Telugu Global
National

అదే నిజమైతే దేశంలో హిందువులెవరూ మిగిలి ఉండేవారు కాదు: కర్ణాటక మాజీ జ‌డ్జి వ్యాఖ్య‌లు

ముస్లింలు ఇది చేసారని, అది చేశారని ఆరోపించే వారు.. భారతదేశంలో 700 సంవత్సరాల ముస్లిం పాలన చరిత్ర ఏమి చెబుతుందో తెలుసుకోవాలి అని రిటైర్డ్ జిల్లా జడ్జి వసంత ములసావలగి అన్నారు. అక్బర్ భార్య హిందువుగానే ఉండిపోయింది. ఆమె ఇస్లాం మతంలోకి మారలేదు. అక్బర్ తన ప్రాంగణంలో కృష్ణుని ఆలయాన్ని నిర్మించాడు. ప్రజలు దీనిని ఇప్పుడు కూడా చూడవచ్చు అన్నారాయన‌

అదే నిజమైతే దేశంలో హిందువులెవరూ మిగిలి ఉండేవారు కాదు: కర్ణాటక మాజీ జ‌డ్జి వ్యాఖ్య‌లు
X

హిందువులనుముస్లింలు వ్యతిరేకించినట్టైతే మొఘల్ పాలనలో హిందువులు ఒక్కరైనా మిగిలేవారా అని రిటైర్డ్ జిల్లా జడ్జి వసంత ములసావలగి వ్యాఖ్య‌లు చేశారు. "మొఘల్ పాలనలో ముస్లింలు హిందువులను వ్యతిరేకించి ఉంటే భారతదేశంలో ఒక్క హిందువు కూడా మిగిలి ఉండేవాడు కాదు.. వారు హిందువులందరినీ చంపి ఉండవచ్చు. వారు వందల సంవత్సరాలు పాలించినప్పటికీ, ముస్లింలు ఎందుకు మైనారిటీలుగా మిగిలిపోయారు?" అని ములసావలగి ప్ర‌శ్నించారు.

రాష్ట్రీయ సౌహార్ద వేదిక తదితర సంస్థల ఆధ్వర్యంలో విజయపుర నగరంలో గురువారంనాడు 'రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరాయా?' అనే అంశంపై జ‌రిగిన స‌ద‌స్సులో రిటైర్డ్ జడ్జి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న వ్యాఖ్య‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ప‌రోక్షంగా మ‌తోన్మాదుల‌ను ఉద్దేశించే చేశార‌నే వాదనలు వినిపిస్తున్నాయి.

"ముస్లింలు ఇది చేసారని, అది చేశారని ఆరోపించే వారు.. భారతదేశంలో 700 సంవత్సరాల ముస్లిం పాలన చరిత్ర ఏమి చెబుతుందో తెలుసుకోవాలి" అని ఆయన అన్నారు. "మొఘల్ రాజు అక్బర్ భార్య హిందువుగానే ఉండిపోయింది. ఆమె ఇస్లాం మతంలోకి మారలేదు. అక్బర్ తన ప్రాంగణంలో కృష్ణుని ఆలయాన్ని నిర్మించాడు. ప్రజలు దీనిని ఇప్పుడు కూడా చూడవచ్చు" అని ఆయ‌న‌ చెప్పాడు. "హిందూ దేవుళ్లంటున్న రాముడు, శ్రీకృష్ణుడు కేవలం నవలలోని పాత్రలు మాత్రమే. వారు చారిత్రక వ్యక్తులు కాదు. అశోక చక్రవర్తి నిజమైన చారిత్రక వ్యక్తి " అని మాజీ జ‌డ్జి అన్నారు.

ఆల‌యాల‌ను మ‌సీదులుగా మార్చారంటూ వ‌స్తున్న వాద‌న‌ల‌పై స్పందిస్తూ.. ''ఆల‌యాలు నిర్మించ‌క‌ముందే అశోక చ‌క్ర‌వ‌ర్తి 84వేల‌ బౌద్ధ విహారాలను నిర్మించాడు. మ‌రి అన్నీ ఎక్క‌డికి పోయాయి. ఇవ‌న్నీ కాలక్రమంలో జరిగిపోతుంటాయి. దీన్ని పెద్ద సమస్యగా మారుస్తారా ?'' అని ఉత్త‌రాఖండ్ లో శివ‌లింగ‌పై బుద్ధుని బొమ్మ‌లు ఉన్నాయంటూ బౌద్ధావ‌లంబీకులు కోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను ఉటంకిస్తూ వసంత ములసావలగి ప్రశ్నించారు.

"రాజ్యాంగం లక్ష్యాలు స్పష్టంగా, ఖచ్చితమైనవిగా ఉన్నాయి . రాజ్యాంగం లక్ష్యాలను నెరవేర్చడంలో వ్యవస్థ విఫలమవుతుందనే అనుమానాలు ఏర్పడుతున్నాయి. దీనిని అడ్డుకోవ‌డానికి యువ తరం ఈ దిశగా అప్రమత్తంగా ఉంటూ చురుకుగా వ్య‌వ‌హ‌రించాలి ." అని ఆయన అన్నారు. "మనం సమకాలీన స‌మాజం గురించి ఆలోచించాలి. వెనక్కి వెళ్ళకూడదు. మన స్వరాన్ని న్యాయబ‌ద్దంగా పెంచాలి." అని ములసావలగి అన్నారు.

First Published:  2 Dec 2022 3:10 PM GMT
Next Story