Telugu Global
National

బక్క చిక్కిన రూపాయి... రిజర్వ్ బ్యాంక్ ఏం చేయనుంది ?

దేశంలో రూపాయి విలువ రోజు రోజుకూ దిగజారిపోతున్న పరిస్థితుల్లో రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగింది. రూపాయి విలువ దిగజారకుండా స్థిరంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తోంది.

బక్క చిక్కిన రూపాయి... రిజర్వ్ బ్యాంక్ ఏం చేయనుంది ?
X

దేశంలో రూపాయి విలువ డాలర్ తో పోల్చే పరిస్థితి ఎందుకు వచ్చింది ? చిక్కిపోతున్న రూపాయి విలువ ఎకానమీని మరింత కుదేస్తుందన్న ఆందోళన ఉన్నా.. ప్రస్తుతానికి ఈ పోలిక అనవసరమని అంటోంది రిజర్వ్ బ్యాంకు.. రూపాయి విలువ 80 కి పడిపోయినప్పటికీ మేం జోక్యం చేసుకుంటాం.. ఈ పరిస్థితిని చూస్తూ ఊరుకోం అని అభయహస్తమిస్తోంది. ఎవరైనా మన కళ్ళ ముందే రోజురోజుకీ రూపాయి వ్యాల్యూ తగ్గిపోతోందని దిగాలు పడడం సహజం. ఇటీవలి వారాల్లో ఇంతగా ఎప్పుడూ రికార్డు స్థాయిలో ఇది బక్క చిక్కలేదు. ఇండియాలో ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని మనమంతా కలవరపడ్డాం.. ఈ ఏడాది రూక తన విలువను 7 శాతం పైగా కోల్పోయింది కూడా .. ఇవన్నీ వింటూ ఆర్బీఐ ఎందుకలా కంగారు పడతారంటూ ముందుకు రావడం కాస్త ఊరటనిచ్చేదే ! దేశ ఆర్థిక వ్యవస్థను కొంతలో కొంతయినా గాడిన పెట్టడానికి నడుం బిగించిన ఈ రిజర్వు బ్యాంకు తన విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఆరో వంతును అమ్మి అయినా సరే రూపాయిని కాపాడుకోవాలని డిసైడయ్యింది. సకాలంలో ఈ నిర్ణయం తీసుకోకపోతే దేశం ఇంకా గడ్డు పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుందని ఆర్ధిక నిపుణులు కలవరం చెందినా ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

ఒక్కసారి గతంలోకి వెళ్లి చూద్దాం ! గత సెప్టెంబరు మొదటి వారంలో రిజర్వ్ బ్యాంకు కరెన్సీ నిల్వలు 642.450 బిలియన్ డాలర్లు.. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇంకా ఇతర కారణాలవల్ల ఇది తాజాగా 60 బిలియన్ డాలర్లకు పడిపోయి అందరికీ నిద్ర పట్టకుండా చేసింది. కానీ రిజర్వ్ బ్యాంకు వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు 580 బిలియన్ డాలర్లు ఉన్నట్టు సమాచారం రావడంతో సేద దీరాం !

ప్రపంచంలోని ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే ఈ నిల్వలు ఐదో స్థానంలో ఉన్నాయట.. ఏమైతేనేం ? పరిస్థితి దిగజారుతున్నట్టు కనిపించినా తమ సామర్థ్యం మీద ఆర్బీఐకి ఎంతో నమ్మకం ఉందని, అవసరమైనప్పుడు తమ సత్తా చూపుతామన్న కాన్ఫిడెన్స్ బలంగా ఉందన్నది ఈ బ్యాంకు వర్గాలు చెప్తున్నాయి. ''రూపాయి ఇంకా పడిపోకుండా చూడడానికి మేం 100 బిలియన్ డాలర్లయినా వ్యయం చేస్తాం.. రూకను రక్షించుకోవడమే కాదు.. దీన్ని ఓ నిర్దిష్ట స్థాయిలో ఉంచడానికి యత్నిస్తునే కరెన్సీలో ఎలాంటి తరుగుదల లేకుండా నివారించడానికి మా ప్రయత్నం మేం చేస్తాం'' అని ఈ వర్గాలు వ్యాఖ్యానించాయి.

అసలు ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతోంది ? ఓ వైపు ఫెడరల్ రిజర్వ్ లు మేమున్నామంటూ సవాలు విసురుతున్నాయి.. డాలర్లే లక్ష్యంగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి జంకుతున్నారు. మన మార్కెట్ ఏమైపోవాలి అన్న ఆందోళన తలెత్తడం సహజమే.. భారత వాణిజ్య కరెంట్ అకౌంట్ల లోటు (డెఫిసిట్) భయపెడుతోంది.. నిత్యావసర వస్తువులు, ముఖ్యంగా ఆయిల్ ధరలు పెరిగిపోతూ భారత దిగుమతి బిల్లుకు చిల్లులు పెడుతున్నాయి. నిజానికి ఇలాంటి పరిస్థితి దాదాపు మూడేళ్ళ క్రితమే వచ్చింది. కరోనా కారణంగా ఎకానమీ దిక్కులు చూసింది. కానీ రిజర్వ్ బ్యాంకు పరిస్థితిని చక్క దిద్దింది.

ఈ ఏడాది విదేశీ పెట్టుబడిదారులు సుమారు 30 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించారు. గత జనవరి నుంచి నెలవారీ ట్రేడ్ లోటు సగటున 25 బిలియన్ డాలర్లు ఉంది. అంటే ఆర్బీఐ పెట్టే 100 బిలియన్ డాలర్ల సొమ్ము నేరుగా డాలర్ డిమాండును తట్టుకోగలదన్న మాట.. ఈ నేపథ్యంలో మన రూపాయి-డాలర్ మారకం విలువను మనం మళ్ళీ మదింపు చేసుకోవాలన్నది విశ్లేషకుల అభిప్రాయం. కానీ నాణేనికి మరోవైపులా కొందరు ఎనలిస్టులు, ట్రేడర్లు మరో రకంగా వాదిస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు జోక్యం చేసుకున్నప్పటికీ ఫారిన్ ఇన్వెస్టర్లు ఇండియాకు తిరిగి వచ్చి మన మార్కెట్ ని ఆదుకుంటారా అన్నది వారి భయం .. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలను చూసి వాళ్ళు వెనక్కి తగ్గరూ అని సింగపూర్ కి చెందిన ఓ సీనియర్ ట్రేడర్ అన్నారు. డాలర్-లిక్విడిటీ అబ్హార్ప్షన్ కి మనం తొలిదశలో ఉన్నామని ఆయన నిట్టూర్చాడు. వచ్చే నెల ఎలా ఉంటుందో ! విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి ఇండియాకు రావచ్చునన్న ఆశలున్నా .. ఆందోళన మాత్రం వెంటాడుతోంది అని ఆ ట్రేడర్ కాస్త నిరాశగానే మాట్లాడాడు. అమెరికా పరిణామాల నేపథ్యంలో ఇండియా నుంచి డాలర్లు బయటకు వెళ్తున్నాయని.. మార్కెట్ మారక ముందే మనం మేల్కోవాలని మరో ట్రేడర్ పేర్కొన్నాడు.




First Published:  21 July 2022 1:43 PM GMT
Next Story