Telugu Global
National

మతాంతర వివాహం: జంటపై రిజిస్టర్ ఆఫీస్ లోనే భజరంగ్ దళ్ దాడి

దళిత అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమించుకున్నారు. పెళ్ళిచేసుకుందామని రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళారు. అయితే భజరంగ్ దళ్ కార్యకర్తలు వాళ్ళపై దాడి చేసి, ముస్లిం అబ్బాయిని దారుణంగా కొట్టి పెళ్ళిని ఆపేశారు. అయినా సరే వాళ్ళిద్దరూ రెండురోజుల తర్వాత అక్కడే పెళ్ళి చేసుకున్నారు.

మతాంతర వివాహం: జంటపై రిజిస్టర్ ఆఫీస్ లోనే భజరంగ్ దళ్ దాడి
X

"మేమిద్దరం లక్ష్మీపురానికి చెందినవాళ్ళం, గత మూడు సంవత్సరాల నుండి ఒకరికొకరం బాగా తెలుసు. మేము ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. మా కుటుంబ సభ్యులెవరూ మా వివాహాన్ని వ్యతిరేకించలేదు. మధ్యలో వీళ్ళెవరు మా పెళ్ళిని వ్యతిరేకించడానికి? వాళ్ళు మమ్ములను చంపుతామని బెదిరిస్తున్నారు. వాళ్ళకేం హక్కు ఉంది? అతను (భర్త) నన్ను బాగా చూసుకుంటాడని నమ్మకం నాకుంది. మా జీవితాల్లో కలగజేసుకోవడానికి వాళ్ళెవరు ? ''

ధుంఖంతో, ఆవేదనతో ఈ మాటలు మాట్లాడింది చైత్ర అనే 23 ఏళ్ళ దళిత యువతి. కర్నాటక, చిక్ మంగుళూరు పట్టణంలో మీడియా ముందు ఆమె ఈ మాటలు మాట్లాడింది.

చిక్ మంగుళూరు జిల్లా లక్ష్మీ పురం గ్రామానికి చెందిన చైత్ర, అదే గ్రామానికి చెందిన 24 ఏళ్ళ జాఫర్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరూ పేళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు వైపులా కుటుంబాలు ఆ పెళ్ళికి సమ్మతిని తెలిపాయి. దాంతో వాళ్ళు చిక్ మంగుళూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పెళ్ళికి సిద్దమయ్యారు. కొద్ది సేపట్లో పెళ్ళి పూర్తవుతుందనగా భజరంగ్ దళ్ కార్యకర్తలు రంగ ప్రవేశం చేశారు. పెళ్ళిని అడ్డుకున్నారు. జాఫర్ పై దాడి చేసి రక్తమొచ్చేట్టు దారుణంగా కొట్టారు. 'లవ్ జీహాది' అంటూ పోలీసులకు పిర్యాదు చేసి జాఫర్ ను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్ళారు. చైత్రను పునరావాస కేంద్రానికి తీసుకెళ్ళారు.

''సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి లాంఛనాలు పూర్తి చేసుకున్నాము. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో శామన్న అనే వ్యక్తి అక్కడికి వచ్చారు. అతనితో పాటు మరికొంత మంది ఉన్నారు. వాళ్ళు నా భర్తను పట్టుకొని హిందూ ఎస్సీ అమ్మాయిని ఎలా పెళ్ళి చేసుకుంటావని కొట్టడం ప్రారంభించారు. నేను వాళ్ళను ఆపడానికి ప్రయత్నించాను. అయితే వారు నన్ను తోసివేసి దుర్భాషలాడారు." అని చైత్ర చెప్పింది.

"వారు అతన్ని దారుణంగా కొట్టి, ఆపై పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. నేను అతనికి నిరంతరం కాల్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. అయితే గూండాలు కాల్ లిఫ్ట్ చేసి జాఫర్ ను ఎందుకు పెళ్ళి చేసుకుంటావని ప్రశ్నించారు. హిందూ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నన్ను బలవంతం చేశారు. చివరకు అతన్ని రూరల్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడ వదిలేశారు. అతన్ని అసలు పోలీసు స్టేషన్ కు ఎందుకు తీసుకెళ్ళారు? నా ఇష్టంతోనే జాఫర్ ను పెళ్ళి చేసుకుంటున్నాను కదా అడ్డుకోవడానికి వాళ్ళెవరు ?'' అని చైత్ర ప్రశ్నించింది.

ఈ సంఘటన జరిగిన తర్వాత రెండు రోజులకు జాఫర్, చైత్రలు అదే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్ళి చేసుకున్నారు. అనంతరం వాళ్ళు చిక్ మంగుళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమకు ప్రాణభయం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ 'గూండాలు' తమపై మళ్ళీ దాడి చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కాగా జాఫర్ ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. ఈ విషయంపై చిక్కమగళూరులోని పోలీస్ సూపరింటెండెంట్ ఉమా ప్రశాంత్ మాట్లాడుతూ, "సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ మతాంతర జంట వివాహం చేసుకోబోతున్నప్పుడు వారిని నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. వారు ఏ సంస్థకు చెందిన వారో మాకు తెలియదు. వివాహాన్ని ఆపివేసిన వ్యక్తులు ఆ ముస్లిం అబ్బాయిని సిటి స్టేషన్‌కు తీసుకువచ్చి, ఆ తర్వాత రూరల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఆ జంటపై హిందూ మితవాద సంస్థల సభ్యులు దాడి చేసి దుర్భాషలాడార‌ని జాఫర్ నుండి మాకు ఫిర్యాదు అందింది. మేము ఫిర్యాదును స్వీకరించి విచారణ జరుపుతున్నాము.చైత్ర, జాఫర్‌ల పెళ్లి గురించి వారి కుటుంబీకులకు తెలుసు వాళ్ళనుండి ఎలాంటి వ్యతిరేకత లేదు.'' అని చెప్పారు.

First Published:  19 Sep 2022 9:48 AM GMT
Next Story