Telugu Global
National

ఒలింపిక్స్ 2036 కోసం బిడ్ వేయనున్న ఇండియా!

ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐఓఏ) వేసే బిడ్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు తెలుపుతుందని మంత్రి స్పష్టం చేశారు.

ఒలింపిక్స్ 2036 కోసం బిడ్ వేయనున్న ఇండియా!
X

ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్ కోసం ఇండియా బిడ్ వేయనున్నదా? గుజరాత్ వేదికగా 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపిస్తోందా? అంటే అనుననే సమాధానం వస్తోంది. వేల కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన ఒలింపిక్స్ నిర్వహణకు గుజరాత్ ప్రభుత్వం సుముఖంగా ఉందని.. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి బిడ్ వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.

2023 సెప్టెంబర్‌లో ముంబై వేదికగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశాలు జరుగనున్నాయి. ఈ మీటింగ్స్‌లో 2036 ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు. ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐఓఏ) వేసే బిడ్‌కు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు తెలుపుతుందని మంత్రి స్పష్టం చేశారు. గుజరాత్‌లో అహ్మదాబాద్ వేదికగా ఒలింపిక్స్ నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి అభిప్రాయపడ్డారు. అహ్మదాబాద్‌లో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ కాంప్లెక్సులు, హోటల్స్, హాస్టల్స్‌తో పాటు ఎయిర్ పోర్టు కూడా ఉందని ఆయన చెప్పారు. అహ్మదాబాద్‌కు మించిన మంచి వేదిక ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.

ఇండియా వేదికగా 1982లో ఆసియన్ గేమ్స్, 2010లో కామన్వెల్త్ గేమ్స్ విజయవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలో తర్వాత అతి పెద్ద వేడుక ఒలింపిక్స్ అని అనురాగ్ ఠాకూర్ అన్నారు. జీ-20 వంటి అతిపెద్ద సమూహానికి ఇప్పుడు ఇండియా అధ్యక్ష హోదాలో ఉన్నది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన జీ-20 సమావేశాలను కూడా వచ్చే ఏడాది నిర్వహించబోతోంది. అలాంటప్పుడు ఒలంపిక్స్ నిర్వహణ మాత్రం ఎలా కష్టమవుతుందని అన్నారు. ఐవోఏతో కలిసి 2036 ఒలింపిక్స్ బిడ్ తప్పకుండా వేస్తామన్నారు. ఇప్పటికే 2032 వరకు ఎక్కడ నిర్వహించారో నిర్ణయం జరిగిపోయిందని.. అందుకే 2036 కోసం పోటీ పడుతున్నామని ఆయన చెప్పారు.

బిడ్ కోసం ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధం అవుతున్నామని.. తప్పకుండా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒలింపిక్స్ వంటి భారీ క్రీడా ఈవెంట్‌ను నిర్వహించడం వల్ల.. ఖర్చు ఎక్కవగా ఉంటుందని అందరూ భయపడుతున్నారు. కానీ స్థానికంగా ఎంతో మందికి ఉపాది, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన భారత కంపెనీలు భారీ ఆర్డర్లు దక్కించుకునే అవకాశం ఉంటుందని అనురాగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. బిడ్ గెలిస్తే.. తప్పకుండా ఈవెంట్‌ను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఐఓఏ సభ్యలు ఒలింపిక్స్ కోసం చాలా ఆసక్తిగా ఉన్నారని కూడా మంత్రి తెలిపారు.

అహ్మదాబాద్ వేదికగా 236 ఎకరాల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్‌ను రూ.4,600 కోట్ల వ్యయంతో ఇప్పటికే నిర్మిస్తున్నారు. కాబట్టి దీనికి అదనంగా మరికొన్ని క్రీడా ప్రాంగణాలు నిర్వహిస్తే సరిపోతుందని.. ఒలింపిక్స్ కోసం ఇవన్నీ ఉపయోగపడతాయని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. గుజరాత్ ప్రభుత్వం కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. భారీ ఖర్చు కాకుండా.. తక్కువ ఖర్చుతో నాణ్యమైన స్టేడియంలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇది మన దేశ ప్రతిష్టను మరింతగా పెంచుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

First Published:  28 Dec 2022 3:46 AM GMT
Next Story