Telugu Global
National

ఎమ్మెల్యేకే దిక్కులేదు.... ఈ దేశంలో మహిళల దుస్థితి ఏంటో తెలియజేస్తున్న ఘటన‌

పంజాబ్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా ఎమ్మెల్యేపై ఆమె భర్త దాడి చేసి కొట్టాడు. ఆమె ఇంట్లోనే జరిగి ఈ సంఘటనపై మహిళా కమిషన్ స్పందించి దర్యాప్తు చేస్తోంది.

ఎమ్మెల్యేకే దిక్కులేదు.... ఈ దేశంలో మహిళల దుస్థితి ఏంటో తెలియజేస్తున్న ఘటన‌
X

ఈ దేశంలో మహిళలపై హింస, అణిచివేత, అత్యాచారాలు...ఇలా అనేక రకాల నేరాలు తరతరాలుగా సాగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళైనా, మహిళలకు సమాన హక్కులుంటాయని రాజ్యాంగంలో రాసుకున్నా ఆచరణలో మాత్రం సాధించింది శూన్యం. ఇంటి బైట హింసే కాదు గృహ హింస కూడా మహిళలపై అన్యాయమైన రీతిలో సాగుతోంది. ఓ మహిళా ఎమ్మెల్యేకు సైతం ఇందులో మినహాయింపులు లేవంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. పంజాబ్ లో ఓ మహిళా ఎమ్మెల్యేను ఆమె భర్త కొట్టిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీనిపై పంజాబ్ మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.

బైటికి వచ్చిన వీడియో ప్రకారం... పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ మహిళ్శా ఎమ్మెల్యే బల్జిందర్ కౌర్ తన ఇంటి వద్ద కొంత మంది వ్యక్తులతో తీవ్ర వాగ్వివాదం చేస్తున్నది. ఈ సమయంలో కూర్చొని ఉన్న ఆమె భర్త కూడా ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఇంతలో కొందరు వ్యక్తులు అతన్ని పక్కకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే అతని దగ్గరికి వెళ్ళి ఏదో అంటుండగా సడెన్ గా లేచిన అతను ఎమ్మెల్యేను చెంప‌పై గట్టిగా కొట్టాడు. ఆమె ఏడుస్తూ పక్కకు వెళ్ళిపోగా అతన్ని కొందరు అక్కడి నుండి తీసుకెళ్ళిపోయారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పంజాబ్ మహిళా కమిషన్ స్పందించింది. "నేను సోషల్ మీడియాలో బల్జిందర్ కౌర్ వీడియోను చూశాను. ఘటనపై సుమోటోగా చర్యలు తీసుకుంటాం. ప్రజా సమస్యలను లేవనెత్తే మహిళ ఇంట్లో వేధింపులకు గురికావ‌డం బాధాకరం.'' అని మహిళా కమిషన్ చైర్ పర్సన్ మనీషా గులాటీ అన్నారు.

కాగా NCRB యొక్క తాజా నివేదిక ప్రకారం, పంజాబ్‌లో మహిళలపై నేరాలు 17 శాతం పెరిగాయి -- 2020లో 4,838 కేసులు నమోదు కాగా 2021లో 5,662 కేసులకు చేరుకున్నాయి. ఇందులో గృహ హింస కేసులు కూడా ఉన్నాయి.

First Published:  2 Sep 2022 5:57 AM GMT
Next Story