Telugu Global
National

మద్య నిషేధం అమలులో ఉన్న గుజరాత్ లో ఎన్నికల వేళ ఏరులై పారుతున్న మద్యం

గుజరాత్ లో ఎన్నికల వేళ మద్యం ఏరులై పారుతోంది. మద్య నిషేధం అమలులో ఉన్న గుజరాత్ లో మద్యం అంత సులభంగా లభి‍ంచడం పట్ల అనేక విమర్శలు వస్తున్నాయి.

మద్య నిషేధం అమలులో ఉన్న గుజరాత్ లో ఎన్నికల వేళ ఏరులై పారుతున్న మద్యం
X

గుజరాత్ లో మద్య నిషేదం అమలులో ఉంది. కాయితాల్లోనే ఉందా నిజంగానే ఉందా అనేది వేరే విషయం కానీ ప్రభుత్వ లెక్క ప్రకారం మద్య నిషేదం ఉంది. మనమూ అదే నమ్ముదాం.

మోదీ పుట్టిన రాష్ట్రంలో (గాంధీ పుట్టిన రాష్ట్రం అనొద్దు) ఎంత పటిష్టంగా మద్య నిషేధం అమలు పరుస్తునారో బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటుంది. కానీ అక్కడ కల్తీ మద్యం తాగి చనిపోయే జనాల సంఖ్య తక్కువేంకాదు.

ఈ ఏడాది జూలైలో బోటాడ్ జిల్లాలోని రోజిద్ గ్రామ‌స్తులు ధందుక, భావ్​నగర్ ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగి 30 మంది చనిపోయారు. అనేక మంది ఆస్పత్రిపాలయ్యారు. ఇది ఈ మధ్య‌ జరిగిన సంఘటన. గుజరాత్ లో మద్య ఏరులై ప్రవహిస్తుందనడానికి ఇదో ఉదహరణ.

ఇక ఇప్పుడు ఎన్నికలొచ్చాయి. ఒక వైపు కల్తీ మద్యం మరో వైపు ఫారెన్ లిక్కర్ గుజరాత్ గల్లీ గల్లీలో వరద‌లా పారుతోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మూడో రోజే ఎన్నికల కమిషన్ 1,10,000 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుంది. నిజానికి గుజరాత్ లో ప్రస్తుతం పారుతున్న మద్యంలో ఇది ఐదు శాతం కూడా కాదనే ఆరోపణలున్నాయి. ఇక ఇప్పటి వరకు ఎంత మద్యం పంపకాలు జరిగుంటుందో ఊహించవచ్చు.

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తాజాగా నగదు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఇతర నిషిద్ధ వస్తువులను రికార్డు స్థాయిలో స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

హిమాచల్ ప్రదేశ్‌లో నవంబర్ 10వ తేదీ వరకు ₹50.28 కోట్ల రూపాయలను జప్తు చేసింది ఎన్నికల సంఘం. ఇదే 2017 సంవత్సరంలో జరిగిన్బ ఎన్నికలప్పుడు ₹9.03 కోట్లు మాత్రమే. అంటే ఈ సారి ఐదు రెట్లు పెరుగుదల ఉంది.

ఇక గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కేవలం ఒక వారం వ్యవధిలో ₹71.88 కోట్ల మేర జప్తుచేశారు అధికారులు. ఇదే 2017 లో ₹27.21 కోట్లు మాత్రమే జప్తు చేశారు.

గుజరాత్‌లో ఓటర్లకు పంచడానికి ఉద్దేశించిన ₹71.88 కోట్ల విలువైన చీరలు, ధోతులు, ప్రెషర్ కుక్కర్లు, దుప్పట్లు, ఇతర సాధారణ గృహోపకరణాలు వంటి వస్తువులను ఈసీ స్వాధీనం చేసుకున్నది.

అంతే కాదు ₹64 కోట్ల విలువైన బొమ్మలు, గృహోపకరణాలు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. ఇవన్నీ అదానీకి చెందిన ముంద్రా పోర్ట్ ద్వారా వచ్చినవే.

టీఆరెస్ నేత కృషాంక్ ఈ అంశంపై స్పందిస్తూ, గుజరాత్, హిమాచల్ లలో ఈసీ స్వాధీనం చేసుకున్న మద్యం డబ్బులు తదితర వివరాలతో కూడిన పోస్టర్ ను షేర్ చేసి మద్య‌ నిషేధం ఉన్న గుజరాత్ లో ఇదీ పరిస్థితి అని ట్వీట్ చేశారు.

First Published:  17 Nov 2022 6:05 AM GMT
Next Story