Telugu Global
National

వెల్కమ్ టు స్మృతి ఇరానీ.. జోడో యాత్రనుంచి పిలుపు

ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్, జోడో యాత్రలో పాల్గొనాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఆహ్వానించారు. గౌరిగంజ్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆమె వ్యక్తిగత కార్యదర్శి నరేశ్ శర్మకు లేఖ అందించారు

వెల్కమ్ టు స్మృతి ఇరానీ.. జోడో యాత్రనుంచి పిలుపు
X

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొనాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఆహ్వానం అందింది. ఇప్పటి వరకూ జోడో యాత్రలో పాల్గొనాలంటూ బీజేపీ నేతలెవరినీ కాంగ్రెస్ పిలవలేదు. కానీ స్మృతి ఇరానీకి మాత్రం పిలుపు వెళ్లడం విశేషం. గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతి ఇరానీని ఇప్పుడు రాహుల్ తో కలసి నడవాలంటూ కాంగ్రెస్ నేతలు ఆహ్వానించడం చర్చనీయాంశమైంది.

అత్యుత్సాహమా..? ఆదేశాలున్నాయా..?

ఉత్తరప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ దీపక్ సింగ్, జోడో యాత్రలో పాల్గొనాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఆహ్వానించారు. గౌరిగంజ్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆమె వ్యక్తిగత కార్యదర్శి నరేశ్ శర్మకు లేఖ అందించారు దీపక్ సింగ్. ప్రత్యేకంగా స్మృతి ఇరానీకి ఎందుకు లేఖ రాశారనేది మాత్రం తెలియడంలేదు. భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా అందర్నీ ఆహ్వానించాలని పార్టీ సీనియర్లు తనకు సూచించారని అంటున్నారాయన. అందరూ అంటే అందులో స్థానిక ఎంపీ కూడా ఉంటారు కదా అనేది దీపక్ సింగ్ వివరణ.

మేమెందుకు పాల్గొంటాం..?

ఈ ఆహ్వానంపై బీజేపీ స్పందించింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దుర్గేష్ త్రిపాఠి.. కాంగ్రెస్ నేతల ఆహ్వానాన్ని తాము మన్నించట్లేదని తేల్చి చెప్పారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సహా తమ పార్టీ నేతలెవరూ బీజేపీ మినహా ఇతర పార్టీల కార్యక్రమాల్లో పాల్గొనరు అని అన్నారాయన. పబ్లిసిటీ స్టంట్ గా దీన్ని కొట్టిపారేశారు. అయితే దీనిపై ఇంకా స్మృతి ఇరానీ నేరుగా స్పందించలేదు. దీపక్ సింగ్ వాదన ఎలా ఉన్నా.. ఈ ఆహ్వానంతో జోడో యాత్రకు స్థానికంగా మరింత పబ్లిసిటీ వచ్చింది. జనవరి 3న ఘజియాబాద్ మీదుగా ఉత్తరప్రదేశ్‌ లోకి జోడో యాత్ర ప్రవేశిస్తుంది. ఈ యాత్రపై కానీ, తనకు అందిన ఆహ్వానంపై కానీ స్మృతి ఇరానీ ఎలా స్పందిస్తారో చూడాలి.

First Published:  30 Dec 2022 5:54 AM GMT
Next Story