Telugu Global
National

బెంగళూరులో హోటల్ గదులకు గిరాకీ.. రోజుకు రూ.40వేలు అద్దె

కర్నాటకలో భారీ వరదల కారణంగా హోటల్ గదులకు భారీ గిరాకీ ఏర్పడింది. బెంగళూరులో కొన్ని హోటళ్లలో రోజుకు 40 వేల రూపాయల వరకు అద్దె వసూలు చేస్తున్నారు.

బెంగళూరులో హోటల్ గదులకు గిరాకీ.. రోజుకు రూ.40వేలు అద్దె
X

కర్నాటకలో భారీ వర్షాల కారణంగా బెంగళూరు పరిసర ప్రాంతాలన్నీ నీటమునిగాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. బెంగళూరులోని కాస్ట్ లీ ఏరియాలన్నీ దాదాపుగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అపార్ట్ మెంట్లకు నీటి సరఫరా ఆగిపోయింది, కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో కోట్ల రూపాయల విలువ చేసే అపార్ట్ మెంట్లు వదిలేసి చాలామంది పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. హోటల్ రూమ్స్ కి క్యూ కడుతున్నారు. మెరక ప్రాంతాల్లో ఉన్న హోటళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. గతంలో రూ.10వేల నుంచి 20వేల మధ్య ఉన్న హోటల్ రూమ్ రెంట్ లు ఇప్పుడు ఒక రోజుకి రూ.30 వేలు నుంచి 40వేల వరకు ప‌లుకుతున్నాయి.

వరదలకు దెబ్బతిన్న వైట్‌ ఫీల్డ్‌, అవుటర్‌ రింగ్‌ రోడ్డు, ఓల్డ్‌ ఎయిర్‌ పోర్టు రోడ్డు, కోరమంగళ తదితర ప్రాంతాల్లోని అనేక హోటళ్లు వరద బాధితులతో నిండిపోయాయి. పాత విమానాశ్రయం రోడ్డులోని లీలా ప్యాలెస్‌ లో ఒక గదికి 20వేలు వసూలు చేస్తున్నారు. తాజ్ బెంగళూరులో డీలక్స్ గదులన్నీ బుక్ అయిపోయాయి. ఓయో రూమ్స్ కి కూడా ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. రోజుల ప్రాతిపదికన అద్దె చెల్లించి వరద బాధితులు రూమ్స్ లో తలదాచుకుంటున్నారు.

కుటుంబాలన్నీ కట్టుబట్టలతోనే..

కాస్ట్ లీ అపార్ట్ మెంట్లలో ఉన్నవారు సైతం ప్రాణ భయంతో బయటకు వచ్చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వరదలు రావడంతో ఈసారి చాలా ప్రాంతాలు నీటమునిగాయి. కుటుంబ సభ్యులతో కలసి ఉద్యోగులు పెట్టేబేడా సర్దేసుకుని బతుకు జీవుడా అంటూ బయటపడుతున్నారు. ముఖ్యంగా ఐటీ హబ్ లోని కుటుంబాలు హోటళ్లకు మకాం మార్చాయి. ప్రభుత్వం పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినా.. అవి ఏమాత్రం సరిపోవడంలేదు. పైగా అందులో అన్ని సౌకర్యాలు ఉండవు కాబట్టి.. ఐటీ ఉద్యోగుల కుటుంబాలు హోటల్ గదులనే ఎంపిక చేసుకుంటున్నాయి.

First Published:  8 Sep 2022 3:14 PM GMT
Next Story