Telugu Global
National

రూ.1లక్ష కోట్ల విలువైన శత్రువుల ఆస్తులను అమ్మేయనున్న కేంద్ర ప్రభుత్వం

తెలంగాణలో శత్రు దేశాల ఆస్తుల జాబితాలో 158 ప్రాపర్టీస్ ఉన్నాయి.

రూ.1లక్ష కోట్ల విలువైన శత్రువుల ఆస్తులను అమ్మేయనున్న కేంద్ర ప్రభుత్వం
X

శత్రు దేశాలకు చెందిన స్థిరాస్తులను జప్తు చేసుకొని, వాటిని వేలం వేయడానికి కేంద్ర హోం శాఖ రంగం సిద్ధం చేస్తోంది. దేశవ్యాప్తంగా 12,611 ప్రాపర్టీస్ శత్రు దేశాలకు చెందిన వారివిగా ఇప్పటికే కేంద్రం గుర్తించింది. ఇండియా నుంచి చైనా, పాకిస్తాన్ వెళ్లి అక్కడి పౌరసత్వాన్ని తీసుకున్న వారి స్థిరాస్తులను శత్రు దేశాలకు చెందిన ఆస్తులుగా పరిగణిస్తున్నారు. దేశంలో ఇలాంటి ఆస్తుల విలువ దాదాపు రూ.1లక్ష కోట్లుగా ఉంటుందని కేంద్ర హోం శాఖ అంచనా వేస్తోంది.

తెలంగాణలో శత్రు దేశాల ఆస్తుల జాబితాలో 158 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇక యూపీలో అత్యధికంగా 6,255 ఆస్తులు, ఆ తర్వాత స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (4,088), ఢిల్లీ (659), గోవా (295), మహారాష్ట్ర (208), గుజరాత్ (151), త్రిపుర (105), బీహార్ (94), మధ్య ప్రదేశ్ (94), చత్తీస్‌గఢ్ (78), హర్యానా (71) ఆస్తులు ఉన్నాయి. ఇక కేరళలో 71, ఉత్తరాఖండ్‌లో 69, తమిళనాడులో 67, మేఘాలయలో 57, అస్సామ్‌లో 29, కర్నాటకలో 24, రాజస్తాన్‌లో 22, జార్ఘండ్‌లో 10, డయ్యూడామన్‌లో 4 ఈ తరహా ఆస్తులు ఉన్నాయి. కాగా, ఆంధ్రప్రదేశ్‌, అండమాన్ నికోబార్‌లో కేవలం ఒక్కోటి చొప్పున మాత్రమే శత్రువుల ఆస్తిగా లెక్కగట్టారు.

ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కింద గతంలోనే కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా అనే ప్రత్యేక అథారిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ అథారిటీ కిందనే ఈ ఆస్తులన్నింినీ చేర్చింది. ఆయా ఆస్తులు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా మెజిస్ట్రేట్ (కలెక్టర్) సమాయంతో వాటిని వేలం ద్వారా అమ్మకం జరిపేందుకు, జప్తు చేసుకునేందుకు సిద్ధపడుతోంది. ఒక వేళ ఆస్తి విలువ రూ.1 కోటి కంటే తక్కువ ఉంటే.. ఇప్పటికే ఆయా ప్రాపర్టీస్‌లో నివాసం ఉంటున్న వారికే అమ్మేలా తొలుత ఆఫర్ ప్రకటిస్తారు. ఒక వేళ దాంట్లో నివాసం ఉంటున్న వ్యక్తి లేదా వ్యక్తులు కొనుగోలుకు ఆసక్తి చూపించకపోతే దాన్ని నిబంధనల ప్రకారం వేలం వేస్తారని అధికారులు చెబుతున్నారు.

శత్రువుల ఆస్తులుగా గుర్తించిన వాటి విలువ రూ.1 కోటి నుంచి రూ.100 కోట్ల మధ్య ఉంటే దానిని సీఈపీఐ అథారిటీ ఈ-ఆక్షన్ ద్వారా కానీ.. కేంద్రం ఏర్పాటు చేసే ఎనిమి ప్రాపర్టీ డిస్పోజల్ కమిటీ ద్వారా కానీ వేలం వేస్తారని హోం శాఖ తెలియజేసింది.

First Published:  20 March 2023 2:58 AM GMT
Next Story