Telugu Global
National

ప్రపంచ పేదరిక రాజధానిగా భారత్..

ప్రస్తుతం నైజీరియాకంటే భారత్ లోనే ఎక్కువమంది నిరుపేదలు ఉన్నారు. కనీసం తినడానికి తిండికూడా వారికి దొరకడంలేదు.

ప్రపంచ పేదరిక రాజధానిగా భారత్..
X

ప్రపంచంలో తీవ్ర దుర్భిక్షం, క్షామంతో అల్లాడే దేశం నైజీరియా. నైజీరియాలో నూటికి 39 మంది ప్రజలు ఆకలితో అలమటిస్తుంటారు. మిగతా 61మంది కడుపునిండి లగ్జరీగా బతుకుతున్నారనుకుంటే పొరపాటే. వారికి ఆకలి కేకలు ఉండవు, అంటే టైమ్ కి అన్నం మాత్రం దొరుకుతుంది. ఇక నైజీరియాలో ఓ మోస్తరు ధనవంతుల కేటగిరీ 10శాతానికి లోపే ఉంటుంది. అయితే నైజీరియాని సైతం వెనక్కి నెట్టేలా ఉంది భారత్ పరిస్థితి. కరోనా తర్వాత తీసిన లెక్కలు దీన్ని రుజువు చేస్తున్నాయి. ప్రపంచ పేదరిక రాజధానిగా భారత్ నైజీరియాని వెనక్కి నెడుతోందని చెబుతున్నాయి గణాంకాలు.

వరల్డ్ పావర్టీ క్లాక్..

ప్రపంచంలో జనాభా పెరుగుదలను సూచిస్తూ వరల్డ్ పాపులేషన్ క్లాక్ అనేది ఉంటుంది. ఏ క్షణం ఎంతమంది పుట్టారనేదానిపై ఆధారపడి.. ప్రపంచ జనాభాను అప్ టు డేట్ గా చూపిస్తుంది. అలాగే వరల్డ్ పావర్టీ క్లాక్ కూడా ఉంది. WPP అనే ఈ క్లాక్.. ఆధారంగా ఏయే దేశాల్లో పేదరికం ఎలా ఉంది అనేది అంచనా వేయొచ్చు. ఈ వెబ్ సైట్ సేకరించిన సమాచారం ప్రకారం నైజీరియాకంటే ప్రస్తుతం భారత్ లో పేదల సంఖ్య ఎక్కువగా ఉంది. భారత్ లో ప్రస్తుతం 8,30,68,693 మంది పేదలు కటిక దరిద్రం అనుభవిస్తున్నారు. అంటే కనీసం తినడానికి తిండి కూడా దొరకని పేదరికం అన్నమాట. ఇది 140కోట్ల భారత జనాభాలో 6 శాతానికి సమానం.

ఇక నైజీరియా విషయానికొస్తే.. 21.4కోట్ల జనాభా ఉన్న నైజీరియాలో 8,30,05,482 మంది పేదరికంలో ఉన్నారు. ఆ దేశ జనాభాతో పోల్చి చూస్తే పేదరికంలో ఉన్నవారి శాతం 39. అంటే దాదాపుగా ఆ దేశంలో నూటికి 40మంది ఆకలితో అలమటిస్తున్నారనమాట.

నూటికి ఎంతమంది పేదరికంలో ఉన్నారనే లెక్కలు తీస్తే నైజీరియాకంటే భారత్ మెరుగైన స్థానంలో ఉంది. కానీ ఏడాదికేడాది పేదల సంఖ్య పెరిగిపోతూ ఇప్పుడు నైజీరియానే దాటేసింది భారత్. ప్రస్తుతం నైజీరియాకంటే భారత్ లోనే ఎక్కువమంది నిరుపేదలు ఉన్నారు. కనీసం తినడానికి తిండికూడా వారికి దొరకడంలేదు. కరోనా తర్వాత ఈ సంఖ్య భారీగా పెరిగినట్టు WPP క్లాక్ తెలియజేస్తోంది. నైజీరియాలో మాత్రం ఈ సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని చెబుతున్నారు అధ్యక్షుడు మహ్మద్ బుహారి.

ఆర్థిక వ్యవస్థ విఫలం కావడం, నిత్యావసరాల రేట్లు భారీగా పెరిగిపోవడంతో భారత్ లో పేదల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మధ్యతరగతి కాస్తా దిగువ మధ్య తరగతిగా మారుతోంది. దిగువ మధ్యతరగతివారు పేదరికంలోకి వెళ్లిపోతున్నారు. కనీసం మూడుపుటలా తినడానికి తిండి దొరికే వారు సైతం, ఇప్పుడు ఉపాధి మార్గాలు కోల్పోయి ఒకపూట పస్తు ఉండాల్సిన పరిస్థితి. అందుకే పేదరికంలో నైజీరియాని వెనక్కి నెట్టింది భారత్.

First Published:  18 July 2022 4:52 AM GMT
Next Story