Telugu Global
National

పెళ్ళి చేసుకొని నరకం అనుభవించబోము...పెరుగుతున్న ఒంటరి మహిళలు

పెళ్ళి వల్ల కష్టాలు, కన్నీళ్ళు, స్వేచ్చ కోల్పోవాల్సి రావడం.. ఈ కారణాల వల్ల దేశంలో పెళ్ళి చేసుకోకుండా ఉండిపోతున్న యువత‌ శాతం పెరుగుతోంది. అందులోనూ మహిళల శాతం ఎక్కువగా ఉంది.

పెళ్ళి చేసుకొని నరకం అనుభవించబోము...పెరుగుతున్న ఒంటరి మహిళలు
X

తమ తల్లి తండ్రుల, ఇతర బంధువుల, తెలిసిన వాళ్ళ సంసార జీవితాలు చూసి పెళ్ళంటేనే చాలా మందికి భయం కలుగుతోంది. పెళ్ళంటేనే నరకంలాగా భావించే యువత శాతం పెరుగుతోంది. ముఖ్యంగా మహిళలు చాలా మంది పెళ్ళి తమ స్వేచ్చను హరించి నరకంలో పడేస్తుందని భావిస్తున్నారు.

ఈ విషయంలో సర్వే చేసిన స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం జులైలో రిపోర్టు విడుదల చేసింది. 'యూత్ ఇన్ ఇండియా 2022' రిపోర్టులో ఆసక్తి కర విషయాలు పేర్కొంది ఆ మంత్రిత్వ శాఖ. పెళ్ళి చేసుకోకుండా ఒంటరిగా ఉండె స్త్రీ పురుషుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని అందులోనూ స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉందని ఆ నివేదిక తెలిపింది. 2011-2019 మధ్య అవివాహిత మహిళల శాతం దాదాపు రెండింతలు పెరిగిందని పురుషుల్లో 12 శాతం పెరిగిందని ఈ సర్వే తెలిపింది.

ఈ ఏడాది మార్చిలో విడుదలైన 'శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే రిపోర్ట్ 2019' ప్రకారం దేశంలో ఒంటరి పురుషులు 1.5 శాతం ఉండగా ఒంటరి మహిళలు 5.2 శాతం ఉన్నారు. ఒంటరి మహిళలు అంటే విడాకులు తీసుకున్నవారు భర్త చనిపోయినవారు లేదా పెళ్లయి వేరుగా ఉన్నవారు.

ఇక రాష్ట్రాల ప్రకారం చూస్తే కేరళలో ఒంటరి మహిళల శాతం ఎక్కువగా ఉంది, దాని తర్వాత వరసగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. కేరళలో 9.2 శాతం మంది ఒంటరి మహిళలు ఉండగా తమిళనాడులో 8.9 శాతం, ఆంధ్రప్రదేశ్ లో 7.6 శాతం, తెలంగాణలో 7.0 శాతం మహిళలు పెళ్ళి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఈ రాష్ట్రాలే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఒంటరి పురుషులకన్నా ఒంటరి మహిళలే ఎక్కువగా ఉన్నారు.

దీనికి కారణమేంటి ?

మన సమాజంలో స్త్రీలపై ఉండే ఆంక్షలు, పరువు, ప్రతిష్టల పేరుతో భరించే బాధలు వాళ్ళలో పెళ్ళి పట్ల వ్యతిరేకత పెంచుతోంది. పెళ్ళిలో తల్లితండ్రుల, బంధువుల, సమాజం బలవంతం మహిళను పెళ్ళికి వ్యతిరేకం చేస్తున్నాయి. మరో వైపు పురుషాధిక్య సమాజం కావడంతో భర్తలు భార్యలతో ప్రవర్తించే పద్దతులు, ఇంట్లో పనులన్నీ ఒక్కరే చేసుకోవడం, ఇష్టమున్నా లేక పోయినా పిల్లలను కనాల్సి రావడం, పిల్లల బాధ్యత పూర్తిగా తల్లిదే అవడం, పర్సనల్ స్పేస్ లేక పోవడం...ఇలాంటి చాలా కారణాల రీత్యా మహిళలు పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు.

పరువు కోసం, తల్లిదండ్రుల కోసం, కుటుంబం కోసం అష్ట కష్టాలు పడుతూ నచ్చని పనిని చేస్తూ తమ జీవితాన్ని నరకం చేసుకున్న తమ ముందు తరం మహిళలను చూసి చాలా మంది యువతులు అలాంటి జీవితం తమకు వద్దనుకుంటున్నారు.

అయితే తమను అర్దం చేసుకున్న వాళ్ళు దొరికితే పెళ్ళి చేసుకోవాలనుకునేవారు కూడా ఉన్నారు. తమకు కూడా ప్రేమ కావాలని అయితే దానికోసం తమ స్వేచ్చను కోల్పోతే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని నేటి యువతి అభిప్రాయం.

First Published:  31 July 2022 5:14 AM GMT
Next Story