Telugu Global
National

పంత్‌ను రక్షించిన బస్ డ్రైవర్‌కు.. అతడు ఎవరో తెలియదంటా!

తాను ఒక క్రికెటర్‌ని అని అమ్మకు ఫోన్ చేయమని పంత్ చెప్పాడని.. అయితే వాళ్ల అమ్మ నెంబర్ స్విచ్ఛాఫ్ వచ్చిందని డ్రైవర్ అన్నాడు.

పంత్‌ను రక్షించిన బస్ డ్రైవర్‌కు.. అతడు ఎవరో తెలియదంటా!
X

టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ శివారులో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. పంత్ స్వయంగా నడుపుకుంటూ వెళ్తున్న కారు.. డివైడర్‌కు ఢీకొనడంతో నుజ్జునుజ్జు అయ్యింది. ఆ కారు పరిస్థితి చూసిన వాళ్లు అందులో ఉన్న వాళ్లు బతికి ఉండే అవకాశమే ఉండదని భావిస్తారు. అంత భయంకరంగా మారిపోయింది. అయితే పంత్ నడిపిన మెర్సిడెజ్ బెంజ్ కారు అత్యంత సెక్యూరిటీ ఫీచర్స్ కలిగి ఉండటంతో స్వల్ప గాయాలతోనే బయటపడ్డాడు.

రిషబ్ పంత్ కారు వేగంగా వచ్చి డివైడర్లను ఢీకొట్టినప్పుడు ఓ బస్ డ్రైవర్ ప్రత్యక్షంగా చూశాడు. జాతీయ రహదారిపై తనకు ఎదురుగా మరోలైన్‌లో వేగంగా వచ్చి డివైడర్లను ఢీకొట్టి.. పల్టీలు కొడుతుండగా.. బస్సు కిందకు వస్తుందేమో అనే అనుమానంతో డ్రైవర్ సుశీల్ మాన్ పక్కకు వెళ్లాడు. తర్వాత బస్సు దిగి కారు వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే అందులోని వ్యక్తి సగం బయటకు వచ్చి ఉండటాన్ని గమనించానని చెప్పుకొచ్చాడు. తాను ఒక క్రికెటర్‌ని అని అమ్మకు ఫోన్ చేయమని పంత్ చెప్పాడని.. అయితే వాళ్ల అమ్మ నెంబర్ స్విచ్ఛాఫ్ వచ్చిందని డ్రైవర్ అన్నాడు.

ఆ తర్వాత బస్సులో నుంచి కొందరు దిగి కారు దగ్గరకు వచ్చి గాయపడిన వ్యక్తి రిషబ్ పంత్ అని చెప్పినట్లు డ్రైవర్ పేర్కొన్నాడు. వారితో కలిసి పంత్‌ను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపాడు. సుశీల్ మాన్ హర్యానా రోడ్ వేస్‌లో బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. క్రికెట్ చూడటం అతడికి అలవాటు లేదు. ప్రతీ రోజు ఆ రూట్లోనే బస్సు నడుపుతుంటాడు. పొగమంచు కూడా ప్రమాదానికి కారణం కావొచ్చని అతడు పేర్కొన్నాడు.

పంత్ గాయాలతో చాలా బాధపడ్డాడని, తీవ్రంగా అరుస్తూ సాయం చేయమని అడిగాడని చెప్పాడు. పంత్‌ను తీసిన తర్వాత కారులో ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చూశాను కానీ.. ఎవరూ కనపడలేదని సుశీల్ మాన్ చెప్పాడు. అయితే రిషబ్ పంత్‌కు సంబంధించిన నీలం రంగు బ్యాగ్ కనపడితే.. అంబులెన్సులో పెట్టానని చెప్పుకొచ్చాడు. ఇటీవల హైదరాబాద్‌లో సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం జరిగినప్పుడు కూడా.. అతడు ఎవరో తెలియకుండానే ఓ వ్యక్తి రక్షించి ఆసుపత్రిలో చేర్పించాడు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలిస్తే బాధితుల ప్రాణాలకు ముప్పు ఉండదని ఇలాంటి సంఘటనలే రుజువు చేస్తాయి.

First Published:  30 Dec 2022 2:21 PM GMT
Next Story