Telugu Global
National

ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో గత సంవత్సరంకన్నా దారుణంగా దిగజారిన భారత్ ర్యాంక్

''2014 లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత జర్నలిస్టులపై హింస, రాజకీయ పక్షపాత మీడియా, మీడియా యాజమాన్యం ఏకపక్షం వహించడం పెరిగిపోయింది. ఇవన్నీ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో ఉందని నిరూపిస్తున్నాయి.'' అని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF) వ్యాఖ్యానించింది.

Press Freedom Index 2023: India Slips 11 Ranks in Press Freedom Index, Now 161 of 180 Countries
X

ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో గత సంవత్సరంకన్నా దారుణంగా దిగజారిన భారత్ ర్యాంక్

రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ (RSF) తన వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 21వ ఎడిషన్‌ను బుధవారం (మే 3) విడుదల చేసింది. ఈ ఇండెక్స్ లో భారతదేశం ర్యాంక్ దారుణంగా దిగజారింది. 180 దేశాల ర్యాంక్‌లో పత్రికా స్వేచ్ఛ పరంగా భారతదేశం 161వ ర్యాంక్‌కు దిగజారింది. 2022 లో 150వ స్థానంలో ఉన్న భారత్ 11 ర్యాంక్ లు దిగజారింది.

భారతదేశం ఎందుకు ఈ విధంగా వర్గీకరించబడిందనే దాని గురించి ప్రారంభ వ్యాఖ్యలలో, RSF ఇలా పేర్కొంది, ''2014 లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత జర్నలిస్టులపై హింస, రాజకీయ పక్షపాత మీడియా, మీడియా యాజమాన్యం ఏకపక్షం వహించడం పెరిగిపోయింది. ఇవన్నీ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో ఉందని నిరూపిస్తున్నాయి.'' అని వ్యాఖ్యానించింది.

వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఐదు అంశాలపై గణిస్తారు. రాజకీయ సూచిక, ఆర్థిక సూచిక, శాసన సూచిక, సామాజిక సూచిక, భద్రతా సూచిక ల ఆధారంగా ఈ ర్యాంక్ ను నిర్ణయిస్తారు.

భద్రతా సూచిక విభాగంలో భారతదేశం అత్యంత ఆందోళనకరమైన స్థితిలో ఉంది. భద్రతా సూచికలో భారతదేశం ర్యాంక్ 172. దీని అర్థం, భద్రతా సూచికలో 180 దేశాలలో భారతదేశం కంటే కేవలం ఎనిమిది దేశాలు మాత్రమే అధ్వాన్నంగా ఉన్నాయి. చైనా, మెక్సికో, ఇరాన్, పాకిస్థాన్, సిరియా, యెమెన్, ఉక్రెయిన్ , మయన్మార్ మినహా ప్రపంచంలోని జర్నలిస్టులకు భద్రత కల్పించే విషయంలో భారత్ అందరికంటే అధ్వాన్నంగా ఉంది.

ప్రధాన మీడియా కంపెనీలు, మోడీ ప్రభుత్వానికి మధ్య బహిరంగంగా పరస్పరం లాభదాయకమైన సంబంధాలు ఉన్నందున పరిస్థితి మరింత దిగజారింది: “ రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ చైర్మెన్, మోడీకి వ్యక్తిగత స్నేహితుడు ముఖేష్ అంబానీ కనీసం 800 మిలియన్ల మంది భారతీయులు అనుసరించే 70 మీడియా సంస్థలను తన చేతుల్లో పెట్టుకున్నారు. అదేవిధంగా, 2022 చివరిలో నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన గౌతమ్ అదానీ ఎన్‌డిటివి ఛానెల్‌ని స్వాధీనం చేసుకోవడం ప్రధాన స్రవంతి మీడియాలో విరుద్ద భావాల మధ్య చర్చలకు ముగింపు పలికింది.

RSF ప్రకారం, చట్టపరంగా కూడా, జర్నలిస్టులను అధికారంలో ఉన్నవారు వేధిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులపై దేశద్రోహం, నేరపూరిత పరువు నష్టం ఆరోపణలతో సహా జాతీయ భద్రతకు అపాయం కలిగించే అభియోగాలు, జాతీ వ్యతిరేకులు గా ముద్ర వేయడం చేస్తున్నారు." అని నివేదిక పేర్కొంది.

ఆర్‌ఎస్‌ఎఫ్ ప్రకారం భారతీయ న్యూస్‌రూమ్‌లలో వైవిధ్యం లేదు. “చాలా వరకు, ఉన్నత కులాలకు చెందిన హిందూ పురుషులు మాత్రమే జర్నలిజంలో సీనియర్ పదవులను కలిగి ఉన్నారు. ఇది మీడియా కంటెంట్‌లో ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు, సాయంత్రం చర్చా కార్యక్రమాలలో పాల్గొనేవారిలో 15% కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారు.

జర్నలిస్టుల భద్రత విషయంలో కూడా, భారతదేశం పేలవ పనితీరును ప్రదర్శిస్తోంది: "ప్రతి సంవత్సరం సగటున ముగ్గురు లేదా నలుగురు జర్నలిస్టులు తమ పని వల్ల హత్యకు గురవుతున్నారు. మీడియాకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాలలో భారతదేశం ఒకటి. ఆన్‌లైన్‌లో మహిళా జర్నలిస్టులపై వేధింపులు, కాశ్మీర్‌లో ప్రెస్ పై అణిచివేత, పోలీసుల జోక్యం గురించి నివేదిక ప్రత్యేకంగా చర్చించింది.

దక్షిణాసియాలో కూడా అన్ని దేశాలకన్నా భారత్ ర్యాంక్ అధ్వాన్నంగా ఉంది. బంగ్లాదేశ్ 163వ ర్యాంక్ లో భారత్ కన్నా కొంత వెనకపడగా, పాకిస్థాన్ భారత్ కంటే అనేక ర్యాంకులు ముందుండి 150వ స్థానంలో ఉంది. తాలిబాన్ ప్రభుత్వం పరిపాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ కూడా 152 ర్యాంక్‌తో మెరుగైన పనితీరు కనబరిచింది. భూటాన్ 90వ స్థానంలో, శ్రీలంక 135వ స్థానంలో ఉన్నాయి.

First Published:  3 May 2023 8:03 AM GMT
Next Story