Telugu Global
National

ఓటింగ్ లో భారత్ వరల్డ్ రికార్డ్.. ఎందుకంటే..?

ఈసారి 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం లేకుండానే పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశామంటున్నారు అధికారులు. గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించగా.. ఈసారి ఆ సంఖ్య 39కు తగ్గిందన్నారు.

ఓటింగ్ లో భారత్ వరల్డ్ రికార్డ్.. ఎందుకంటే..?
X

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే సమయంలో ఈసీ ప్రెస్ మీట్ పెట్టడం రివాజు. అయితే తొలిసారిగా ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలియజేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని తెలిపారాయన. ఈ ఎన్నికల్లో 64.2కోట్లమంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, ఇది ప్రపంచ రికార్డు అని చెప్పారు.


మన దేశంలో మొత్తం 96.88కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అందులో 64.2 కోట్లమంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జీ-7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే భారత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నవారి సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ అని తెలిపారు సీఈసీ. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ అని చెప్పారు. ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారని, మొత్తం 31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారికి హ్యాట్సాఫ్ అన్నారు అధికారులు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ ఇదేనంటున్న ఎన్నికల కమిషన్.. మొత్తం కోటిన్నరమంది పోలింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది ఈసారి విధులు నిర్వర్తించారని తెలిపింది. 135 ప్రత్యేక రైళ్లను ఎన్నికలకోసమే అందుబాటులోకి తెచ్చారు, మొత్తం 4లక్షల వాహనాలను ఈ ప్రక్రియలో ఉపయోగించారు. ఈ ఎన్నికల సమయంలో సీ-విజిల్‌ యాప్‌లో 4.56 లక్షల ఫిర్యాదులు అందాయని, వీటిలో 99.9శాతం ఫిర్యాదులను పరిష్కరించామని అధికారులు తెలిపారు. 87.5శాతం ఫిర్యాదుల్ని నమోదైన 100 నిమిషాల లోపే పరిష్కరించామన్నారు.

రీపోలింగ్ అవసరం లేకుండా..

గతంలో రిగ్గింగ్ లు, బూత్ ఆక్రమణలు ఎక్కువగా జరిగేయి. కానీ ఈసారి 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం లేకుండానే పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశామంటున్నారు అధికారులు. గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్‌ నిర్వహించగా.. ఈసారి ఆ సంఖ్య 39కు తగ్గిందన్నారు. కేవలం రెండు రాష్ట్రాల్లోనే 25 చోట్ల రీపోలింగ్‌ జరిగిందని చెప్పారు. గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో అత్యధికంగా 58.58శాతం ఓటింగ్ నమోదైందని తెలిపారు. ఇక రేపు(మంగళవారం) జరిగే ఎన్నికల లెక్కింపు కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు ఈసీ తెలిపింది.

First Published:  3 Jun 2024 12:12 PM GMT
Next Story