Telugu Global
National

పెళ్లిమండపమంతా డబ్బు, బంగారమే.. మేనకోడలి పెళ్లికి మామలు చేసిన పనికి అంతా షాక్..!

మేనమామలు తమ మేనకోడలి పెళ్లికి కట్నంగా రూ.80 లక్షల నగదు, 41 తులాల బంగారం, మూడు కేజీల వెండి, ఒక ట్రాక్టర్, స్కూటీ, పదెకరాల భూమి, రూ.30 లక్షల విలువ చేసే ప్లాట్ తదితర బహుమతులు అందజేశారు.

పెళ్లిమండపమంతా డబ్బు, బంగారమే.. మేనకోడలి పెళ్లికి మామలు చేసిన పనికి అంతా షాక్..!
X

తండ్రి తర్వాత తండ్రి అంతటి వ్యక్తిగా తల్లి సోదరుడు అయిన మేనమామను చెప్పుకుంటారు. మేనకోడలు లేదా మేనల్లుడులకు సంబంధించిన వివాహాలు లేదా ఇతర శుభకార్యాల్లో మేనమామలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ఇదిలా ఉండగా రాజస్థాన్‌లో తమ మేనకోడలు వివాహానికి మేనమామలంతా కలిసి రూ. 3.21 కోట్ల విలువచేసే నగదు, ఆస్తులు అందజేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వివాహ మండపంలో మేనమామలు అబ్బాయి తరఫు బంధువులకు కట్టలు కట్టలు పేర్చి డబ్బు అందిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగౌర్ జిల్లా బుర్డీ గ్రామంలో నివసించే ముగ్గురు అన్నదమ్ములు ఎంతో ధనవంతులు. వారికి రెండు వేల ఎకరాలకు పైగా భూమి ఉంది.

కాగా, ఆ అన్నదమ్ముల చెల్లెలి కుమార్తె వివాహం ఇటీవల నిశ్చయం అయింది. బుర్డీ గ్రామంలో మైరా అనే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయం ప్రకారం మేనకోడలి వివాహానికి ఇచ్చే కట్న కానుకలను మేనమామలే భరిస్తుంటారు. ఆ విధంగా ముగ్గురు మేనమామలు తాజాగా జరిగిన తమ మేనకోడలి వివాహం సందర్భంగా వరుడి కుటుంబానికి అందజేసిన కట్న కానుకలు, బహుమతులు, నగదు చూసి పెళ్లికి వచ్చినవారు కళ్ళు తేలేశారు.

ఆ మేనమామలు తమ మేనకోడలి పెళ్లికి కట్నంగా రూ.80 లక్షల నగదు, 41 తులాల బంగారం, మూడు కేజీల వెండి, ఒక ట్రాక్టర్, స్కూటీ, పదెకరాల భూమి, రూ.30 లక్షల విలువ చేసే ప్లాట్ తదితర బహుమతులు అందజేశారు. పెళ్లి సందర్భంగా మేనమామలు మొత్తం రూ. 3.21 కోట్ల విలువచేసే సంపద కట్నంగా అందజేయడంతో వివాహానికి వచ్చిన బంధువులు, గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.

పెళ్లి మండపంలో ముగ్గురు మేనమామలు పెద్ద మొత్తంలో బంగారంతో పాటు డబ్బు కట్టలు కట్టలు పేర్చి అబ్బాయి తరపువారికి అందజేశారు. ఇందుకు సంబంధించి కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. మేనమామలు తమ మేనకోడలి కోసం ఇంత పెద్ద మొత్తంలో బహుమతులు, కానుకలు అందజేయడంపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

First Published:  17 March 2023 11:31 AM GMT
Next Story