Telugu Global
National

2వేలు.. అప్పుడు బిచ్చగాడు, ఇప్పుడు బిచ్చగాడు-2

సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. బిచ్చగాడు సినిమాకి పెద్ద నోట్ల రద్దుకి లింకు పెడుతూ మోదీని చెడుగుడు ఆడుకుంటున్నారు నెటిజన్లు.

2వేలు.. అప్పుడు బిచ్చగాడు, ఇప్పుడు బిచ్చగాడు-2
X

2016లో బిచ్చగాడు సినిమా రిలీజైంది. అదే ఏడాది పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు మోదీ.

2023లో బిచ్చగాడు-2 రిలీజైంది. ఇప్పుడు 2వేల నోట్లు రద్దు చేసింది ఆర్బీఐ.

రెండిటి మధ్య పోలిక పెట్టాల్సిన అవసరం లేదు కానీ.. ఆ సినిమా టైటిల్ చూస్తే మాత్రం నోట్ల రద్దుతో ప్రజల్ని బిచ్చగాళ్లుగా మార్చేశారనే కామెంట్లు వినపడుతున్నాయి. సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. బిచ్చగాడు సినిమాకి పెద్ద నోట్ల రద్దుకి లింకు పెడుతూ మోదీని చెడుగుడు ఆడుకుంటున్నారు నెటిజన్లు.

అప్పట్లో పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బంది పడింది సామాన్యులు, మధ్యతరగతివారే. ఇక అసలు విషయం తెలియని నిరుపేదలు దారుణంగా మోసపోయారు. నోట్ల మార్పిడికి సమయం తీరిపోయిన తర్వాత 500, వెయ్యి రూపాయల పాత నోట్లు దాచుకున్నవారు లబోదిబోమన్నారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు కూడా అదే తంతు. 2వేల నోట్లు ఎక్కడా కనపడటం లేదు కదా అని అనొచ్చు. కానీ వాటిని అపురూపంగా దాచుకున్న నిరుపేదలు ఎక్కడో ఉండే ఉంటారు. అలాంటి వారికి విషయం తెలిసి వారు వాటిని మార్చుకునే సమయానికి కేంద్రం టైమ్ అయిపోయింది ఇక అవి చిత్తుకాగితాలే అని చెప్పేస్తుంది. బడాబాబుల సంగతి సరే, పేదల దగ్గర ఉన్న నోట్లు తీసుకోడానికి కూడా ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటో తెలియదు.

స్వయంకృతాపరాధమేనా..?

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తప్పా ఒప్పా అనే విషయం పక్కనపెడితే, ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆ నిర్ణయం నష్టం కలిగించలేదు. మరిప్పుడు 2వేల నోట్ల రద్దు తర్వాత ఏడాదికి సార్వత్రిక ఎన్నికలొస్తాయి. అప్పటి కసి ఇప్పుడు తీర్చుకోడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలు మాత్రం వెలువడుతున్నాయి. రాజకీయ నాయకుల్లో కొందరు ఆహా ఓహో అంటూ ఉండొచ్చు, కానీ అదంతా పైకి మాత్రమే. లోపల మోదీకి కర్రుకాల్చి వాతపెట్టబోతున్నారనే సంతోషం అందరిలోనూ ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందుగానే పెద్దనోట్ల రద్దు, 2వేల నోట్ల ఎంట్రీ.. ఎంత పెద్ద తప్పో మోదీ బహిరంగంగానే ఒప్పుకున్నట్టయింది. మరి ఈ తప్పుకి బీజేపీకి శిక్ష పడటం ఖాయమే కదా. ప్రజల కోపం కసి.. బిచ్చగాడు-1 రేంజ్ లో ఉంటుందా, బిచ్చగాడు-2 రేంజ్ కి వెళ్తుందా అనేది తేలాల్సి ఉంది.

First Published:  20 May 2023 2:25 AM GMT
Next Story