Telugu Global
National

జ‌మ్మూ క‌శ్మీర్‌లో భారీగా లిథియం నిల్వ‌లు.. - విద్యుత్ వాహ‌నాల త‌యారీలో కీల‌కం

గ‌నుల శాఖ 2018-19లో నిర్వ‌హించిన స‌ర్వేలో దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 51 ఖ‌నిజ నిక్షేపాల‌ను క‌నిపెట్టింది. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అందించింది.

జ‌మ్మూ క‌శ్మీర్‌లో భారీగా లిథియం నిల్వ‌లు.. - విద్యుత్ వాహ‌నాల త‌యారీలో కీల‌కం
X

జ‌మ్మూ క‌శ్మీర్‌లో దాదాపు 59 ల‌క్ష‌ల ట‌న్నుల లిథియం నిల్వ‌లు ఉన్న‌ట్టు కేంద్ర గ‌నుల శాఖ శుక్ర‌వారం వెల్ల‌డించింది. విద్యుత్ వాహ‌నాల త‌యారీలో ఇవి కీల‌కం. బ్యాట‌రీలు, విద్యుత్ ప‌రిక‌రాల త‌యారీలో వీటిని వినియోగిస్తున్నారు. అత్యంత కీల‌క‌మైన ఈ లిథియం నిల్వ‌ల‌ను భార‌త్‌లో తొలిసారిగా క‌నుగొన‌డం గ‌మ‌నార్హం. `జ‌మ్ము క‌శ్మీర్‌లోని రిసాయి జిల్లా స‌లాల్ హైమానా లిథియం నిల్వ‌ల‌ను జియోలాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది` అంటూ ట్వీట్ చేసింది.

గ‌నుల శాఖ 2018-19లో నిర్వ‌హించిన స‌ర్వేలో దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 51 ఖ‌నిజ నిక్షేపాల‌ను క‌నిపెట్టింది. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అందించింది. బంగారంతో పాటు పొటాషియం, మాలిబ్డినం ఇంకా ఇత‌ర ప్రాథ‌మిక లోహాల నిక్షేపాల‌ను 11 రాష్ట్రాల్లో గుర్తించింది. బంగారం నిల్వ‌ల‌ను 5 క్షేత్రాల్లో కనుగొంది. జ‌మ్మూ క‌శ్మీర్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, గుజ‌రాత్‌, జార్ఖండ్‌, క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఒడిశా, రాజ‌స్థాన్‌, త‌మిళ‌నాడు, తెలంగాణ రాష్ట్రాల్లో ఖ‌నిజ నిక్షేపాలు ఉన్న‌ట్టు గ‌నుల శాఖ తెలిపింది.

ప్ర‌స్తుతం మ‌న దేశం లిథియంను విదేశాల నుంచి దిగుమ‌తి చేసుకుంటోంది. ఇప్పుడు ఈ ఖ‌నిజ నిల్వ‌లు జ‌మ్మూ క‌శ్మీర్‌లో బ‌య‌ట‌ప‌డ‌టంతో రాబోయే రోజుల్లో దేశంలో విద్యుత్ వాహ‌నాల త‌యారీ రంగం వేగం పుంజుకోనుంది. లిథియం దిగుమ‌తుల భారం త‌గ్గుతుంది. ఈ నేప‌థ్యంలో విద్యుత్ వాహ‌నాల ధ‌ర‌లు దిగివ‌చ్చే అవ‌కాశాలున్నాయి. స్మార్ట్ ఫోన్ల త‌యారీలోనూ లిథియంను వినియోగిస్తారు. వీటి ధ‌ర‌లు కూడా త‌గ్గే అవ‌కాశ‌ముండొచ్చు.

First Published:  11 Feb 2023 5:05 AM GMT
Next Story