Telugu Global
National

బీజేపీ సిద్దాంతాలనే దేశ సిద్దాంతాలుగా పరిగణించాలట!

బీజేపీ తన ఎజెండాకు అనుగుణంగా చట్టాలు మార్చే పనిలో పడింది. యూనిఫాం సివిల్ కోడ్ ను తీసుకరావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ సిద్దాంతాలే ఈ దేశ సిద్దాంతాలని ఏకంగా పార్లమెంటులోనే ప్రకటించింది.

బీజేపీ సిద్దాంతాలనే దేశ సిద్దాంతాలుగా పరిగణించాలట!
X

BJP సిద్దాంతాలనే దేశసిద్దాంతాలుగా పరిగణించాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు తేల్చేశారు. లోక్ సభలో కుటుంబ న్యాయస్థానాల (సవరణ) బిల్లు 2022 పై చర్చ సందర్భంగా ఆయన ఈ మాటలన్నారు. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ప్రకటించాలనే బిజెపి డిమాండ్‌కు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తోందని అన్నారాయన‌.

ఈ చర్చలో పాల్గొన్న బిజెపికి చెందిన ఎంపి నిషికాంత్ దూబే మాట్లాడుతూ... స్వలింగ వివాహాలు, లివ్-ఇన్ రిలేషన్స్ 'సామాజిక దుర్మార్గం' అన్నారు. అటువంటి "సామాజిక దురాచారాలు" ఇప్పుడు దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అవసరాన్ని మరింత పెంచాయన్నారు. దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ ఉండాలని భారత రాజ్యాంగ నిర్మాతలు సూచించారని, గోవా లాంటి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే UCC అమలులో ఉందని ఉత్తరాఖండ్,ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు UCCని అమలుపరచడానికి ప్రయత్నిస్తున్నాయని, "స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా యూనిఫాం సివిల్ కోడ్ ను తీసుకువచ్చే సమయం రాలేదా అని ఆయన ప్రశ్నించారు. తండ్రి, కొడుకు, భార్య,భర్తల‌ మధ్య సంబంధాలను నిర్వచించడానికి యూనిఫాం సివిల్ కోడ్ అవసరమని నిషికాంత్ దూబే అభిప్రాయపడ్డారు.

దీనికి జవాబిచ్చిన న్యాయశాఖా మంత్రి రిజిజు... "ప్రభుత్వ సిద్ధాంతం ఏమిటో మీకు తెలుసు. మా పార్టీ సిద్ధాంతాలను దేశ సిద్ధాంతంగా పరిగణించాలని మేము కోరుకుంటున్నాము.'' అని ప్రకటించారు

న్యాయ మంత్రి చేసిన ఈ ప్రకటన లోక్‌సభలో గందరగోళానికి దారితీసింది, ఆ ప్రకటన పట్ల విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. దాంతో రిజూ మళ్ళీ మాట్లాడుతూ 'ఈ మాటలన్నందుకు నేను గర్విస్తున్నాను' అన్నారు

మొత్తానికి బీజేపీ మెల్లె మెల్లెగా తన అసలైన ఎజెండాని బైటికి తీస్తూ అందుకు కావాల్సిన చట్టాలు చేయడం, దేశంలో అందుకు తగ్గ వాతావరణం సృష్టించడం మొదలుపెట్టింది.

First Published:  28 July 2022 3:51 AM GMT
Next Story