Telugu Global
National

ఇవి వార్తలా? ప్రకటనలా ?

కర్నాటకలో నాలుగు ప్రముఖ న్యూస్ పేపర్లలోని మొదటి పేజీల్లో గురువారంనాడు ఒకే రకమైన వార్తలు,హెడ్డింగులు, ఫోటోలు, అన్నీ ఒకే రకంగా వచ్చాయి. అది కూడా అన్నీ కాంగ్రెస్ మీద దాడి చేసే వార్తలే. ఒకే పేపర్ పైన పేర్లు మార్చారా అన్నంత ఆశ్చర్యపోవడం పాఠకుల వంతైంది. ఎందుకలా జరిగింది?

ఇవి వార్తలా? ప్రకటనలా ?
X

ఉదయాన్నే న్యూస్ పేపర్ చదవక పోతే కొందరికీ ఏమీ తోచదు..... కొందరైతే ఒకటి కన్నా ఎక్కువ న్యూస్ పేపర్లను చదువుతారు. కర్నాటకలో గురువారం ఉదయం అలా పేపర్లు చదివిన పాఠకులు ఒక్క సారి షాక్ కు గురయ్యారు. నాలుగు ప్రధాన పత్రికల మొదటి పేజీల వార్తలన్నీ సేమ్ టూ సేమ్. హెడ్డింగులు, ఫోటోలు, మొత్తం వార్తలు అన్నీ ఒకటే. ఒకే పేపర్ పైన పేర్లు మార్చారా అన్నంత ఆశ్చర్యపోవడం పాఠకుల వంతైంది.

కన్నడ ప్రభ, విశ్వవాణి, సంయుక్త కర్నాటక,హోస దిగంత అనే ప్రముఖ పత్రికలు గురువారం మొదటి పేజీ ఒకే రకంగా వచ్చాయి. ఆ వార్తలన్నీ కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ మీద వ్యతిరేకమైనవే. అవి కూడా ఇప్పటి వార్తలు కావు. గత 15 సంవత్సరాల నుండి వివిధ పత్రికల్లో వచ్చిన వివిధ వార్తలు ఆ నాలుగు పత్రికల మొదటి పేజీలో వచ్చాయి.

బ్యానర్ వార్త 2008 లో ఇండియా టుడే లో వచ్చినది. నవంబర్ 26, 2008న ముంబై ఉగ్రదాడుల గురించి కథనం అది. 'ముంబయిలో ఉగ్రదాడి జరిగినప్పుడు రాహుల్ పార్టీ మూడ్‌లో ఉన్నారు' అని హెడ్డింగ్ తో ప్రింట్ అయిన ఆ వార్త రాహుల్ గాంధీ మీద దాడి చేసింది. ఇక మరో వార్త గతంలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో వచ్చింది. 'పిఎఫ్‌ఐ/కెఎఫ్‌డిపై 175 కేసులను సిద్ధరామయ్య ప్రభుత్వం తొలగించింది'. అనేది వార్త సారాంశం.

మరో వార్త 2010లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చింది. "హిందూ రాడికల్స్ తో లష్కర్ తీవ్రవాదులకన్నా ఎక్కువ‌ ముప్పు" అని రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యల వార్త.

మరొకటి 2017 నాటి న్యూస్ .నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం దేశంలో జరుగుతున్న నేరాలలో ఢిల్లీ తర్వాత బెంగళూరులోనే అత్యంత ఎక్కువ నేరాలు జరుగుతున్నాయన్నది వార్త.

ఇక మరిన్ని వార్తలు...

పార్టీ కార్యకర్తలు గాంధీల పేరుతో తరతరాలుగా సంపదను కూడబెట్టుకుంటున్నారని జూలై 22 కర్ణాటక మాజీ స్పీకర్, కాంగ్రెస్ నాయకుడు కెఆర్ రమేష్ కుమార్ చేసిన ప్రకటన.

కాంగ్రెస్ నాయకుడు డికె శివకుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు వార్త‌

టిప్పు జయంతిని జరుపుకోవడం గర్వకారణమని సిద్ధరామయ్య ప్రకటనకు సంబంధించిన వార్త‌

రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు నిందితులుగా ఉన్న నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసుపై కథనం.

ఈ వార్తలన్నీ ఆ నాలుగు న్యూస్ పేపర్ల మొదటి పేజీలో వచ్చాయి.

ఈ అన్ని పత్రికలను బీజేపీ ప్రింట్ చేయించిందా అన్నంత అనుమానం పాఠకులకు కలిగే విధంగా ఆ వార్తలున్నాయి.

అయితే పేపర్ మొత్తం శ్రద్దగా చదివితే ఈ వార్తలు వచ్చిన మొదటి పేజీ కింద చిన్న అక్షరాలతో ఇది బీజేపీ ఇచ్చిన ప్రకటన అనేది అర్దమవుతుంది. మామూలుగా చూసే ఎవరికైనా ఈ నాలుగు పత్రికలు బీజేపీకి మద్దతుగా, కాంగ్రెస్ పై దాడి చేస్తున్నాయని అనుకుంటే ఆశ్చర్యంలేదు.

నిజానికి ఈ మొదటి పేజీ ప్రకటనలు అనేక మంది పాఠకులను గందరగోళంలో పడేశాయి. ఇది ప్రకటన అనే విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియకపోవడమే అసలు విషాదం.

రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర కర్ణాటక గుండా వెళుతున్నప్పుడు, ఈ యాత్రలో పాల్గొనడానికి కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకకు వచ్చిన సమయంలో, అందులోనూ వార్తల విధంగా నమ్మింపజేసే విధంగా ఉన్న ఈ ప్రకటన యాదృచ్చికమేమీ కాదు.

బిజెపి కర్ణాటక ట్విట్టర్ పేజీ కూడా ఈ నాలుగు పేపర్ల‌ మొదటి పేజీల్లోని కథనాలన్నింటినీ షేర్ చేసింది.

ఈ వార్తల లాంటి ప్రకటన‌పై కాంగ్రెస్ స్పందించింది."భారత్ జోడో యాత్ర సాగిన ఈ ఐదు రోజులలో వారు (బిజెపి) రెండు ప్రకటనలను విడుదల చేసారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ సమైక్య యాత్రతో వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.'' అని కాంగ్రెస్ నాయకుడు ప్రియాంక్ ఖర్గే అన్నారు.

నిజంగానే భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందనను చూసి బీజేపీ భయపడుతోందా అనుమానాలు వస్తున్నాయి. ఇలా మోసపూరిత పద్దతిలో బీజేపీ ప్రకటనలివ్వడం, వాటిని యదాతథంగా ఆ నాలుగు పత్రికలు ప్రచురించడం పై నైతిక పరమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

First Published:  7 Oct 2022 3:07 PM GMT
Next Story