Telugu Global
National

సీఎం పదవి తప్ప ఏమీ వద్దు.. స్పష్టం చేసిన శివకుమార్.. భారమంతా ఖర్గే పైనే

కర్ణాటక సీఎం పదవికి సంబంధించిన సంక్షోభంపై తుది నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గేనే తీసుకోవాలని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది.

సీఎం పదవి తప్ప ఏమీ వద్దు.. స్పష్టం చేసిన శివకుమార్.. భారమంతా ఖర్గే పైనే
X

కర్ణాటక సీఎం ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సంప్రదింపులు, చర్చలు జరుపుతూనే ఉన్నది. 48 గంటలుగా కర్ణాటక సీఎం ఎంపికకు సంబంధించి ఉత్కంఠ నెలకొన్నది. ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఇంటిలో పలు దఫాలుగా ఏఐసీసీ పర్యవేక్షకులు, ముఖ్యమంత్రి ఆశావహులు డీకే శివకుమార్, సిద్ధరామయ్యతో చర్చలు జరిపారు. మంగళవారం ఢిల్లీ చేరుకున్న శివకుమార్ నేరుగా ఖర్గే ఇంటికి వెళ్లారు. ఇద్దరి మధ్య ఏకాంతంగా చర్చలు జరిగాయి.

కర్ణాటక ప్రభుత్వంలోని కీలక పోర్ట్‌ఫోలియోతో పాటు కేపీసీసీ చీఫ్ పదవిని కొనసాగిస్తామని శివకుమార్‌కు మల్లిఖార్జున్ ఖర్గే ఆఫర్ చేసినట్లు తెలుస్తున్నది. అయితే, తనకు సీఎం పదవి కంటే తక్కువైనది ఏదీ అవసరం లేదని శివ్ కుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం. తాను కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కష్టపడ్డానని.. గెలిచిన ఏ ఎమ్మెల్యేను అడిగినా ఆ విషయం చెబుతారని శివకుమార్ కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిదని.. పార్టీని మాత్రం వీడను.. అదే సమయంలో తనకు సీఎం పదవి కంటే తక్కువది ఏది ఇచ్చినా తీసుకోను అని శివకుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం.

శివకుమార్ వెళ్లిపోయిన తర్వాత సిద్ధ రామయ్య మరో సారి మల్లిఖార్జున్ ఖర్గే ఇంటికి వచ్చారు. ఇద్దరి మధ్య మరో సారి చర్చ జరిగింది. మెజార్టీ ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్ చేస్తున్నారని సిద్ధరామయ్య స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. తనకే సీఎం పదవి ఇవ్వాలని ఆయన కోరారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే తాను సోనియా, రాహుల్‌లను సంప్రదించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటానని ఖర్గే చెప్పినట్లు సమాచారం.

మీరే నిర్ణయించండి : ఖర్గేకు స్పష్టం చేసిన రాహుల్ గాంధీ

కర్ణాటక సీఎం పదవికి సంబంధించిన సంక్షోభంపై తుది నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గేనే తీసుకోవాలని రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. శివకుమార్, సిద్ధరామయ్య, ఏఐసీసీ పర్యవేక్షకులతో రోజంతా సంప్రదింపులు జరిపిన తర్వాత రాహుల్ గాంధీకి ఖర్గే కాల్ చేశారు. కర్ణాటక సీఎం పదవిపై అందరి వాదనలు ఆయనకు వివరించినట్లు తెలుస్తున్నది. అయితే రాష్ట్ర పరిస్థితులు తెలిసిన వారిగా, కాంగ్రెస్ అధ్యక్షుడిగా తుది నిర్ణయం మీరే తీసుకోవాలని ఖర్గేకు రాహుల్ గాంధీ స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కర్ణాటక సీఎం అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఈ రోజు రాత్రి లేదా రేపు ప్రకటించే అవకాశం ఉన్నది. మల్లిఖార్జున్ ఖర్గేనే స్వయంగా బెంగళూరు వెళ్లి రేపు ప్రకటించే అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సీఎం విషయంలో ఒక తుది నిర్ణయానికి వచ్చారని.. పార్టీ అధిష్టానం దీనిపై ప్రకటన చేస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

First Published:  16 May 2023 2:27 PM GMT
Next Story