Telugu Global
National

కేసీఆర్ కు మద్దతు పెరుగుతోందా..?

ప్రాంతీయపార్టీ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చి కేసీఆర్ కూడా రూటుమార్చారు. దాంతో ముఖ్యమంత్రులు విజయన్, కేజ్రీవాల్, మాన్ జిందాబాద్ చెప్పారు.

కేసీఆర్ కు మద్దతు పెరుగుతోందా..?
X

కేసీఆర్ విషయంలో జాతీయస్థాయిలో ముఖ్యమంత్రుల వైఖరి మారుతోందా..? తాజాగా ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావసభ తర్వాత అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే బహిరంగసభలో కేసీఆర్ తో పాటు పాల్గొన్న ముగ్గురు ముఖ్యమంత్రులు బీఆర్ఎస్ అధినేతకు జై కొట్టారు. బహిరంగసభకు ముఖ్య అతిథులుగా కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్ హాజరయ్యారు. తమ ప్రసంగాల‌లో వారు కేసీఆర్ నాయకత్వానికి జిందాబాద్ చెప్పారు.

రాజకీయాల్లో ఎప్పుడు ఎవరిది పైచేయిగా మారుతుందో ఎవరూ చెప్పలేరు. అలాగే రాజకీయాల్లో శాశ్వత శ‌త్రువులు, శాశ్వత మిత్రులుండరని అంటారు. తాజా బహిరంగసభలో ఈ నానుడి నిజమే అనిపించింది. కొద్దిరోజుల వరకు కేసీఆర్ అంటే చాలామంది ముఖ్యమంత్రులు టచ్ మీ నాట్ లాగా ఉండేవారు. బీజేపీ, కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ పార్టీలతో ఫ్రంట్ కట్టాలని కేసీఆర్ ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. చాలామంది సీఎంల దగ్గరకు కేసీఆర్ స్వయంగా వెళ్ళినా పెద్దగా స్పందించలేదు.

బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తమిళనాడు సీఎం స్టాలిన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉద్ద‌వ్ థాక్రే, కేజ్రీవాల్ ను రెండు, మూడుసార్లు కలిశారు. అయినా స్పందన కనబడలేదు. తర్వాత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో భేటీ అయినా పెద్ద ఉపయోగం కనబడలేదు. పనిలోపనిగా కేరళ ముఖ్యమంత్రి విజయన్ తో కూడా భేటీ అయ్యారు.

అయితే ప్రాంతీయపార్టీ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ బీఆర్ఎస్ గా మార్చి కేసీఆర్ కూడా రూటుమార్చారు. దాంతో ముఖ్యమంత్రులు విజయన్, కేజ్రీవాల్, మాన్ జిందాబాద్ చెప్పారు. కేసీఆర్ కు ముగ్గురు సీఎంల మద్దతు దొరకటమంటే మామూలు విషయంకాదు. వీళ్ళతో మమత, నితీష్ లాంటి మరో ముగ్గురు నలుగురు ముఖ్యమంత్రులు చేతులు కలిపితే జాతీయస్థాయిలో కేసీఆర్ చక్రం తిప్పటం తేలికవుతుంది. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రులు శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, శంకర్ సింగ్ వాఘేలా, గిరిధర్ గొమాంగో మద్దతు దొరికింది. సో.. 2024 ఎన్నికల నాటికి కేసీఆర్ కీలకపాత్ర పోషించంటం ఖాయమే అనిపిస్తోంది.

First Published:  19 Jan 2023 2:30 AM GMT
Next Story