Telugu Global
National

శశిథరూర్ కాంగ్రెస్ అధ్యక్షుడవడం సాధ్యమేనా ?

కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో గాంధీ కుటుంబం నుంచి పోటీ చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించకపోవడంతో ఎవరు అధ్యక్షులవుతారనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ తొలిచేస్తున్నది.

శశిథరూర్ కాంగ్రెస్ అధ్యక్షుడవడం సాధ్యమేనా ?
X

కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియ‌ర్ నాయ‌కులు ఒక్కొక్క‌రూ బ‌య‌టికి వెళ్ళిపోతుండ‌డం, మ‌రో వైపు నాయ‌క‌త్వ స‌మ‌స్య పార్టీని మ‌రింత సంక్లిష్ట‌తలోకి నెట్టేస్తోంది. త్వ‌ర‌లో అధ్య‌క్షుడి ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేపథ్యంలో చాలామంది సీనియ‌ర్ నాయ‌కులు ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వారిలో ముఖ్యంగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ అధ్య‌క్ష రేసులో ముందువ‌ర‌స‌లో ఉన్నారంటూ మీడియాలోనూ, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై థ‌రూర్ నేరుగా స్పందించ‌డంలేదు. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి ఆసక్తిగా ఉన్నారా లేదా అనే దానిపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు, అయితే ఇటీవల మలయాళ దినపత్రిక 'మాతృభూమి'లో "స్వేచ్ఛ, నిష్పాక్షిక" ఎన్నికలకు అనుకూలంగా స్పందిస్తూ ఒక కథనాన్ని రాశారు. నా వ్యాసంలో నేను రాసిన దానికి క‌ట్టుబ‌డి ఉన్నాను.కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష స్థానానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం చాలా మంచి విష‌యం అని ఆయ‌న ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు.

శ‌శిథ‌రూర్ మ‌ళ‌యాళ ప‌త్రిక మాతృభూమిలో రాసిన క‌థ‌నం ఆయ‌న కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష స్థానానికి పోటీప‌డుతున్నార‌ని, ఆ వ్యాసంలో రాసిన విష‌యాలు ఆయ‌నకు పార్టీ ప‌ట్ల ఉన్న నిబ‌ద్ధ‌త‌, పార్టీని న‌డిపించే విష‌యంలో ఉన్న స్ప‌ష్ట‌త, నాయ‌క‌త్వం పై ఉన్న అవ‌గాహ‌న‌ను తెలియ జేస్తున్నాయని, థ‌రూర్ పార్టీ అధ్య‌క్ష పోటీలో ఉన్నారంటూ క‌థ‌నాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గాంధీ కుటుంబం నుంచి పార్టీ ప‌ట్టు జారిపోవ‌డానికి ఆ కుటుంబం కానీ, వంది మాగ‌ధులు కానీ జీర్ణించుకోగ‌ల‌రా అనే సందేహాలు కూడా ఉన్నాయి. అశోక్ గెహ్లాట్‌, మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే వంటి సీనియ‌ర్ నాయ‌కులు ఇప్ప‌టికే రాహుల్ గాంధీ పార్టీ బాధ్య‌త‌లు తీసుకునేలా మ‌రోసారి గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తాం.. ఒప్పిస్తాం అని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లోని మ‌రో ప‌న్నెండు స్థానాలకు కూడా ఎన్నికలను నిర్వహించి పార్టీ ఆదర్శంగా నిలవాల్సిందని థరూర్ తన కథనంలో పేర్కొన్నారు. "అయినప్పటికీ, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీని తిరిగి శక్తివంతం చేయడానికి ఉపయోగపడుతుంది" అని థరూర్ పేర్కొన్నారు.

సంస్థాగ‌త ఎన్నికల వల్ల ఇతర ప్రయోజనకరమైన ప్రభావాలు కూడా ఉంటాయని ఆయ‌న తెలిపారు, "బ్రిటీష్ కన్జర్వేటివ్ పార్టీ త‌ర‌పున ఇటీవలి నాయకత్వ రేసు ప్రపంచవ్యాప్తంగా ఆస‌క్తిని రేపిన విష‌యం చూశాం క‌దా. ఇది 2019లో కూడా ఇలానే జ‌రిగింది. థెరిసా మే స్థానంలో ప‌దిమందికి పైగా అభ్యర్థులు పోటీ ప‌డ‌గా బోరిస్ జాన్సన్ అగ్రస్థానంలో నిలిచార‌ని పేర్కొన్నారు.

ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం వ‌ల్ల జాతీయ దృష్టిని ఆక‌ర్షించ‌డ‌మే గాక మరోసారి కాంగ్రెస్ పార్టీలోకి ఎక్కువ మంది ఓటర్లు చేరే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. "ఈ కారణాల వల్ల, అనేక మంది అభ్యర్థులు ముందుకు వచ్చి నామినేష‌న్లు వేస్తారని నేను ఆశిస్తున్నాను. పార్టీ, దేశం కోసం వారి దార్శనికతలను ప్రదర్శించడం ఖచ్చితంగా విశ్వాసం, ప్రజా ప్రయోజనాలను ప్రేరేపిస్తుంది, "అన్నారాయన. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కీల‌క పాత్ర పోషించాలని భావిస్తున్న బలమైన ప్రాంతీయ పార్టీలు రాజ‌కీయ శూన్యతను భర్తీ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. ఈ త‌రుణంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పునరాగమనం అవసరం ఎంతైనా ఉంద‌ని థరూర్ చెప్పారు.

పార్టీని నడిపించేందుకు ఎన్నికైన అభ్యర్థి చేపట్టాల్సిన రెండు ముఖ్యమైన పనులను కూడా థ‌రూర్ పేర్కొన్నారు. మొదటగా, ఎన్నికైన వ్య‌క్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉత్తేజపరచాలి. రెండవది, అతను లేదా ఆమె ఓటర్లను కూడా ఉత్సాహ ప‌ర‌చాలి. "అభ్యర్థికి పార్టీలో ఎదుర‌య్యే రుగ్మ‌త‌ల‌ను పరిష్కరించేందుకు ఖచ్చితమైన ప్రణాళిక ఉండాలి. భారతదేశం పట్ల దృఢమైన, దీర్ఘ‌ దృష్టి ఉండాలి. అన్నింటికంటే, రాజకీయ పార్టీ దేశానికి సేవ చేయడానికి ఒక సాధనం వంటిది. దానిలోఎటువంటి రాజీ ఉండ‌కూడ‌దు."అని ఆయన అన్నారు. మ‌రి కాంగ్రెస్ పార్టీలో భ‌ట్రాజులు, ముఖ‌స్తుతి మాట్లాడేవారు ఉన్న‌ప్పుడు పార్టీలో అత్యున్న‌త స్థానానికి థ‌రూర్ చేరుకోగ‌ల‌రా..?ఆయ‌న్ను అక్క‌డి వ‌ర‌కూ రానిస్తారా? అనే ప్ర‌శ్న‌లు కూడా వినిపిస్తున్నాయి.

First Published:  30 Aug 2022 4:05 PM GMT
Next Story