Telugu Global
National

భారత్ లోని సంపన్నులపై ఒక్క సారి 2% పన్ను వేస్తే... మూడేళ్లపాటు చిన్నారుల ఆకలి తీర్చొచ్చు!

2022లో భారతదేశంలోని 100 మంది అత్యంత సంపన్నుల సంపద రూ. 54.12 లక్షల కోట్లకు చేరుకుందని ఆక్స్‌ఫామ్ నివేదిక “సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్: ది ఇండియా సప్లిమెంట్” పేర్కొంది. 2022లో 10 మంది సంపన్న భారతీయుల మొత్తం సంపద రూ. 27.52 లక్షల కోట్లుగా ఉంది, 2021తో పోలిస్తే ఇది 32.8% పెరిగింది.

భారత్ లోని సంపన్నులపై ఒక్క సారి 2% పన్ను వేస్తే... మూడేళ్లపాటు చిన్నారుల ఆకలి తీర్చొచ్చు!
X

2021లో దేశంలోని మొత్తం సంపదలో 40.5% కంటే ఎక్కువ సంపదను 1% సంపన్నులు కలిగి ఉన్నారు. అయితే దిగువన ఉన్న 50% జనాభాకు కేవలం 3% స‍ంపద మాత్రమే ఉందని ఆక్స్‌ఫామ్ ఇండియా సోమవారం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. దావోస్ కేంద్రంగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సులో ఈ నివేదికను ఆక్స్‌ఫామ్ విడుదల చేసింది.

2022లో భారతదేశంలోని 100 మంది అత్యంత సంపన్నుల సంపద రూ. 54.12 లక్షల కోట్లకు చేరుకుందని ఆక్స్‌ఫామ్ నివేదిక “సర్వైవల్ ఆఫ్ ది రిచెస్ట్: ది ఇండియా సప్లిమెంట్” పేర్కొంది. 2022లో 10 మంది సంపన్న భారతీయుల మొత్తం సంపద రూ. 27.52 లక్షల కోట్లుగా ఉంది, 2021తో పోలిస్తే ఇది 32.8% పెరిగింది.

భారతదేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య కూడా 2020లో 102 ఉండగా, 2021లో 142కి , 2022లో 166కి పెరిగింది. మరో వైపు భారతదేశంలో 22.89 కోట్ల మంది ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు. ఇంత మంది పేదరికంలో ఉండటం ప్రపంచంలోనే అత్యధికమని నివేదిక పేర్కొంది.

ప్రగతిశీల పన్ను విధానంలో, సంపద‌ పెరిగే కొద్దీ పన్ను రేటు పెరుగుతుంది. భారతదేశంలో ఆదాయపు పన్ను రేట్లు ఆదాయంపై ఆధారపడి ఉండగా, పరోక్ష పన్నులు వారి సంపాదనతో సంబంధం లేకుండా అందరికీ ఒకే విధంగా ఉంటాయని ఆక్స్‌ఫామ్ ఇండియా సూచించింది.

"ప్రభుత్వాలు వ్యాట్ [విలువ ఆధారిత పన్ను] వంటి వినియోగ పన్నులపై అధికంగా ఆధారపడటం వల్ల అసమానతలు పెరుగుతాయి.పేద ప్రజలు వారి ఆదాయంలో ఎక్కువ వాటాను ఇలాంటి పన్నులకే చెల్లిస్తారు కాబట్టి అసమానతలు పెరిగిపోతాయిది" అని ఆక్స్‌ఫామ్ ఇండియా సంస్థ పేర్కొంది.

దేశంలోని జనాభాలో దిగువన ఉన్న 50% మంది టాప్ 10%తో పోలిస్తే ఆదాయంలో ఆరు రెట్లు ఎక్కువ పరోక్ష పన్నులు చెల్లిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఆహారం, ఆహారేతర వస్తువుల నుండి వసూలు చేసిన మొత్తం పన్నులలో 64.3% పన్నులు జనాభాలో దిగువన ఉన్న 50% ప్రజలు భరిస్తున్నారు.


ఆక్స్‌ఫామ్ ఇండియా, ప్రభుత్వం ఆదాయాన్ని సంపాదించడానికి సంపద పన్ను విధించాలని సిఫార్సు చేసింది. ఇది దేశ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యక్తి గౌతమ్ అదానీపై 2017–2021 వరకు వచ్చిన‌ లాభాలపై పన్ను వేస్తే, ఈ సొమ్ముతో 50 లక్షల కంటే ఎక్కువ మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు ఒక సంవత్సరానికి జీతాలు ఇవ్వ వచ్చని పేర్కొంది.

నిత్యావసర వస్తువులపై వస్తు, సేవల పన్ను రేట్లను తగ్గించాలని, లగ్జరీ వస్తువులపై పెంచాలని ఆక్స్‌ఫామ్ పిలుపునిచ్చింది. ఆక్స్‌ఫామ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమితాబ్ బెహర్ ఈ డేటాపై వ్యాఖ్యానిస్తూ, ధనికులు తమ న్యాయమైన పన్నుల వాటాను చెల్లించేలా చూసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

"అత్యంత ధనవంతుల మనుగడకు మాత్రమే భరోసా ఇచ్చే ఈ వ్యవస్థలో దేశంలోని అట్టడుగున ఉన్న దళితులు, ఆదివాసీలు, ముస్లింలు, మహిళలు, అనధికారిక రంగ కార్మికుల కష్టాలు కొనసాగుతున్నాయి" అని ఆయన అన్నారు.

సంపద పన్ను వంటి "ప్రగతిశీల పన్ను చర్యలను" అమలు చేయాలని ఆయన ఆర్థిక మంత్రిని కోరారు.

అసమానతల‌ను సమర్థవంతమైన పద్ధతిలో పరిష్కరించడానికి వారసత్వ పన్ను కూడా విధించాలని ఆయన సూచించారు.

ఆక్స్‌ఫామ్ ఇండియా తన నివేదికలో పేర్కొన్న మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు:

- దేశంలోని సంపన్నుల మొత్తం ఆస్తులపై ఒక్కసారి 2 శాతం పన్నుల రూపంలో వసూలు చేస్తే వచ్చే రూ. 40,423 కోట్లతో దేశంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు మూడేళ్ల పాటు భోజనం పెట్టొచ్చు

- భారత్ లోని సంపన్నులపై ఒక్కసారి 5 శాతం పన్ను వసూలు చేస్తే వచ్చే మొత్తంతో దేశంలోని పిల్లలందరికీ చదువు చెప్పించవచ్చు

- భారత్ లోని పది మంది బిలియనీర్లపై 5 శాతం పన్ను (ఒక్కసారి) వేస్తే వచ్చే మొత్తం రూ. 1.37 లక్షల కోట్లు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ (రూ.86,200 కోట్లు), ఆయుష్ మంత్రిత్వ శాఖ (రూ.3,050 కోట్లు) ల బడ్జెట్ కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ.

- 2017-2022 మధ్య కాలంలో గౌతమ్ అదానీ సంపాదన మీద పన్ను వేస్తే వచ్చే సొమ్ముతో దేశంలోని 50 లక్షల మంది ప్రైమరీ స్కూలు టీచర్లకు ఏడాది పాటు జీతాలు చెల్లించవచ్చు

- కరోనా కష్టకాలంలో దేశంలోని సంపన్నుల ఆస్తులు 121 శాతం పెరిగింది. ఈ కాలంలో సంపన్నులు రోజుకు రూ.3,608 కోట్లు సంపాదించారు.

- సమాజంలోని మిగతా వర్గాలు సంపాదించే మొత్తంలో 55 శాతం మాత్రమే రైతులు ఆర్జిస్తున్నారు.

- దేశంలోని స్త్రీ, పురుషుల సంపాదనలో తేడా చాలా ఎక్కువగా ఉంది. పురుషుల సంపాదనతో పోలిస్తే స్త్రీల సంపాదన రూపాయిలో కేవలం 63 పైసలు మాత్రమే.

- 2021-22 ఏడాదికి జీఎస్టీ రూపంలో వసూలైన మొత్తం రూ.14.83 కోట్లు కాగా అందులో 64 శాతం దేశంలోని అట్టడుగు వర్గాలే చెల్లించారు. దేశంలోని టాప్ 10 ధనవంతుల నుంచి వసూలైన జీఎస్టీ కేవలం 3 శాతం మాత్రమే!

First Published:  16 Jan 2023 7:42 AM GMT
Next Story