Telugu Global
National

గుజరాత్‌లో బిజెపిది ఓటమి భయమా? గెలుపు వ్యూహమా?

నరేంద్ర మోదీ చరిష్మాతో గుజరాత్‌లో తిరుగులేని విజయం కోసం అన్నిరకాల జిమ్మిక్కులకు తెగబడింది కాషాయ పరివారం. మరి ఓటమి భయాల మధ్యనే గెలుపు వ్యూహాల్ని అమలు చేస్తున్న బిజెపిని కాంగ్రెస్‌, ఆప్‌లు ఎంతవరకు నిలువరించగలవో చూడాలి.

గుజరాత్‌లో బిజెపిది ఓటమి భయమా? గెలుపు వ్యూహమా?
X

గుజరాత్‌లో వ్యతిరేక పవనాలు వీచడాన్ని గమనించిన బిజెపి అధిష్టానం అసెంబ్లీ ఎన్నికల‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కనుకనే ఎన్నికల ప్రకటనకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస పర్యటనలు చేశారు. అనేక పథకాలు ప్రకటించారు. వాగ్దానాలు ఎన్నో చేశారు. బిజెపి సన్నద్ధం కావడానికి అనువుగా ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంలో ఎలక్షన్‌ కమిషన్‌ సైతం తనదైన పద్ధతిలో సహకరించింది. అయినప్పటికీ గెలుస్తామా లేదా అనే భయం పట్టుకుంది. ప్రధానమంత్రి స్వరాష్ట్రంలో ఓటమి గానీ, తక్కువ మెజారిటీగానీ తీరని నష్టం చేస్తుందన్న భయం ఏర్పడింది బిజెపి అధిష్టానానికి.

గుజరాత్‌లో నరేంద్ర మోదీ తప్ప జనాకర్షక శక్తిగల నాయకుడు బిజెపికి లేడు. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌నే అధికారంలోకి వస్తే మ‌ళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. నిజానికి భూపేంద్రపటేల్‌కు జనంలో అంత పలుకుబడి లేదు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలవారికి ఆయన గురించే తెలియదని చెబుతుంటారు. మోడీ స్వయంగా రంగంలోకి దిగితే తప్ప నెగ్గుకురాలేమని బిజెపి కేంద్ర నాయకత్వం భావించింది. అంతేగాక 2024 లోక్‌సభ ఎన్నికల కోసమైనా, మున్ముందు జరగబోయే పలు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల కోసమైనా ఇపుడు గుజరాత్‌లో బిజెపి విజయం సాధించడం తప్పనిసరి అవసరమని బిజెపి వ్యూహకర్తలు భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం నిమిత్తం నరేంద్ర మోదీ విస్తృత పర్యటనలకు శ్రీకారం చుట్టింది బిజెపి అగ్రనాయకత్వం. నవంబర్‌ 19-21 తేదీల మధ్య గుజరాత్‌లో ఎనిమిది ఎన్నికల ప్రచారసభల్లో మోదీ ప్రసంగిస్తారు. అలాగే బిజెపి తలపెట్టిన సామూహిక వివాహ కార్యక్రమానికి హాజ‌రై వధూవరుల్ని ఆశీర్వదిస్తారని, ఇది ప్రచారవ్యూహంలో అంతర్భాగమని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఇంటింటికి తిరిగి పోలింగ్ స్లిప్పులు పంచే కార్యక్రమంలో కూడా నరేంద్ర మోదీ పాల్గొనేలా చూడాలని భావిస్తోంది పార్టీ జాతీయ నాయకత్వం. ఇందుకోసం డోర్‌ టు డోర్‌ ప్రచార కార్యక్రమానికి నవంబర్‌ 28-29, డిసెంబర్‌ 2-3 తేదీలలో నరేంద్ర మోదీ హాజరవుతారని చెబుతున్నారు. జనాల్ని నేరుగా కలిసే ప్రక్రియ సామాన్య ఓటర్లని ప్రభావితం చేస్తుందన్నది వ్యూహకర్తల అంచనా. ఈ విధంగా మోదీ జనాకర్షక శక్తిని నమ్ముకొని ప్రచార వ్యూహాల్ని రూపొందించడం గమనార్హం.

ఒకవైపు హిందువుల ఓట్ల కోసం విద్వేష రాజకీయాల్ని ఇప్పటికే రాజేసింది బిజెపి. గోద్రా అల్లర్లలో ఒక వర్గం వారిని భయభ్రాంతుల్ని చేసిన నాయకులు బిజెపి ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. మత ప్రాతిపదికన ఓటర్ల మధ్య విభజన తీసుకువచ్చే కుటిల వ్యూహాల్ని అమలు చేస్తున్నారు. కుల సమీకరణలకు అనుగుణంగా అభ్యర్థుల్ని నిలబెట్టారు. గెలుపు కోసం అవసరమైన చోటల్లా కులం కార్డును ప్రయోగిస్తున్నారు.

పంజాబ్‌లో అధికారం కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ తమకోసారి చాన్స్‌ ఇవ్వమంటూ అన్నిస్థానాల్లో పోటీ చేస్తుంది. వాస్తవానికి ఆప్‌కు గుజరాత్‌లో తగిన ప్రజాపునాది, నిర్మాణం లేదు. అందువల్లనే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికకు ఆప్‌ పోటీ ఉపయోగపడి తమ గెలుపు మార్గాలను సులువు చేస్తుందని బిజెపి నేతలు అంటున్నారు.

ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ ఆర్భాటం పైకి కనిపించడం లేదు. అయితే చాలాకాలంగా గ్రామ, పట్టణ స్థాయిలలోకి కాంగ్రెస్‌ పార్టీ తగిన వ్యూహంతో చొచ్చుకు పోయింది. కిందిస్థాయిలో తగిన నిర్మాణంతో తిరిగి అధికారంలోకి రావాలని చూస్తుంది. నిజానికి 2002 నుంచి బిజెపి గెలుస్తున్నప్పటికీ ఓట్లు, సీట్లు తగ్గుతున్నాయి. 2007, 2012, 2017 ఎన్నికలలో వరుసగా బిజెపి స్థానాలు తగ్గుతూ వచ్చాయి. ఈ మేరకు కాంగ్రెస్‌ సీట్లు పెరిగాయి. 2017లో 77 స్థానాలు గెలుచుకొని తన బలాన్ని చాటుకుంది కాంగ్రెస్‌. అధికారంలోకి రాకపోయినప్పటికీ పార్టీ బలోపేతమవడానికి స్ఫూర్తినిచ్చింది. ఈ ఉత్తేజమే 2017 తరువాతి ఎన్నికల్లో కర్నాటక, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి దోహదం చేసింది.

ఈ పరిణామాలన్నిటిని దృష్టిలో పెట్టుకున్న బిజెపి అగ్రనాయకత్వం వ్యతిరేక పవనాల నడుమనే గుజరాత్‌లో అప్రతిహత విజయం సాధించాలని వ్యూహరచన చేసింది. మోదీ స్వరాష్ట్రం కనుక గుజరాత్‌ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేగాక ఈ ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ద్వారా అటు కాంగ్రెస్‌ని, ఇటు ఆమ్‌ ఆద్మీ పార్టీని దెబ్బ తీసినట్టవుతుంది. ఈ పరిణామం ఆ రెండు పార్టీలు నైతిక సామర్థ్యం కోల్పోయేలా చేస్తుంది. తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపిని ఎదుర్కొనే దీటైన శక్తి లేదని చెప్పినట్టవుతుంది. ఇలా పలురకాల యోచనలతో తమ వ్యూహాలకు పదును పెట్టింది బిజెపి అగ్రనాయకత్వం. కనుకనే నరేంద్ర మోదీ చరిష్మాతో గుజరాత్‌లో తిరుగులేని విజయం కోసం అన్నిరకాల జిమ్మిక్కులకు తెగబడింది కాషాయ పరివారం. మరి ఓటమి భయాల మధ్యనే గెలుపు వ్యూహాల్ని అమలు చేస్తున్న బిజెపిని కాంగ్రెస్‌, ఆప్‌లు ఎంతవరకు నిలువరించగలవో చూడాలి.

First Published:  18 Nov 2022 6:17 AM GMT
Next Story