Telugu Global
National

ఫోన్ లో స్మృతి ఇరానీ గొంతు గుర్తించనందుకు ఉద్యోగిపై విచారణ

కే‍ంద్ర మంత్రి స్మృతి ఇరానీ గొంతు గుర్తుపట్టనందుకు ఓ ఉద్యోగి విచారణను ఎదుర్కొంటున్నాడు. ఓ పిర్యాదు గురించి స్మృతి ఇరానీ ఫోన్ చేసినప్పుడు ఆమె ఎవరో ఆ ఉద్యోగి గుర్తించలేకపోయాడు.

ఫోన్ లో స్మృతి ఇరానీ గొంతు గుర్తించనందుకు ఉద్యోగిపై  విచారణ
X

బిజెపి నేత‌ల అహంకారం మామూలుగా ఉండటం లేదు. మొన్నా మ‌ధ్య మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ శింగ్ చౌహాన్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఆయ‌న‌కు రుచిక‌ర‌మైన బ్రేక్ ఫాస్ట్ అందించ‌లేద‌ని, చ‌ల్లారిన టీ ఇచ్చార‌నే కార‌ణంగా ప్రొటోకాల్ అధికారిని స‌స్పెండ్ చేసిన విష‌యం గుర్తుండే ఉంటుంది. తాజాగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరాని గొంతు (వాయిస్‌)ను ఫోన్ లో గుర్తు ప‌ట్ట‌లేద‌ని ఓ ఉద్యోగి పై చ‌ర్య‌లు తీసుకున్నారు. ఈ ఉదంతం ఉద్యోగ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటంటే..

అమేథీ ఎంపీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వాయిస్‌ని గుర్తించడంలో విఫలమైనందుకు ఓ ప్రభుత్వ క్లర్క్ (లేఖపాల్) తన విధులను స‌క్ర‌మంగా నిర్వర్తించలేదనే అభియోగంతో ఆయ‌న‌ పై విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

ముసాఫిర్ఖానా తహసీల్ పరిధిలోని పూరే పహల్వాన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆగస్టు 27న ఇరానీకి ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ రాశారు. ఉపాధ్యాయుడైన తన తండ్రి మరణించిన తరువాత, తన తల్లి సావిత్రి దేవి పింఛను పొందేందుకు అర్హులు. అయితే దీపక్ అనే క్లర్క్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి కానందున ఆమె పెన్షన్ నిలిచిపోయిందని కరుణేష్ అనే వ్య‌క్తి ఆరోపించారు.

ఆ తర్వాత కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆ క్లర్క్‌కి ఫోన్‌ చేసినా ఆమె గొంతును గుర్తించలేకపోయారు. దీనిని పెద్ద త‌ప్పుగా భావించి ఆయ‌న‌పై విచార‌ణ‌కు ఆదేశించారు. అమేథీ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (సిడిఓ) అంకుర్ లాథర్ మాట్లాడుతూ, కరుణేష్ లేఖ లో ముసాఫిర్ఖానా లేఖపాల్ దీపక్ అలసత్వంగా వ్య‌వ‌హ‌రించార‌ని ఫిర్యాదు చేశారు. అతను తన విధులను స‌క్ర‌మంగా నిర్వర్తించలేదని అర్ధ‌మ‌వుతోంద‌ని అంకుర్ చెప్పారు.

ఫిర్యాదు దారుని అభ్య‌ర్ధ‌న‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే గాక మంత్రి ఫోన్ చేసినా ఆమె వాయిస్ ను గుర్తించ‌లేక‌పోవ‌డ‌మే దీప‌క్ చేసిన నేరం. దీప‌క్ అల‌స‌త్వ వైఖ‌రిపై ద‌ర్యాప్తు చేయాల‌ని ముసాఫిర్ఖానా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ విచారణకు కోరామని, ఆ నివేదిక వ‌చ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని లాథర్ చెప్పారు.

శనివారం, కరుణేష్ ఫిర్యాదుపై కేంద్ర మంత్రి లేఖపాల్‌కు ఫోన్ చేసినప్పుడు, అతను ఆమెను గుర్తించలేకపోయాడు. దీని తరువాత, సిడిఓ లాథ‌ర్ మంత్రి నుండి ఫోన్ తీసుకొని, కార్యాలయంలో తనను కలవమని లేఖపాల్‌కు చెప్పాడు. లేఖపాల్ ముసాఫిర్ఖానా తహసీల్ పరిధిలోని గౌతమ్‌పూర్ గ్రామసభలో క్ల‌ర్క్ గా నియమితుల‌య్యారు.

First Published:  30 Aug 2022 10:19 AM GMT
Next Story