Telugu Global
National

చందమామ తాజా చిత్రాలు చూద్దాం రండి

ప్రస్తుతం ల్యాండర్‌ జాబిల్లి చుట్టూ ఉన్న 25×134 కి.మీల కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై కాలుమోపనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.

చందమామ తాజా చిత్రాలు చూద్దాం రండి
X

చంద్రునిపై అడుగుపెట్టే దిశగా చంద్రయాన్‌-3 దూసుకెళ్తోంది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం పట్టువదలని విక్రమ్‌ ల్యాండర్‌ అన్వేషణ సాగిస్తోంది. ఈ క్రమంలోనే భూమికి ఎప్పుడూ కన‌ప‌డని చందమామ దక్షిణ ధ్రువ చిత్రాలను విక్రమ్‌ తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను విడుద‌ల చేస్తూ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ISRO) ట్వీట్‌ చేసింది.

విక్రమ్ ల్యాండర్ బుధవారం చంద్రుని ఉపరితలాన్ని తాకే అవకాశం ఉంది. ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్, అవాయిడెన్స్ కెమెరా బండరాళ్లు లేదా లోతైన కందకాలు లేకుండా సురక్షితమైన ల్యాండింగ్ ప్రాంతాన్ని గుర్తించడంలో సహాయపడనుంది. ఈ నేపథ్యంలో LHDAC భూమికి కనిపించని జాబిల్లి దక్షిణ ధ్రువం చిత్రాలను తీసిందని ఇస్రో వెల్లడించింది.


బండరాళ్లు, లోతైన కందకాలు లేని ప్రదేశంలో ల్యాండ్ అవ్వటం కోసం జరుగుతున్న ఈ అన్వేషణలో ఆగస్టు 19న ల్యాండర్‌ ఈ ఫొటోలు తీసినట్లు ఇస్రో వెల్లడించింది. ఇందులో జాబిల్లి ఉపరితలంపై అనేక బిలాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వాటి పేర్లను కూడా ఇస్రో విడుదల చేసిన ఫొటోల్లో పేర్కొంది. సాధారణంగా మనకు ఎప్పుడూ చంద్రుడి రూపం ఒకవైపే కన్పిస్తుంది. అవతలి వైపు కనిపించదు. చంద్రుడు తన కక్ష్య మీద ఒకసారి పూర్తిగా భ్రమించటానికి పట్టే సమయం, భూమి చుట్టూ తిరిగి రావటానికి పట్టే సమయం సమానంగా ఉంటుంది. దీన్ని టైడల్‌ లాకింగ్‌ అంటారు. దీని మూలంగానే చందమామ‌ ఒక వైపే మనకు కనిపిస్తుంది.

ప్రస్తుతం ల్యాండర్‌ జాబిల్లి చుట్టూ ఉన్న 25×134 కి.మీల కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై కాలుమోపనున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. ఆ చారిత్రాత్మక క్షణాలలో తన వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఇస్రో తెలిపింది. చంద్రయాన్ - 3 సేఫ్ ల్యాండింగ్‌ జరిగితే.. ఈ ఘనత సాధించిన సోవియట్‌ యూనియన్‌, అమెరికా, చైనా జాబితాలో భారత్‌ కూడా చేరనుంది.

First Published:  21 Aug 2023 6:26 AM GMT
Next Story