Telugu Global
National

'యూపీఏ' ఇకపై 'ఇండియా'.. దీని అర్థం ఏంటో తెలుసా?

ఇండియా అనే పేరుకు కూటమిలోని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో.. దాన్ని అధికారికంగా ప్రకటించారు.

యూపీఏ ఇకపై ఇండియా.. దీని అర్థం ఏంటో తెలుసా?
X

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొన్ని పార్టీలు కలిసి తొలి సారి 2004లో యునైటెడ్ ప్రోగ్రెసీవ్ అలయన్స్ (యూపీఏ) పేరుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2009లో కూడా యూపీఏ-2 అధికారం చేపట్టింది. 2014లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతినడం.. యూపీఏలోని అనేక పార్టీలు ఎవరి దారి వాళ్లు చూసుకోవడంతో ఆ కూటమి మనునగడ కష్టంగా మారింది. మరో వైపు ఎన్డీయే (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) పేరుతో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 2019లో కూడా ఎన్డీయే పేరుతోనే ఎన్నికలకు వెళ్లారు. కానీ, బీజేపీకి సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం వచ్చింది. అయినా సరే.. ఎన్డీయే పేరుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

గత కొంత కాలంగా యూపీఏ, బీజేపీ కూటమిలో అనేక మార్పులు వచ్చాయి. ఎన్డీయే కూటమితో పొసగని కొన్ని పార్టీలు యూపీఏ వైపు మొగ్గు చూపాయి. అదే సమయంలో తమ సొంత లాభం కోసం ఎన్డీయేలో చేరిన పార్టీలు కూడా ఉన్నాయి. మరో ఏడాదిలోపు సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో దేశంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా బెంగళూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు విపక్షాల సమావేశం నిర్వహించారు. ఇప్పటికే పట్నాలో ఒక సమావేశం నిర్వహించి.. భవిష్యత్ కార్యచరణపై ఒక తాటిపైకి వచ్చారు. తాజాగా బెంగళూరులో ముగిసిన రెండు రోజుల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

యూపీఏ 1, 2 హయాంలో ఉన్న కొన్ని పార్టీలు ఇప్పుడు ఆ కూటమిలో లేవు. అదే సమయంలో అప్పట్లో ఎన్డీయేలో ఉన్న శివసేన, జేడీయూ వంటి పార్టీలు యూపీఏ వైపు మొగ్గు చూపాయి. దీంతో యూపీఏను పూర్తిగా రద్దు చేసి.. కూటమికి కొత్త పేరు పెట్టాలని బెంగళూరులో జరుగుతున్న సమావేశంలో నిర్ణయించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ పేరుతో కాకుండా ఇండియా పేరుతో కూటమి పోటీ చేయనున్నది. I N D I A .. అంటే ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇంక్లూసీవ్ అలయన్స్ అని అర్థం.

ఎన్డీయేకు పోటీగా ఇండియా కూటమి పోటీకి దిగబోతోందనే అర్థంలో కూడా ఈ పేరును వాడుకోనున్నారు. అంతే కాకుండా.. ప్రజల్లోకి ఇండియా అనే సెంటిమెంట్‌ను బలంగా తీసుకొని వెళ్లడానికి కూడా ఈ పేరు ఉపయోగపడుతుందని సమావేశంలో చర్చించారు. కొత్త కూటమిలో ఏ పార్టీ ఆధిపత్యం ఉండబోదని.. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు.

బెంగళూరులో జరుగుతున్న సమావేశం ముగిసిన తర్వాత ఇం-డి-యా అనే పేరును ప్రకటించారు. ఎన్డీయే పాలనకు చరమగీతం పాడేది ఇండియా కూటమే అని, దేశ అభివృద్ధికే తమ తొలి ప్రాధాన్యత అనే విషయాన్ని ప్రతిపక్షాలు కొత్త పేరుతో ప్రజలకు స్పష్టంగా తెలియజేయనున్నాయి. ఇండియా అనే పేరుకు కూటమిలోని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలపడంతో.. అధికారికంగా ప్రకటించారు. ఇకపై ఇండియాకు ఎన్డీయేకు మధ్య యుద్దం మొదలైందని ప్రతిపక్ష కూటమి తెలియజేసింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ పేరు వైరల్ అవడం గమనార్హం.

First Published:  18 July 2023 9:58 AM GMT
Next Story