Telugu Global
National

బిల్కిస్‌ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తమ లొంగుబాటు గడువు పొడిగింపు కోరుతూ దోషులు గురువారం పిటిషన్లు దాఖలు చేశారు. దీని కోసం వారు పేర్కొన్న ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలు వంటి కారణాలను ధర్మాసనం తోసిపుచ్చింది.

బిల్కిస్‌ బానో కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
X

సంచలనం సృష్టించిన బిల్కిస్‌ బానో కేసులో సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో దోషులు తమ లొంగుబాటు గడువు పొడిగించాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా, ధర్మాసనం అందుకు నిరాకరించింది. గుజరాత్‌ అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానోపై సామూహిక అత్యాచారం చేసి, ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో దోషులైన 11 మంది ఈ నెల 21వ తేదీన లొంగిపోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.

తమ లొంగుబాటు గడువు పొడిగింపు కోరుతూ దోషులు గురువారం పిటిషన్లు దాఖలు చేశారు. దీని కోసం వారు పేర్కొన్న ఆరోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలు వంటి కారణాలను ధర్మాసనం తోసిపుచ్చింది. దోషులందరూ ఈ నెల 21న జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సిందేనని జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం స్పష్టంచేసింది.

వారంతా పోలీసు నిఘాలోనే..

బిల్కిస్‌ బానో కేసు దోషులందరూ పోలీసు నిఘాలోనే ఉన్నారని గుజరాత్‌ పోలీసులు వెల్లడించారు. దోషులందరూ జాడ లేకుండా పోయారంటూ వచ్చిన వార్తలను వారు తోసిపుచ్చారు. ఈనెల 8న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే దోషులందరూ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఎక్కడ ఉంటున్నారో వివరించారని దాహోద్‌ జిల్లా లిమేడా డివిజన్‌ ఏఎస్పీ బిశాఖ జైన్‌ శుక్రవారం తెలిపారు. దోషులందరూ తమ నిఘాలోనే ఉన్నారని ఆయన తెలిపారు.

First Published:  20 Jan 2024 3:38 AM GMT
Next Story