Telugu Global
National

జ‌య‌ల‌లిత మృతిపై విచార‌ణ ఎట్ట‌కేల‌కు పూర్తి

మొత్తం 75 మంది సాక్షుల‌ను క‌మిష‌న్ విచారించగా.. అందులో ప్ర‌భుత్వాస్ప‌తి వైద్యులు, చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు, అప్ప‌ట్లో విధుల్లో ఉన్న చెన్నై పోలీసు ఉన్న‌తాధికారులు ఉన్నారు. ఈ విధంగా మొత్తం 158 మందిని క‌మిష‌న్ విచారించింది.

జ‌య‌ల‌లిత మృతిపై విచార‌ణ ఎట్ట‌కేల‌కు పూర్తి
X

త‌మిళ‌నాడు మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతిపై ఐదేళ్లుగా కొన‌సాగుతున్న విచార‌ణ ఎట్ట‌కేల‌కు పూర్త‌యింది. నేడు రిటైర్డ్ జ‌డ్జి ఆరుముగ స్వామి ముఖ్య‌మంత్రి స్టాలిన్‌ను క‌లిసి 600 పేజీల తుది నివేదికను అంద‌జేయ‌నున్నారు. త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం జ‌య‌ల‌లిత మృతి వెనుక గ‌ల కార‌ణాలు తెలుసుకునేందుకు 2017 సెప్టెంబ‌రులో మాజీ న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఆరుముగ స్వామి నేతృత్వంలో ఏకస‌భ్య క‌మిష‌న్‌ను నియ‌మించింది. ఈ క‌మిష‌న్ గ‌త ఐదు సంవ‌త్స‌రాలుగా వివిధ పార్టీల నేత‌ల‌ను, మాజీ మంత్రులు, జ‌య‌ల‌లిత స‌హ‌చ‌రులు, బంధువులు, అధికారుల‌ను విచారించింది. మొత్తం 75 మంది సాక్షుల‌ను క‌మిష‌న్ విచారించగా.. అందులో ప్ర‌భుత్వాస్ప‌తి వైద్యులు, చెన్నై అపోలో ఆస్పత్రి వైద్యులు, అప్ప‌ట్లో విధుల్లో ఉన్న చెన్నై పోలీసు ఉన్న‌తాధికారులు ఉన్నారు. ఈ విధంగా మొత్తం 158 మందిని క‌మిష‌న్ విచారించింది.

ఈ విచార‌ణ‌లో ఎయిమ్స్ వైద్య బృందం మూడు పేజీల నివేదికను క‌మిష‌న్‌కు స‌మ‌ర్పించింది. అందులో జ‌య‌ల‌లిత 2016లో అపోలోలో చికిత్స పొందుతూ మృతిచెందార‌ని, ఆమెకు అందించిన చికిత్స‌లో ఎలాంటి లోపాలూ లేవ‌ని పేర్కొంది. వీట‌న్నింటిపై నివేదిక రూపొందించిన ఆరుముగ స్వామి క‌మిష‌న్ త‌మిళ‌, ఇంగ్లీష్ భాష‌ల్లో దీనిని త‌యారుచేసింది.

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో సంచ‌ల‌నాల‌కు పేరైన మాజీ ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మ‌ర‌ణం కూడా ఒక సంచ‌ల‌న‌మే. రోజుల త‌ర‌బ‌డి ఆస్ప‌త్రిలో చికిత్స పొందిన ఆమె.. అభిమానుల ఆశ‌ల‌న్నీ అడియాశ‌లు చేస్తూ అక్క‌డే తుది శ్వాస విడిచారు. అయితే ఆమె అనారోగ్య కార‌ణాలు, ఆస్ప‌త్రిలో అందించిన చికిత్స‌, చివ‌రికి మ‌ర‌ణం కూడా వీడ‌ని మిస్ట‌రీగానే ప్ర‌జల్లో ఉండిపోయింది. అప్ప‌ట్లో దీనిపై అప్ప‌టి ప్ర‌భుత్వం నియ‌మించిన క‌మిష‌న్ విచార‌ణ పూర్త‌వ‌డంతో అందులో ఏముందో అనే ఆస‌క్తి స‌ర్వ‌త్రా నెల‌కొంది.

First Published:  27 Aug 2022 7:09 AM GMT
Next Story