరులోని తాజ్ వెస్ట్ఎండ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన డిన్నర్‌కు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం చర్చించాల్సిన కీలక అజెండాను రూపొందించారు.

యూపీఏ పేరును మార్చబోతున్నారా? ఇవ్వాళ కీలక నిర్ణయం తీసుకోనున్న ప్రతిపక్ష కూటమి!
X

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నాయి. 'యునైటెడ్ వీ స్టాండ్' (మేము ఐక్యంగా నిలబడతాము) అనే నినాదంతో బెంగళూరులో రెండు రోజుల సదస్సును ఏర్పాటు చేశారు. ఇటీవల పట్నాలో జరిగిన సమావేశం అనంతరం.. తాజాగా సోమ, మంగళవారాల్లో కీలక భేటీని బెంగళూరులో నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పలు ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు అందాయి. అయితే, ఎన్సీపీ టాప్ లీడర్ శరద్ పవార్ మినహా.. మిగిలిన విపక్ష నాయకులు అందరూ హాజరయ్యారు.

సోమవారం సాయంత్రం బెంగళూరులోని తాజ్ వెస్ట్ఎండ్ హోటల్‌లో ఏర్పాటు చేసిన డిన్నర్‌కు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం చర్చించాల్సిన కీలక అజెండాను రూపొందించారు. ఏయే అంశాలను లాంఛనంగా చర్చించాలనే విషయంపై ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. పట్నాలో సమావేశానికి 24 పార్టీలు రాగా.. బెంగళూరు సమావేశానికి 26 పార్టీల నాయకులు వచ్చినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ వెల్లడించారు.

మంగళవారం ఉదయం 11 గంటల నుంచి కీలకమైన సమావేశం జరుగనున్నది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, ఝూర్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్, ఉద్దవ్ ఠాక్రే, లాలూ ప్రసాద్ యాదవ్, మెహబూబా ముఫ్తీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, ఎండీఎంకే నేత వైగో, ఆర్ఎల్‌డీ నాయకుడు జయంత్ చౌదరి తదితరులు పాల్గొన్ననున్నారు. ఈ సమావేశానికి జేడీఎస్‌ను ఆహ్వానించలేదని కాంగ్రెస్ వెల్లడించింది.

కూటమి పేరు మార్పు..

యూపీఏ రెండు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్నది. గతంతో పోలిస్తే కొన్ని పార్టీలు యూపీఏ నుంచి వెళ్లిపోగా.. మరికొన్ని ఎన్టీయే నుంచి బయటకు వచ్చి ప్రతిపక్ష పార్టీలుగా మారాయి. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యూపీఏను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు కూడా అదే పేరుతో కొనసాగాలా? వద్దా అనే విషయంపై మంగళవారం జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. యూపీఏ స్థానంలో కొత్త పేరును సూచించడంతో పాటు.. రాష్ట్రాల వారీగా సీట్ల పంపకం, సమన్వయం కోసం మరో కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించవచ్చనే చర్చ జరుగుతోంది. అన్ని పార్టీలను సమన్వయం చేస్తూ.. ఆయా పార్టీల ఎజెండా, ర్యాలీలు, ఉద్యమాల తయారీలో ఈ కమిటీ కీలకంగా వ్యవహరించనున్నది.

కొత్త ప్రతిపక్ష కూటమికి యూపీఏ పేరు బదులు మరో మహాకూటమి ఏర్పడే అవకాశం ఉందని తెలుస్తున్నది. విపక్షాల సమావేశానికి ముందే.. కాంగ్రెస్ నాయకులు ఆయా పార్టీల లీడర్లకు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. బెంగళూరులో జరుగుతున్న సమావేశాలు భారత రాజకీయాల్లో గేమ్ ఛేంజర్‌గా మారనున్నదని కాంగ్రెస్ పేర్కొన్నది. రాబోయే లోక్‌సభ ఎన్నికలే అజెండాగా ఈ సమావేశం జరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించాలన్నదే కాంగ్రెస్ లక్ష్యంగా ఉన్నది. ఒక్కో రాష్ట్రానికి.. ఒక్కో విధంగా సీట్ల షేరింగ్‌ ఫార్ములాను రూపొందించే అవకాశం కూడా ఉన్నది.

ఇక ఈ కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరనే విషయంపై అన్ని పార్టీలు ఇంకా ఏకతాటిపైకి రాలేదు. అయితే కాంగ్రెస్ మాత్రం రాహుల్ గాంధీనే ముందు పెట్టే అవకాశం ఉన్నది. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గ్రాఫ్ అనూహ్యంగా పెరగడం.. ప్రజల్లో కూడా ఆయన పట్ల నమ్మకం కుదురుతుండటంతో రాహుల్ వైవే మొగ్గు చూపుతోంది. అయితే, ప్రస్తుతానికి ప్రధాని అభ్యర్థిపై పెద్దగా చర్చ జరగకపోవచ్చని.. ప్రతిపక్షాల ఐక్యత పైనే దృష్టి పెడతారని తెలుస్తున్నది.


First Published:  18 July 2023 1:37 AM GMT
Next Story