Telugu Global
National

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లలో హంగ్ .... 'పీపుల్స్ పల్స్' ఎగ్జిట్ పోల్స్ వెల్లడి

మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను 'పీపుల్స్ పల్స్' సంస్థ ఈ రోజు విడుదల చేసింది. ఆ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఒక్క సారి పరిశీలిద్దాం....

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ లలో హంగ్ .... పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడి
X

ఈశాన్య భారతంలో పాగా వేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, ఒకప్పుడు బలంగా ఉండి ప్రస్తుతం పూర్తిగా దిగజారిపోయిన కాంగ్రెస్, త్రిపురలో అనేక ఏళ్ళపాటు అధికారం చలాయించిన సీపీఎం, స్థానిక పార్టీలు అధికారం కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నాయి. త్రిపురలో ఒకప్పుడు బద్ద శత్రువులుగా ఉన్న కాంగ్రెస్, సీపీఎంలు ఈ సారి అధికార బీజేపీని ఎదుర్కోవడానికి చేతులు కలిపాయి. ఈ పరిస్థితుల్లో జరిగిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? ఎవరు ఎలాంటి ఫలితాలు సాధించబోతున్నారు ? అనే విషయాలపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'పీపుల్స్ పల్స్' సంస్థ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించింది. ఆ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆ మూడురాష్ట్రాల్లోనూ ఎవరికీ పూర్తి మెజార్టీ రావడంలేదని తేలింది. అక్కడ హంగ్ అసెంబ్లీలు ఏర్పడ బోతున్నాయి.

మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పీపుల్స్ పల్స్ సంస్థ ఈ రోజు విడుదల చేసింది. ఆ సంస్థ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఒక్క సారి పరిశీలిద్దాం....

త్రిపుర:

త్రిపురలో ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీకే అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్, సీపీఎం పార్టీలు కలిసి పోటీ చేసినప్పటికీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయాయి. అయితే బీజేపీ కూడా అధికారానికి కావాల్సిన 31 సీట్లు సాధించలేకపోత్తున్నది. ప్రభుత్వ ఏర్పాటులో స్థానిక రాజవంశం వారసుడు ప్రద్యోత్ విక్రమ్ మానిక్య దేబ్ వర్మ నాయకత్వంలో కొత్తగా ఏర్పడిన తిప్రా మోతా పార్టీ కీలక భూమిక పోషించనుంది.

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అధికార బీజేపీకి 18 నుంచి 26 సీట్లు,సీపీఐ(ఎం) ఇతర లెఫ్ట్ పార్టీలకు 14 నుంచి 22 సీట్లు, తిప్రా మోతా పార్టీకి 11 నుంచి 16 సీట్లు,కాంగ్రెస్ పార్టీకి 1 నుంచి 3 సీట్లు, ఇండీజినస్ పీపుల్స్ ఫ్రంట్ కు ఒక సీటు ఇతరులకు ఒకటి నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని బట్టి తిప్రా మోతా పార్టీ ఎవరికి మద్దతు పలికితే వాళ్ళు అధికారంలోకి వస్తారు. అయితే బీజేపీ కి వ్యతిరేకంగా తాను మాత్రమే పోరాడుతున్నానని, బీజేపీని ఓడించే సత్తా తనకే ఉందని చెప్తూ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై నిప్పులు చెరిగిన మానిక్య దేబ్ వర్మ బీజేపీతో చేతులు కలుపుతారా ? లేక సీపీఎం, కాంగ్రెస్ కూటమికి మద్దతు పలుకుతారా అన్నది తేలాల్సి ఉన్నది.

.

మేఘాలయ:

ఈ రాష్ట్రంలో కూడా ఎవ్వరికీ మెజార్టీ రాని పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ కూడా కోన్రాడ్ సంగ్మ నాయక‌త్వంలోని అధికార నేషనల్ పీపుల్స్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది.

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం... ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 31 సీట్లు రావాల్సి ఉండగా నేషనల్ పీపుల్స్ పార్టీ 17 నుంచి 26 సీట్లు, తృణమూల్ కాంగ్రెస్ 10 నుంచి 14 సీట్లు, యునైటెడ్ డెమాక్రటిక్ పార్టీ 8 నుంచి 12 సీట్లు, బీజేపీ 3 నుంచి 8 సీట్లు, కాంగ్రెస్ 3 నుంచి 5 సీట్లు, ఇతరులు 4 నుంచి 9 సీట్లు గెలిచే అవకాశం ఉంది.

ఎన్నికల ఫలితాల తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీకి ఏ పార్టీ మద్దతు తెలుపుతుంది, ఏయే పార్టీలు ఏయే పార్టీలతో చేతులు కలుపి అధికారంలోకి వస్తాయన్నది వేచి చూడాల్సిందే. అయితే గతంలోలాగానే నేషనల్ పీపుల్స్ పార్టీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా అనేది వేచి చూడాలి.

నాగాలాండ్:

ఈ రాష్ట్రంలో కూడా ఏపార్టీ మెజార్టీకి అవసరమైన 31 సీట్లు గెలిచే అవకాశం లేదు. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం... ప్రస్తుతం అధికారంలో ఉన్న నేషనలిస్ట్ డెమాక్రటిక్ ప్రోగ్రెస్సీవ్ పార్టీ 20 నుంచి 27 సీట్లు, బీజేపీ 14 నుంచి 21 సీట్లు, లోక్ జనశక్తి పార్టీ 5 నుంచి 10 సీట్లు, నాగా పీపుల్స్ ఫ్రంట్ 3 నుంచి 8 సీట్లు, కాంగ్రెస్ 2 నుంచి 4 సీట్లు, ఇతరులు 2 నుంచి 4 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.

అయితే ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న నేషనలిస్ట్ డెమాక్రటిక్ ప్రోగ్రెస్సీవ్ పార్టీ, బీజేపీల కూటమి మళ్ళీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తున్నది.

First Published:  27 Feb 2023 6:01 PM GMT
Next Story