Telugu Global
National

భారత్ లో కారు జోరు.. సెప్టెంబర్ లో ఆల్ టైమ్ రికార్డ్..

మధ్యతరగతి దృష్టి టూవీలర్ల వైపునుంచి కార్ల వైపు మళ్లడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈఎంఐలు వీరికి వరంగా మారాయి.

భారత్ లో కారు జోరు.. సెప్టెంబర్ లో ఆల్ టైమ్ రికార్డ్..
X

సెమీ కండక్టర్ల కొరత ఉన్నా కూడా భారత్ లో కార్ల అమ్మకాలు రికార్ట్ స్థాయికి చేరుకున్నాయి. కరోనా కంటే ముందున్న రికార్డులను కూడా సెప్టెంబర్ మాసం బద్దలు కొట్టింది. భారత్ లో కార్ల అమ్మకాల్లో 2022 సెప్టెంబర్ అరుదైన ఘనత సాధించింది. కరోనా తర్వాత రెండేళ్లుగా వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నా, దానికి తగ్గ సప్ల‌య్ లేకపోవడంతో అమ్మకాలు క్షీణించాయి. ఇప్పటికి పరిస్థితి కుదుట పడింది. సెప్టెంబర్ నెలలో 3,55,946 కార్లు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. ఆగస్ట్ లో అమ్ముడయిన 2,81,210 కార్ల కంటే ఇది 26 శాతం అధికం.

ఇవీ గణాంకాలు..

కొవిడ్ కి ముందు 2020 అక్టోబర్ లో 3,34,411 కార్ల అమ్మకాలు

కొవిడ్ తర్వాత మార్కెట్ కుదుటపడ్డాక 2021 మార్చిలో అమ్మకాల సంఖ్య 3,16,034

సెకండ్ వేవ్ భయాందోళనల తర్వాత 2021 సెప్టెంబర్ లో కార్ల అమ్మకాలు 1,60,070

ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆల్ టైమ్ హయ్యస్ట్ 3,55,946

ఇవీ క్లుప్తంగా కరోనాకి ముందు, ఆ తర్వాత కార్ల అమ్మకాల వివరాలు. కార్ల బిజినెస్ లో కొవిడ్ కి ముందున్న పరిస్థితులు తిరిగి రావడంతోపాటు, అంతకంటే మెరుగైన స్థితికి భారత్ చేరుకుంది. అయితే డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉండటం విశేషం. కొంతమేర సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు ఈ డిమాండ్ ని తగ్గిస్తున్నా.. కొత్త కార్ల అమ్మకాలు మాత్రం జోరందుకున్నాయి.

మధ్యతరగతి దృష్టి టూవీలర్ల వైపునుంచి కార్ల వైపు మళ్లడంతో ఈ ఘనత సాధ్యమైంది. ఈఎంఐలు వీరికి వరంగా మారాయి. భారత్ లో అన్ని ప్రముఖ కార్ల కంపెనీలకు ఇబ్బడిముబ్బడిగా బుకింగ్స్ వస్తున్నాయి. సెమీకండక్టర్ల కొరత కార్ల ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తోంది. దీని కారణంగా కొన్ని కార్లపై వెయిటింగ్ పీరియడ్ ఐదారు నెలల కంటే ఎక్కువగా ఉంటోంది. కండక్టర్ల కొరత ఉన్నా కూడా భారత్ లో కార్ల అమ్మకాలు రికార్డ్ స్థాయికి చేరడం విశేషం.

First Published:  6 Oct 2022 3:26 AM GMT
Next Story