Telugu Global
National

జనగణన చేయకపోవడం వల్ల ఎన్ని నష్టాలో.. బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఈ పని చేయలేకపోతోంది?

సెన్సెస్ డేటా ఆధారంగానే ఆర్థిక ప్రణాళిక, పాలసీ డెసిషన్లు తీసుకునే వీలుంటుంది. సామాజిక డేటా విశ్లేషణకు జనాభా లెక్కలే అధారంగా ఉంటాయి.

జనగణన చేయకపోవడం వల్ల ఎన్ని నష్టాలో.. బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఈ పని చేయలేకపోతోంది?
X

జనాభా లెక్కలను సమయం ప్రకారం చేపట్టడం వల్ల ప్రభుత్వానికి అనేర రకాల మేలు జరుగుతుంది. దేశ అభివృద్ధికి సరైన ప్రణాళిక సిద్ధం చేయడానికి వీలుంటుంది. ఎన్నికలకు సంబంధించి జనాభా లెక్కలు కూడా కీలకంగా పని చేస్తాయి. దేశంలో అక్షరాస్యత శాతం, నిరుద్యోగం వంటి వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆరోగ్య పరంగా ఏ ప్రాంతంలో ఫోకస్ చేయాలనే విషయం కూడా అర్థం అవుతుంది. ఏయే ప్రాంతాలకు ఏయే పనులకు నిధులు ఇవ్వాలనే విషయం సెన్సెస్ ద్వారానే అంచనా వేస్తారు.

సెన్సెస్ డేటా ఆధారంగానే ఆర్థిక ప్రణాళిక, పాలసీ డెసిషన్లు తీసుకునే వీలుంటుంది. సామాజిక డేటా విశ్లేషణకు జనాభా లెక్కలే అధారంగా ఉంటాయి. ఒక ప్రాంతంలో పదేళ్ల తర్వాత ఇలాంటి వివరాలన్నీ మారిపోతాయి. అలాంటిది భిన్న ప్రాంతాలు, విభిన్న జాతులు ఉన్న మన సువిశాల భారత దేశంలో 10 ఏళ్ల తర్వాత ఎంతటి మార్పు వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ మార్పులన్నీ తెలుసుకోవాలంటే జనాభా లెక్కలే ఆధారం.

పాత డేటాను ఆధారం చేసుకొని సంక్షేమ పథకాలను అమలు చేయడం కష్టం. అలా చేసినా అవి సరైన లక్ష్యాలను చేరతాయనే నమ్మకం లేదు. ముఖ్యంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ విషయంలో జనాభా లెక్కలు తప్పకుండా అవసరం అవుతాయి. ఇప్పటికీ 2011 నాటి జనాభా లెక్కలనే పరిగణలోకి తీసుకుంటే వాటితో ఆశించిన ఫలితం రాదని నిపుణులు తెలియజేస్తున్నారు.

విధాన రూపకల్పన, పరిశోధనలో పాత బడిన లెక్కలు సరైన ఫలితాలను ఇవ్వవు. జాతీయ ఆరోగ్య సర్వే చేస్తేనే కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కునే వీలుంది. సెన్సెస్ ద్వారా దీనికి సంబంధించిన డేటా అందే అవకాశం ఉంది. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కార్ జన గణనను పదే పదే వాయిదా వేస్తూ వస్తోంది.

కేంద్రానికి ముందే తెలియదా?

జనగణన అనేది ఏ ప్రభుత్వం ఉన్నా ప్రతీ పదేళ్లకు రోటీన్‌గా జరిగే ప్రక్రియ. కేంద్రంలో ఏ సర్కారు ఉన్నా.. ప్రభుత్వ యంత్రాంగం ఇందుకు చేపట్టాల్సిన ప్రక్రియను ముందుగానే ప్రారంభిస్తుంది. 2021 సెన్సెస్ కోసం రెండేళ్ల ముందు నుంచే పనులు ప్రారంభించాలి. కేంద్రంలో 2014 నుంచి బీజేపీ సర్కారు అధికారంలో ఉన్నది. మరో ఆరేళ్లలో జనాభా లెక్కలు నిర్వహించాలనే విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తున్నది.

ఈ సారి జనాభా లెక్కలను మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తామని, పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నట్లు హోం మంత్రి అమిత్ షా తెలిపారు. కానీ ఇంత వరకు ఆ యాప్ తయారు కాలేదు. మధ్యలో కోవిడ్-19 అంటూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వచ్చారు. 2023 అయిపోతున్నా దాని ఊసే లేదు. ఇటీవలే స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటస్టిక్స్ గడువును మరో రెండేళ్ల పాటు పెంచారు. అంటే అప్పటి వరకు జనాభా లెక్కలు పూర్తి కావనే అర్థం చేసుకోవచ్చు. కీలకమైన జనాభా లెక్కల విషయంలో బీజేపీ ప్రభుత్వం సీరియస్‌గా కనపడటం లేదని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మరి ఇప్పటికైనా ఆ ప్రక్రియ వేగవంతం చేస్తారో లేదో చూడాలి.

First Published:  20 Sep 2023 4:24 AM GMT
Next Story