Telugu Global
National

'యూపీ, బీహార్ చేతులు కలిపితే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించినట్టే'

ఉత్తరప్రదేశ్, బీహార్ చేతులు కలిపితే మోడీ సర్కార్ కూలిపోవడం ఖాయమంటూ యూపీలో పోస్టర్లు వెలిశాయి. దేశ రాజకీయాల గమనాన్ని మార్చిన చ‌రిత్ర ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బీహార్ రాష్ట్రాల‌కు ఉందని స‌మాజ్ వాది పార్టీ అధికార ప్ర‌తినిధి ఐపి సింగ్ చెప్పారు.

యూపీ, బీహార్ చేతులు కలిపితే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించినట్టే
X

దేశ వ్యాప్తంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ (బిజెపి)కి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌మ‌వుతుండ‌గా ప్ర‌జ‌ల్లో కూడా ఉత్సాహం పెరుగుతోంది. విప‌క్షాల ఐక్య‌త‌కు మ‌ద్ద‌తునిస్తూ పోస్ట‌ర్లు వెలుస్తున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) లక్నో కార్యాలయం వద్ద ఓ పోస్టర్ ఉత్తరప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. బీహార్ ముఖ్యమంత్రి, జెడి (యు) నేత‌ నితీష్ కుమార్, ఎస్పి వ్య‌వ‌స్థాప‌కుడు ములాయం సింగ్ యాదవ్ స‌మావేశ‌మైన కొద్ది రోజుల‌కే పార్టీ కార్యాల‌యం వ‌ద్ద ఈ పోస్ట‌ర్ ప్ర‌త్య‌క్ష‌మైంది.

పోస్టర్‌లో " ఉత్తరప్రదేశ్, బీహార్ చేతులు కలిపితే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయం" (యుపి + బీహార్ = గయీ మోడీ సర్కార్ ) అని రాసి ఉంది. పోస్టర్‌పై నితీష్, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రజలకు అభివాదం చేస్తున్న‌ట్టుగా చేతులు ఊపుతున్న ఫోటోలు ఉన్నాయి. బ్లాక్ అండ్ వైట్ బ్యాన‌ర్ లో రెండే రంగులు ప్ర‌త్యేకంగా క‌నిపిస్తున్నాయి. నితీష్ ఆకుప‌చ్చ కండువాతో, అఖిలేష్ ఎర్ర టోపీ ధ‌రించి ఉన్నారు. వారి వారి పార్టీల ప్రాధాన్యాల‌కు ప్ర‌తీక‌లుగా ఆ రంగులు నిలుస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ లో 80, బీహార్ లో 40 కలిసి 120 ఎంపీలను లోక్‌సభకు పంపుతాయి. ఈ రెండు రాష్ట్రాల్లో మెరుగైన పనితీరు కనబరిచే పార్టీలు కానీ, రాజకీయ కూట‌ములు కానీ సాధార‌ణంగా ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో స్థితిలో ఉంటాయి. దేశ రాజకీయాల గమనాన్ని మార్చిన చ‌రిత్ర ఉత్త‌ర‌ప్ర‌దేశ్, బీహార్ రాష్ట్రాల‌కు ఉందని స‌మాజ్ వాది పార్టీ అధికార ప్ర‌తినిధి ఐపి సింగ్ చెప్పారు. ఈ బ్యాన‌ర్ ఏర్పాటు వెన‌క ఆయ‌న ప్రోత్సాహం ఉంద‌ని చెబుతున్నారు.

దేశ రాజ‌కీయాలు మార్చాల‌ని ఈ రెండు రాష్ట్రాలు నిర్ణ‌యించుకుంటే ఇత‌ర పార్టీల‌కు ఇక చేసేదేమీ ఉండ‌దు. ఇప్పుడు ఇదే జ‌రుగుతోంది. రానున్న రోజుల్లో బీజేపీ ఇక అధికారంలో ఉండ‌దు అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి), రాష్ట్రీయ లోక్‌దళ్ ( ఆర్ ఎల్ డి) పార్టీలు సోషలిస్టు భావజాలానికి ఆద్యులని, నేతాజీ ములాయం అందరికీ ప్రోత్సహ‌కుడిగా (సంర‌క్ష‌కుడు) ఉంటార‌ని సింగ్ అన్నారు. "ఇంతకుముందు నియంతృత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించిన సమాజ్ వాదీలు, రాబోయే రోజుల్లో సోషలిస్టులు విప్లవ వీరులు అవుతారు" అని సింగ్ అన్నారు.

అఖిలేష్, ములాయంతో పాటు కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ, సీపీఐ-ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఐఎన్‌ఎల్‌డీ అధినేత ఓపీ చౌతాలా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌లను కూడా నితీశ్ కలిశారు. తాను థర్డ్ ఫ్రంట్ కోసం ప్ర‌య‌త్నించ‌డం లేద‌ని మెయిన్ ఫ్రంట్‌ కోస‌మే ప‌ని చేస్తున్నాన‌ని నితీశ్ ఇప్ప‌టికే చెప్పారు. తాను ప్ర‌ధాని రేసులో లేన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు అలాంటి ఆలోచ‌న‌లు లేవ‌ని, ముందు ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నింటినీ ఏకం చేసి క‌లిసి ప‌నిచేసేలా చేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని అన్నారు.

First Published:  11 Sep 2022 6:04 AM GMT
Next Story