Telugu Global
National

'ఆత్మనిర్బర భారత్' అట్టర్ ప్లాప్... చైనా నుండి రోజురోజుకూ పెరుగుతున్న దిగుమతులు

ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో అంటే 2022 జనవరి నుండి సెప్టంబర్ మధ్యలో చైనా నుండి భారతదేశం యొక్క దిగుమతులు 31% పెరిగాయి.తద్వారా మన వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరుకుంది.మరో వైపు మనదేశం నుండి చైనాకు దిగుమతులు దారుణంగా పడిపోయాయి.

ఆత్మనిర్బర భారత్ అట్టర్ ప్లాప్... చైనా నుండి రోజురోజుకూ పెరుగుతున్న దిగుమతులు
X

మేకిన్ ఇండియా... ఆత్మనిర్బర భారత్... ప్రధాని ప్రతిరోజూ ఇచ్చే ఈ నినాదాలు వినసొంపుగా ఉన్నప్పటికీ ఆచరణలో విఫలమవుతున్నాయి. ఇప్పటికీ దిగుమతులమీదనే మనం ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. మరో వైపు భారత్ , చైనా సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొన్నప్పుడల్లా చైనా వస్తువుల బహిష్కరణ అనే ఓ ప్రహసనం మన దేశంలో సాగుతుంది. చైనా యాప్ లను బ్యాన్ చేసి భుజాలెగరేసుకుంటాం. కానీ చైనా నుండి మన దేశానికి దిగుమతులు ప్రతీ ఏడాది పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గే సూచనలే కనపడటం లేదు. మనం అనేక విషయాల్లో పూర్తిగా చైనా మీద ఆధారపడే పరిస్థితి ఉన్నది.

ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో అంటే 2022 జనవరి నుండి సెప్టంబర్ మధ్యలో చైనా నుండి భారతదేశం యొక్క దిగుమతులు 31% పెరిగాయి.తద్వారా మన వాణిజ్య లోటు రికార్డు స్థాయికి చేరుకుంది.

హిందూ పత్రిక నివేదిక ప్రకారం, 2022 జనవరి, సెప్టెంబర్ మధ్య భారతదేశం చైనా నుండి 89.66 బిలియన్ డాలర్ల‌ విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. ఇది భారత దిగుమతుల‌ చరిత్రలోనే అత్యధికం. గతేడాది కూడా ఇదే పరిస్థితి ఉండింది. 2021 జనవరి నుండి సెప్టంబర్ మధ్యలో 68.46 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకున్నాము.

మరో వైపు మనదేశం నుండి చైనాకు దిగుమతులు దారుణంగా పడిపోయాయి. జనవరి-సెప్టెంబర్ 2022 కాలంలో చైనాకు భారతదేశం నుండి ఎగుమతులు 36.4% పడిపోయి13.97 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని హిందూ వార్తాపత్రిక పేర్కొంది.

ది ప్రింట్ వెబ్ పోర్టల్ ప్రకారం, మనం చైనా నుంచి చేసుకునే దిగుమతుల్లో ఎక్కువ భాగం క్యాపిటల్ గూడ్స్ (ఇనుము, ఉక్కు, బిల్డింగ్ మెటీరియల్ తదితరాలు) విభాగంలోనే ఉన్నాయి. 2011 , 2021 మధ్య సగటున, చైనా నుండి భారతదేశం యొక్క క్యాపిటల్ గూడ్స్ దిగుమతి సంవత్సరానికి సుమారు 10% చొప్పున పెరిగింది.

"2022లో చైనా నుండి ఇనుము, ఉక్కు దిగుమతులు బాగా పెరిగాయి. జనవరి-ఆగస్టు 2021లో, భారతదేశం 0.74 బిలియన్ డాలర్ల విలువైన ఇనుము, ఉక్కును దిగుమతి చేసుకుంది. 2022లో ఇది 1.14 బిలియన్ డాలర్లకు పెరిగింది. అంటే దాదాపు 54 శాతం పెరిగింది" అని ది ప్రింట్ నివేదించింది.

ది ప్రింట్ ప్రకారం, 2022లో చైనా నుండి మన దేశానికి ప్లాస్టిక్ వస్తువుల దిగుమతులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ మెషినరీ,వాటి విడిభాగాల దిగుమతులు కూడా 37% పెరిగాయి.

చివరకు దేశ‌ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మన దేశ జాతీయ జెండాలను కూడా చైనా నుంచే దిగుమతి చేసుకున్న దుస్థితికి మనం చేరుకున్నాం.

ఈ దిగుమతుల వల్ల మన వాణిజ్య లోటు దారుణంగా పెరిగిపోతూ ఉన్నప్పటికీ నినాదాలే తప్ప ఆచరణ లేని కేంద్ర ప్రభుత్వ విధానాలు మన ఆర్థిక వ్యవస్థను మరింత దిగజార్చే దిశగా తీసుకెళ్తున్నాయి. చైనాకు వ్యతిరేకంగా పోరాటం, చైనా వస్తువుల బహిష్కరణ..ఉపన్యాసాలకే పరిమితమవుతున్నాయి. అలాగే ఆత్మనిర్బర్ భారత్ కాస్తా ఇతరులపై ఆధారపడకుండా బతకలేని భారత్ గా మిగిలిపోతున్నది. మరి ఇప్పటి కైనా రాజకీయ నినాదాలు మాని కేంద్ర‍ప్రభుత్వం దేశభవిష్యత్తు గురించి ఆలోచిస్తుందని భావించవచ్చా ?

First Published:  10 Nov 2022 1:46 AM GMT
Next Story