Telugu Global
National

రైలు ప్రయాణికులూ.. ఇక బేఫికర్.. వాట్సప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ ఇలా చేయండి

వాట్సప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే సదుపాయం ప్రస్తుతం ఎంపిక చేసిన రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉందని.. వినియోగదారుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగిలిన రైళ్లకు కూడా విస్తరిస్తామని అధికారులు తెలిపారు.

రైలు ప్రయాణికులూ.. ఇక బేఫికర్.. వాట్సప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ ఇలా చేయండి
X

రైలు ప్రయాణికులు అనేక సౌకర్యాలను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకొని వస్తోంది. అయితే ఆహారం విషయంలో మాత్రం ప్యాసింజర్స్ ఎప్పుడూ కంప్లైంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే చాలా ట్రెయిన్స్‌లో ప్యాంట్రీ కార్లు తీసేసి.. క్యాటరింగ్ పద్దతిని అమలులోకి తీసుకొని వచ్చారు. కానీ, ఈ-క్యాటరింగ్ ద్వారా సేవలు ఎలా పొందాలో చాలా మందికి తెలియడం లేదు. అంతే కాకుండా కాస్త కష్టతరంగా కూడా ఉన్నాయి. అందుకే ఐఆర్‌సీటీసీ వాట్సప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఐఆర్‌సీటీసీ ప్రస్తుతం తమ ఈ కేటరింగ్ వెబ్‌సైట్, ఫుడ్ ఆన్ ట్రాక్ అనే యాప్ ద్వారా ఈ సదుపాయాన్ని అందిస్తోంది. ఇకపై 0870001323 అనే వాట్సప్ నెంబర్ ఉపయోగించి ఫుడ్ ఆర్డర్ చేసుకునే వీలు కల్పిస్తోంది. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న వెంటనే.. ఐఆర్‌సీటీసీ రిజిస్ట్రేషన్ నెంబర్‌కు ఈ వాట్సప్ నెంబర్‌ నుంచి మెసేజ్ వస్తుంది. ఆ లింక్ ద్వారా www.ecatering.irctc.co.in సైట్‌కు వెళ్లవచ్చు. ప్రయాణికులు తమకు అందుబాటులో ఉన్న స్టేషన్లలోని రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు.

ఈ వాట్సప్ నెంబర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బోట్ ద్వారా పని చేస్తుంది. ఇది కేటరింగ్‌కు సంబంధించిన సేవలను నేరుగా అందిస్తుంది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీకి చెందిన ఈ-క్యాటరింగ్ ద్వారా రోజుకు 50 వేల మీల్స్‌ను ప్రయాణికులకు అందిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొన్నది.

వాట్సప్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసే సదుపాయం ప్రస్తుతం ఎంపిక చేసిన రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉందని.. వినియోగదారుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగిలిన రైళ్లలో కూడా విస్తరిస్తామని అధికారులు తెలిపారు. కాగా, జూప్ అనే థర్డ్ పార్టీ ఆన్‌లైన్ ఫుడ్ ప్లాట్ ఫామ్.. గతేడాదినుంచి వాట్సప్ ద్వారా ఫుడ్ ఆర్డర్స్ తీసుకుంటోంది. ప్రయాణికుల అభిరుచికి తగిన ఆహారాన్ని అందిస్తూ మంచి ఆదరణ పొందింది.దాన్ని చూసే ఐఆర్‌సీటీసీ వాట్సప్ ద్వారా ఈ-కేటరింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొని రావడం గమనార్హం.

First Published:  6 Feb 2023 2:09 PM GMT
Next Story