Telugu Global
National

భారత పౌరసత్వానికి తిలోదకాలిస్తున్న భారతీయులు

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో 3 కోట్ల 20 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. ప్రతి ఏటా దేశం నుంచి 25 లక్షల మందికి పైగా విదేశాలకు వలస పోతున్నారని భారత్‌ విదేశీ మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి.

భారత పౌరసత్వానికి తిలోదకాలిస్తున్న భారతీయులు
X

బతుకు కోసం వలస పోవడమే కాదు, అసలు భారత్‌ పౌరసత్వమే అక్కర్లేదని విదేశాల్లో స్థిరపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. గత ఏడాది లక్షా 63 వేలమంది భారతీయులు ఇక్కడ తమ పౌరసత్వాన్ని వదలుకొని విదేశాలకు వెళ్ళిపోయి స్థిరపడ్డారు. విదేశాలకు వెళ్ళాలనుకునేవారిలో ఎక్కువమంది గమ్యస్థానం అమెరికా. కనుకనే గత ఏడాది పౌరసత్వం వదులుకున్న వారిలో 78 వేల మంది అమెరికాలో స్థిరపడటం గమనార్హం. అమెరికా తరువాత కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, ఇటలీ దేశాలలో స్థిరపడానికి ప్రాధాన్యమిస్తున్నారు వలస వెళ్ళే భారతీయులు.

2019లో విదేశాలకు వెళ్ళిన భారతీయులలో ఒక లక్షా 44 వేల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ సంఖ్య 2020లో కరోనా తదితర కారణాల వల్ల తగ్గింది. 2020లో పౌరసత్వం వదులుకున్న భారతీయుల సంఖ్య 85,256 మాత్రమే. కాగా, 2020 సంవత్సరంతో పోలిస్తే భారత్‌ పౌరసత్వం వీడి విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య 2021లో రెట్టింపు అయింది. గత ఐదేళ్ళలో దాదాపు 6 లక్షల 70 వేల మంది భారత్‌ పౌరసత్వాన్ని శాశ్వతంగా వదులుకొని వెళ్ళిపోయారు. వ్యక్తిగత కారణాల వల్లనే కొందరు భారత పౌరసత్వాన్ని వదులుకుంటున్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సంపన్నులు, శాస్త్ర, సాంకేతిక రంగాల నిపుణులు శాశ్వతంగా భారత పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల్లో స్థిరపడుతున్నారని వలసలకు సంబంధించిన పలు అధ్యయనాల నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో 3 కోట్ల 20 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. ప్రతి ఏటా దేశం నుంచి 25 లక్షల మందికి పైగా విదేశాలకు వలస పోతున్నారని భారత్‌ విదేశీ మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇలా అత్యధికంగా వలసపోతున్న జనాభాకు చెందిన దేశాల్లో భారత్‌ మొదటిస్థానంలో ఉన్నది. వారిలో శాశ్వతంగా భారత పౌరసత్వాన్ని వదులుకొనే వారి సంఖ్య గత ఆరేళ్ళుగా పెరుగుతుండటం పట్ల కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా పుంజుకుంటున్న మన దేశం నుంచి వలసలు పెరగడం, పౌరసత్వాన్ని వదులుకునే వారి సంఖ్య రెట్టింపు కావడం భారత్‌ ప్రతిష్టని దిగజారుస్తుందని ఆర్థిక, రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

మన దేశంలో కాలుష్యం పెరగడం, పర్యావరణానికి ముప్పు వాటిల్లడం, ప్రజాస్వామిక విలువలు దెబ్బతినడం, మతోన్మాద హింస పెచ్చరిల్లడం, సంస్థల వ్యవస్థల పనితీరులో పారదర్శకత కొరవడటం మూలంగా ఈ దేశంలో బతకలేమని వలసపోయేవారి సంఖ్య ఇనుమడిస్తున్నది. యూరోపియన్‌ దేశాల్లో, అమెరికా, ఆస్ట్రేలియాలలో తమ పని తాము చేసుకుంటూ శాంతంగా బతకడానికి అలవాటు పడినవారు భారతదేశంలో బతుకు నానాటికీ దుర్భరమవుతున్నదని చెబుతున్నారు. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లో కాలుష్యం పెరగడం, విపరీతమైన జనసాంద్రత, బయటకు వెళ్ళి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కొరవడటం, శాంతి భద్రతల సమస్యలు నెలకొనటం వల్ల భద్రమైన బతుకు కొరవడిందని యువతరం భావిస్తున్నది. అందుకని ఒకసారి చదువుల కోసం విదేశాలకు వెళ్ళినవారు, అక్కడే ఉద్యోగాలు చూసుకొని స్థిరపడటానికి ప్రాధాన్యమిస్తున్నారు. భారత్‌లో కన్నా విదేశాల్లో ఆర్థిక భద్రత, బతుక్కి భరోసా, ప్రశాంతమైన జీవనం లభిస్తున్నందున భారత్‌ పౌరసత్వం వదులుకోడానికి సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా వృత్తి నిపుణులు, సంపన్నులు భారత్‌లో ఉండలేమని స్పష్టంగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ''ఈ దేశం నాకేమిచ్చిందని కాదు, ఈ దేశానికి నేను ఏమిచ్చాను'' అని ఆలోచించాలనే విలువలని ఎవరయినా గుర్తు చేయడం విస్మయం కలిగించదు. దీనికి ప్రవాస భారతీయుల నుంచి రకరకాల జవాబులు వినిపిస్తున్నాయి. ముందుగా తాము ఈ దేశంలో బతికే పరిస్థితులున్నాయా అన్నది ప్రశ్న. పాలనా వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరిగింది. పైరవీలు లేకుండా చిన్న పని కూడా జరగని దేశంలో ఎవరయినా తమ ఆశయసాధనలో బతికేదెలా అన్నది అసలైన ప్రశ్న.

గత ఎనిమిదేళ్ళ నరేంద్ర మోదీ పాలనలో అనేక వ్యవస్థలు భ్రష్టుపట్టాయి. సంస్థలు విచ్ఛిన్నమవుతూ వచ్చాయి. జనాలకు ఏదో మేలు చేద్దామని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయ్యే వారు చట్ట ప్రకారం తమ పని తాము చేయగల పరిస్థితులు ప్రశ్నార్థకమయ్యాయి. అడుగడుగునా రాజకీయ జోక్యం ఇక్కట్లకు లోను చేస్తున్నది. నేతల కనుసన్నల్లో పని చేయడం కన్నా విదేశాలకు వెళ్ళి స్థిరపడటం మేలని అనేకులు తలపోస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల కారణంగా వలసపోయే వారి సంఖ్య, పౌరసత్వం వదులుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ఈ స్థితి కాషాయ పరివార పాలన దుష్ఫలితం. అంతిమంగా సంఘీయుల దేశభక్తి మంత్రజపం దేశాన్ని వదిలిపోయేలా బేజారెత్తిస్తున్నదన్నది నిజం.

First Published:  11 Nov 2022 1:33 AM GMT
Next Story