Telugu Global
National

రాజకీయాలకు దూరం కానున్న సోనియా గాంధీ? ప్లీనరీలో మాటల వెనుక ఆంతర్యం అదేనా?

సోనియా గాంధీ ఇక క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె తిరిగి పోటీ చేయడంపై కూడా ఆసక్తి చూపించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రాజకీయాలకు దూరం కానున్న సోనియా గాంధీ? ప్లీనరీలో మాటల వెనుక ఆంతర్యం అదేనా?
X

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారా? నెహ్రూ-గాంధీ కుటుంబంలో తర్వాతి తరం నాయకుడైనా రాహుల్ గాంధీపైనే ఇక భారం మోపనున్నారా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేతిలోనే పార్టీని పూర్తిగా పెట్టబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. చత్తీస్‌గఢ్ రాజధాని నయా రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి 15వేల మంది ప్రతినిధులు ఈ ప్లీనరీకి హాజరయ్యారు. రెండో రోజు కాంగ్రెస్ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన సోనియా గాంధీ.. రాజకీయాల నుంచి ఇక విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందనే అర్థంలో మాట్లాడారు.

'2004, 2009లో మన్మోహన్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించడం నా జీవితంలో ఎంతో సంతృప్తిని ఇచ్చింది. అయితే నా ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగించడం మరింత సంతోషాన్ని కలిగించింది. ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీకి ఒక మలుపు లాంటిది. దేశ ప్రజలు సహనం, సమానత్వం కోరుకుంటున్నారనే విషయం ఈ యాత్ర ద్వారా అర్థం అయ్యింది. భారీ ఎత్తున ప్రజలను కలుసుకోవడం ఈ యాత్ర ద్వారా సాధ్యపడింది. ప్రజల తరపున పోరాడటానికి కాంగ్రెస్ పార్టీ ఉన్నదనే విషయం మరోసారి రుజువయ్యింది' అని సోనియా గాంధీ అన్నారు.

ఈ యాత్ర విజయం సాధించడానికి కృషి చేసిన పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. అలాగే రాహుల్ గాంధీ సంకల్పం, నాయకత్వం ఎంత అవసరమో యాత్ర ద్వారా స్పష్టమైందని సోనియా చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ఇకపై రాహుల్ నాయకత్వం అవసరమని ఆమె చెప్పకనే చెప్పారు. అలాగే తన ఇన్నింగ్స్ కూడా యాత్రతో పూర్తయ్యిందని వెల్లడించారు. ఈ మాటల వెనుక తన పొలిటికల్ రిటైర్మెంట్ ఆలోచన ఉన్నదనే చర్చ జరుగుతున్నది.

రాజీవ్ గాంధీ మరణానంతరం క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన సోనియా గాంధీ రెండు దశాబ్దాలకు పైగా యాక్టీవ్ పాలిటిక్స్‌లో ఉన్నారు. 2000లో తొలిసారి ఏఐసీసీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో సోనియా గాంధీ ప్రెసిడెంట్‌గా ఉండటం గమనార్హం. రెండు సార్లు పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొని రావడంతో కీలక పాత్ర పోషించారు. రాహుల్ గాంధీకి అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా.. గత సార్వత్రిక ఎన్నికల పరాజయం అనంతరం ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇంచార్జ్ ప్రెసిడెంట్‌గా సోనియా పని చేశారు. మల్లిఖార్జున్ ఖర్గేకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడంలో కీలకంగా వ్యవహరించారు.

ఇటీవల కాలంలో సోనియా గాంధీ ఆరోగ్యం కూడా సరిగా ఉండటం లేదు. గతంలో మాదిరిగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కూడా తగ్గించి.. ఎక్కువ సమయం ఇంటికే పరిమితం అవుతున్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ ఇమేజ్ అమాంతం పెరిగింది. పార్టీలోనే కాకుండా ప్రజల్లో కూడా రాహుల్ పనితనం ఏమిటో అర్థం అయ్యింది. గతంలో కంటే రాహుల్ ఇప్పుడు రాజకీయాల్లో చాలా యాక్టీవ్‌గా ఉంటున్నారు. బీజేపీని ఎదుర్కోవడంలో కూడా ఎలాంటి తడబాటు లేకుండా చూసుకుంటున్నారు.

అందుకే సోనియా గాంధీ ఇక క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె తిరిగి పోటీ చేయడంపై కూడా ఆసక్తి చూపించడం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మార్చడం వల్ల ఆమె సీడబ్ల్యూసీలో శాశ్వత సభ్యత్వాన్ని పొందారు. కానీ గతంలో మాదిరిగా యాక్టీవ్‌గా ఉంటారని మాత్రం చెప్పలేమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.

First Published:  25 Feb 2023 11:29 AM GMT
Next Story