Telugu Global
National

పెళ్లికి ఎంత మందిని పిల‌వాలో, ఎన్ని ర‌కాలు వ‌డ్డించాలో.. పార్ల‌మెంటే చెప్పాలట‌!

వ‌చ్చిన అతిథుల్లో క‌నీసం ఎవ‌రూ క‌నీసం అందులో స‌గం వంట‌కాల‌నైనా రుచి చూడలేక‌పోయార‌ని ఆయ‌న లోక్‌స‌భ‌లో ఈ రోజు చెప్పారు. ఇదంతా ఆహార వృథా, డ‌బ్బుల వృథాయే క‌దా అన్నారు.

పెళ్లికి ఎంత మందిని పిల‌వాలో, ఎన్ని ర‌కాలు వ‌డ్డించాలో.. పార్ల‌మెంటే చెప్పాలట‌!
X

పెళ్లిళ్లు, ఇత‌ర శుభ‌కార్యాలకు ఎంత మందిని పిల‌వాలో, ఎన్ని ర‌కాల వంట‌కాలు వ‌డ్డించాలో ప‌రిమితి విధించాలంటూ కాంగ్రెస్ ఎంపీ జ‌స్బీర్ సింగ్ గిల్ ఈ రోజు లోక్‌స‌భ‌లో బిల్లు ప్ర‌వేశ‌పెట్టారు. ప్రివెన్ష‌న్ ఆఫ్ వేస్ట్ ఫుల్ ఎక్స్‌పెండిచ‌ర్ ఆన్ స్పెష‌ల్ అకేష‌న్స్ బిల్ 2020(The Prevention of Wasteful Expenditure on Special Occasions Bill 2020) ప్ర‌వేశ‌పెడుతూ.. పెళ్లిళ్లు, శుభకార్యాలు, వేడుక‌ల్లో వేల మంది అతిథుల‌ను పిల‌వ‌డం, వంద‌ల ర‌కాలు వ‌డ్డించ‌డం ఇటీవ‌ల కాలంలో ఫ్యాష‌న్ అయిపోయింద‌న్నారు. వెడ్డింగ్ కార్డులు మొద‌లుపెట్టి ఫంక్ష‌న్ల‌లో వంద‌ల ర‌కాలతో పెట్టే విందు భోజ‌నాల వ‌ర‌కు అన్నింట్లోనూ విప‌రీత‌మైన వృథా జ‌రుగుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రిట‌ర్న్ గిఫ్ట్‌ల పేరుతో వచ్చిన‌వారికి బ‌హుమ‌తులు ఇవ్వ‌డానికి ల‌క్ష‌లు త‌గ‌లేస్తున్నార‌ని చెప్పారు.

2019లో ప‌గ్వారాలో నేనో పెళ్లికి వెళితే 285 ర‌కాల వంట‌కాల‌తో విందు భోజ‌నం పెట్టార‌ని ఎంపీ జ‌స్బీర్ సింగ్ గుర్తు చేశారు. వ‌చ్చిన అతిథుల్లో క‌నీసం ఎవ‌రూ క‌నీసం అందులో స‌గం వంట‌కాల‌నైనా రుచి చూడలేక‌పోయార‌ని ఆయ‌న లోక్‌స‌భ‌లో ఈ రోజు చెప్పారు. ఇదంతా ఆహార వృథా, డ‌బ్బుల వృథాయే క‌దా అన్నారు.

పెళ్లిళ్లు, శుభ‌కార్యాలు, ఇత‌ర ఉత్స‌వాలు మ‌న‌కు మ‌ధురానుభూతులు. కానీ దాని కోసం ఇంత వృథా ఖ‌ర్చు అవ‌స‌ర‌మా అన్న‌ది ఎంపీ జ‌స్బీర్ సింగ్ ప్ర‌శ్న‌.పెళ్లికి వ‌ధూవ‌రులు ఇద్ద‌రి త‌ర‌ఫునా క‌లిసి 100 మందికి మించి అతిథుల‌ను పిల‌వ‌కూడ‌ద‌ని, 10 ర‌కాల కంటే ఎక్కువ వ‌డ్డించ‌కూడ‌ద‌ని బిల్లులో పేర్కొన్నారు. ఇలా ఆదా అయ్యే ఖ‌ర్చును నిరుపేద‌ల‌కు, అనాథ‌ల‌కు, నిజంగా అవ‌స‌రాల్లో ఉన్న‌వారికి, ఎన్జీవోల‌కు విరాళంగా ఇస్తే మంచిద‌ని, త‌న కుమారుడు, కుమార్తె పెళ్లికి ఇలాగే 30, 40 మందిని పిలిచి మిగిలిన‌ డ‌బ్బుల‌ను చారిటీకి వినియోగించాన‌ని ఎంపీ చెప్పారు.. మంచి ఆలోచ‌నే క‌దా!

First Published:  10 Aug 2023 7:48 AM GMT
Next Story