Telugu Global
National

బెట్టింగ్‌ యాప్‌లో కోటిన్నర గెలుచుకున్న పోలీస్.. ఆ త‌రువాత ఏం జ‌రిగిందంటే..?

డబ్బు గెలిచిన విషయాన్ని గొప్పగా, ఓపెన్‌గా చెప్పుకున్నాడు ఆ ఎస్ఐ. కానీ, ఇప్పుడు ఇది పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ అసలు ఆన్‌లైన్ గేమ్‌లో పాల్గొనవచ్చా..?

బెట్టింగ్‌ యాప్‌లో కోటిన్నర గెలుచుకున్న పోలీస్.. ఆ త‌రువాత ఏం జ‌రిగిందంటే..?
X

అతను ఓ పోలీస్‌ అధికారి.. సరదాగా ఫాంటసీ గేమింగ్ యాప్‌లో గేమ్ ఆడాడు. అదృష్టం క‌లిసొచ్చి ఏకంగా రూ.1.5 కోట్లు గెలిచాడు. ఆనందం తట్టుకోలేక ఆ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మీడియా మిత్రులతో పంచుకున్నాడు.. కట్ చేస్తే ఇప్పుడు అతనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

పింప్రి చించ్వాడ్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్‌స్పెక్టర్ సోమనాథ్ జెండే ప్రముఖ ఆన్‌లైన్ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫాం డ్రీమ్‌-11లో జూదం ఆడాడు. రూ. 1.5 కోట్లు గెలిచాడు. ఆ డబ్బులో మొదటి వంతుగా 2 లక్షలు ఆయన బ్యాంకు ఖాతాలో జమ కూడా అయ్యింది. ఈ విషయాన్ని ఎస్‌ఐ సోమనాథ్ జెండే స్వయంగా వెల్లడించారు. గేమ్ ఆడి రూ.1.5 కోట్లు గెలిచిన తాను ఆ డబ్బు రాదని భావించినట్లు మీడియాతో అన్నారు. అయితే గురువారం రూ.2 లక్షలు తన ఖాతాలోకి బదిలీ అయ్యాయని, ఇందులో రూ.60,000 మినహాయించి రూ.1.40 లక్షలు అందినట్టు తెలిపారు. మొత్తం డబ్బు వచ్చిన తర్వాత సగం డబ్బుతో ఇంటి రుణం తీరుస్తానన్నారు. అలాగే మిగతా సగం డబ్బును భవిష్యత్తు అవసరాలకోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని, దాని ద్వారా వచ్చే వడ్డీ డబ్బులు పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని చెప్పారు.

డబ్బు గెలిచిన విషయాన్ని గొప్పగా, ఓపెన్‌గా చెప్పుకున్నాడు ఆ ఎస్ఐ. కానీ, ఇప్పుడు ఇది పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఎస్‌ఐ అసలు ఆన్‌లైన్ గేమ్‌లో పాల్గొనవచ్చా..? ఈ గేమ్ చట్టబద్ధమేనా..? ఇలా వచ్చిన డబ్బు గురించి మీడియాతో మాట్లాడవచ్చా..? ఇందుకు సంబంధించి నిబంధనలు ఏమన్నా ఉన్నాయా..? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తి విచారణ బాధ్యతను డీసీపీ అప్పగించినట్లు పింప్రి చించ్వాడ్ ఏసీపీ తెలిపారు. రిపోర్ట్‌ అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

First Published:  14 Oct 2023 6:28 AM GMT
Next Story