Telugu Global
National

కాంగ్రెస్‌ను వీడి.. ఎంత మంది సక్సెస్ అయ్యారు?

నాలుగున్నర దశాబ్ధాలకు పైగా కాంగ్రెస్‌లో ఉండి, ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన గులాం నబీ ఆజాద్ పార్టీని వీడారు. త్వరలో కొత్త పార్టీ పెడతానని చెప్పారు. మరి ఇంత వరకు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన పాపులర్, సీనియర్ నాయకులు ఎవరో ఒకసారి పరిశీలిద్దాం.

కాంగ్రెస్‌ను వీడి.. ఎంత మంది సక్సెస్ అయ్యారు?
X

దేశంలో అత్యంత పురాతనమైన రాజకీయ పార్టీ కాంగ్రెస్. ఇప్పుడున్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ కాదని వాదించినా.. అప్పటి పాత పార్టీకి కొనసాగింపు ఇప్పటి కాంగ్రెసే అని మెజార్టీ రాజకీయ నాయకుల అభిప్రాయం. ఇంత చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రానికి ముందు, తర్వాత కూడా ఎన్నో అభిప్రాయ బేధాలు నెలకొన్నాయి. చాలా మంది నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోయారు. కొంత మంది వేరు కుంపట్లు పెట్టుకోగా.. మరి కొంత మంది వేరే పార్టీల్లో చేరారు. పార్టీ నుంచి బహిష్కరించబడి సక్సెస్ అయిన నాయకులు కూడా ఉన్నారు. తాజాగా నాలుగున్నర దశాబ్ధాలకు పైగా కాంగ్రెస్‌లో ఉండి, ఇందిరా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన గులాం నబీ ఆజాద్ పార్టీని వీడారు. త్వరలో తన సొంత రాష్ట్రం (జమ్ము అండ్ కశ్మీర్) కొత్త పార్టీ పెడతానని చెప్పారు. మరి ఇంత వరకు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన పాపులర్, సీనియర్ నాయకులు ఎవరో ఒకసారి పరిశీలిద్దాం.

సి. రాజగోపాలాచారి :

స్వాతంత్రం అనంతరం జవహర్‌లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీలో పూర్తి ఆధిపత్యం సాధించారు. పార్టీని సోషలిస్ట్ భావాల వైపు తీసుకెళ్తున్నారని భావించిన సి. రాజగోపాలాచారి మరి కొంత మంది సీనియర్లతో కలసి పార్టీని చీల్చారు. 1959లో రాజగోపాలాచారితో పాటు టంగుటూరి ప్రకాశం పంతులు, మినూ మసాని, ఎన్జీ రంగ, దర్శన్ సింగ్ ఫెరుమాన్, ఉధమ్ సింగ్, కేఎం మున్షిలు పార్టీ నుంచి బయటకు వచ్చి స్వతంత్ర పార్టీని నెలకొల్పారు. 1962, 1967, 1971 సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేదు. కేవలం 1967లో మాత్రం 520కి గాను 44 సీట్లు గెలిచింది.

జయప్రకాశ్ నారాయణ్:

ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ నుంచి జయప్రకాశ్ నారాయణ్ బయటకు వచ్చారు. 1977లో ఆయన జనతా పార్టీని స్థాపించారు. ఇందులో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఓ), జార్జ్ ఫెర్నాండెజ్‌కు చెందిన సోషలిస్ట్ పార్టీ, చరణ్ సింగ్‌కు చెందిన భారతీయ క్రాంతి దళ్, భారతీయ జన సంఘ్ విలీనం అయ్యాయి. స్వతంత్ర భారత దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత జయప్రకాశ్ నారాయణ్‌ స్థాపించిన జనతా పార్టీకి దక్కుతుంది. ఆ పార్టీ తరపున మొరార్జీ దేశాయ్ ప్రధాని అయ్యారు. కాగా, ఆ తర్వాత జనతా పార్టీ కూడా పలు ప్రాంతీయ పార్టీలుగా విడిపోయింది. 2013 ఆగస్టులో ఈ పార్టీ బీజేపీలో విలీనం అయ్యింది.

చంద్రశేఖర్ :

ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా చంద్రశేఖర్ కూడా గళం విప్పారు. దీంతో ఆయన జైలు పాలయ్యారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత జనతా పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడిగా కూడా చంద్రశేఖర్ పని చేశారు.

బాబూ జగ్జీవన్ రామ్:

బాబూ జగ్జీవన్ రామ్‌కు కాంగ్రెస్‌లో చాలా ప్రాధాన్యత దక్కింది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడిన జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వంలో జగ్జీవన్ రామ్ మంత్రిగా పని చేశారు. భారత తొలి కేబినెట్‌లో మినిస్టర్ అయిన జగ్జీవన్ రామ్ చాలా ఏళ్ల పాటు మంత్రిగా ఉన్నారు. మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి ఆయన చనిపోయే వరకు లోక్‌సభకు వరుసగా ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ మినిస్ట్రీలో సీనియర్ మంత్రిగా ఉన్న సమయంలో (1977) జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జనతా పార్టీలో చేరారు. ఆయన ప్రధాని పదవిని ఆశించారు. కానీ చివరకు మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో డిప్యుటీ ప్రైమ్ మినిస్టర్‌గా పని చేయాల్సి వచ్చింది. 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ తమ ప్రధాని అభ్యర్థిగా బాబూ జగ్జీవన్ రామ్‌ను ప్రకటించింది. కానీ ఆ పార్టీ కేవలం 31 సీట్లకే పరిమితం అయ్యింది.

మొరార్జీ దేశాయ్:

భారత తొలి ప్రధాని నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి మరణించిన తర్వాత మొరార్జీ దేశాయ్ ప్రధాని కావాలని ఆశించారు. అయితే ఇందిరా గాంధీ ఆ పదవిని చేపట్టారు. ఇందిర ప్రధాని అయిన తర్వాత ఆమె విధానాలను మొరార్జీ దేశాయ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇతర సీనియర్ నాయకులతో కలసి అసమ్మతి రాగం వినిపించారు. దీంతో 1969లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండుగా చీలిపోయింది. ఇందిరా గాంధీ కాంగ్రెస్ (ఆర్) పేరుతో, మొరార్జీ దేశాయ్-కామరాజ్ వర్గం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఓ) పేరుతో విడిపోయారు. అయితే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలోని 705 మంది సభ్యుల్లో 446 మంది ఇందిర వైపే మొగ్గు చూపారు. 1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఐఎన్‌సీ (ఓ) కేవలం 16 లోక్‌సభ స్థానాలకే పరిమితం అయ్యింది. ఎమర్జెన్సీ అనంతరం మొరార్జీ దేశాయ్ ఐఎన్‌సీ(ఓ)ను జనతా పార్టీలో విలీనం చేయడమే కాకుండా ప్రధాని కూడా అయ్యారు.

బీజూ పట్నాయక్:

ఇందిరా గాంధీకి సన్నిహితుడిగా పేరొందిన బీజూ పట్నాయక్.. 1969లో ఆమెతో తీవ్రంగా విభేదించారు. అనంతరం పార్టీని వదిలిపెట్టి అదే ఏడాదిలో ఉత్కల్ కాంగ్రెస్ అనే ప్రాంతీయ పార్టీని ఒడిశాలో ప్రారంభించారు. అయితే ఆ పార్టీని 1977లో జనతా పార్టీలో విలీనం చేశారు. ఆయన రెండు సార్లు ఒడిశా ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన చనిపోయిన తర్వాత నవీన్ పట్నాయక్ తండ్రి బీజూ పట్నాయక్ పేరు మీద బీజూ జనతాదళ్ పార్టీని స్థాపించారు.

విజయ రాజే సింధియా :

రాజమాతగా పేరున్న విజయ రాజే సింధియా 1967లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత స్వతంత్ర పార్టీలో చేరి లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే స్వతంత్ర పార్టీ ఆ తర్వాత కాలంలో భారతీయ లోక్ దళ్‌లో విలీనం అయ్యింది. విజయ రాజే సింధియా ఆ తర్వాత భారతీయ జన్ సంఘ్‌లో చేరారు. బీజేపీ ఏర్పడిన తర్వాత అందులో కూడా కీలక పాత్ర పోషించారు. రామజన్మ భూమి ఉద్యమంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. ఆమె మనుమడు జ్యోతిరాధిత్య సింధియా 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరడం విశేషం.

చంద్రబాబు నాయుడు:

కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పని చేసిన నారా చంద్రబాబు నాయుడు 1983 ఎన్నికల్లో ఓడిపోవడంతో మామ పెట్టిన తెలుగు దేశం పార్టీలో చేరారు. చాలా కాలం ఎన్టీఆర్ కేబినెట్‌లో మినిస్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత మామకు వెన్నుపోటు పొడిచి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు. తెలుగు దేశం పార్టీని కూడా పూర్తిగా తన చేతిలో ఉంచుకున్నారు.

మమత బెనర్జీ :

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో మమత బెనర్జీది కీలక పాత్ర. ఆమె 1970 నుంచి 1997 వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. అయితే వెస్ట్ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ సోమేంద్ర నాథ్ మిశ్రాతో ఆమెకు విభేదాలు రావడంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) పేరుతో 1998లో పార్టీని స్థాపించారు. చాలా కాలం టీఎంసీని కమ్యూనిస్టుల ప్రధాన ప్రత్యర్థి పార్టీగా నిలిపారు. చివరకు 2011లో టీఎంసీ బెంగాల్‌లో అధికారం చేపట్టి.. 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు చరమగీతం పాడింది. వరుసగా మూడో సారి ఆమె బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి:

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కాంగ్రెస్ తరపున కడప ఎంపీగా గెలిచారు. అయితే 2009లో తండ్రి చనిపోయిన తర్వాత వైఎస్ జగన్‌పై వేధింపులు పెరిగిపోయాయి. దీంతో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో విభేదించి రాజీనామా చేశారు. 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2019లో ఏపీలో అధికారం చేజిక్కించుకొని ముఖ్యమంత్రి అయ్యారు.

హిమంత బిశ్వ శర్మ:

ప్రస్తుతం అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్న హిమంత బిశ్వ శర్మ.. కాంగ్రెస్ పార్టీతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 1990 నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే 2015లో బీజేపీలో చేరారు. గత ప్రభుత్వంలో కేబినెట్ మినిస్టర్‌గా ఉన్న హిమంత.. ప్రస్తుతం సీఎంగా వ్యవహరిస్తున్నారు.

ప్రేమ ఖండు :

2005 నుంచి 2016 వరకు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న ప్రేమ ఖండు.. తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. తర్వాత బీజేపీలో చేరిన ఖండూ.. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

బిరేన్ సింగ్ :

2004 నుంచి 2016 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎన్. బీరేన్ సింగ్.. ఆ తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన మణిపూర్ సీఎంగా ఉన్నారు.

ఈ నాయకులు ప్రత్యేకం:

ఇప్పటి వరకు చెప్పుకున్న నాయకులు అందరూ కాంగ్రెస్‌ను విడిచిపెట్టి సొంత పార్టీలు పెట్టుకున్నవాళ్లు లేదా వేరే పార్టీలో చేరిన వాళ్లు. కానీ ఇప్పుడు చెప్పుకోబోకే నాయకులు పార్టీ బహిష్కరణకు గురైన తర్వాత కూడా రాజకీయాల్లో విజయం సాధించిన వ్యక్తులు

శరద్ పవార్, పీఏ సంగ్మా, తారీఖ్ అన్వర్:

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తీవ్ర విమర్శలు చేయడంతో వీళ్లు ముగ్గురినీ పార్టీ నుంచి 1999లో బహిష్కరించారు. సోనియా ఇటలీకి చెందిన వ్యక్తి అని.. ఆమె పార్టీకి అధ్యక్షురాలిగా ఉండకూడదని వాదించడంతో శరద్ పవర్, పీఏ సంగ్మా, తారిఖ్ అన్వర్ బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత ముగ్గురు కలసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న 8 జాతీయ పార్టీలలో ఎన్సీపీ కూడా ఒకటి.

వీపీ సింగ్ :

రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో వీపీ సింగ్, అరుణ్ నెహ్రూను పార్టీ నుంచి బహిష్కరించారు. అయితే వీరిద్దరూ కలసి 1988లో జనతాదళ్‌ను స్థాపించారు. జనతా పార్టీ, జనతాపార్టీ (సెక్యులర్), లోక్‌దళ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (జగ్జీవన్), జన్ మోర్చా వంటి పార్టీలను విలీనం చేసి జనతా దళ్ స్థాపించారు. బీజేపీ సహాయంతో నేషనల్‌ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు వీపీ సింగ్ ప్రధాని అయ్యారు.

కాంగ్రెస్‌ను వీడి.. తిరిగొచ్చిన నాయకులు:

కాంగ్రెస్ పార్టీతో విభేదించినా.. తిరిగి పార్టీలో చేరి కీలక పదవులు చేపట్టిన నాయకులు కూడా ఉన్నారు. వారిలో కొందరు..

మాధవరావు సింధియా:

1996 సార్వత్రిక ఎన్నికల సమయంలో తనకు టికెట్ కేటాయించలేదని మాధవరావు సింధియా పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాకుండా మధ్యప్రదేశ్ వికాస్ కాంగ్రెస్ (ఎంపీవీసీ) అనే పార్టీని స్థాపించి ఎన్నికల్లో నిలబడి గెలిచారు. అయితే ఆ ఏడాది కేంద్రంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడింది. కాగా, 1998లో ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతే కాకుండా ఎంపీవీసీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. 2001లో ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగారు.

ప్రణబ్ ముఖర్జీ:

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా ఒకానొక సమయంలో కాంగ్రెస్ పార్టీని విడారు. రాజీవ్ గాంధీ తనను పక్కన పెట్టారనే అసంతృప్తితో పార్టీని వీడి 1986లో రాష్ట్రీయ సమాజ్‌వాది కాంగ్రెస్ అనే ప్రాంతీయ పార్టీని పశ్చిమ బెంగాల్‌లో స్థాపించారు. అయితే ఆ తర్వాత ఏడాదే రాజీవ్ గాంధీతో రాజీ పడి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్‌లో కీలక వ్యక్తిగా మారడమే కాకుండా.. రాష్ట్రపతిగా కూడా ఎన్నికయ్యారు.

ఎన్డీ తివారి :

కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్డీ తివారి, అర్జున్ సింగ్, నట్వర్ సింగ్, రంగరాజన్ కుమారమంగళం కలసి ఒకే సారి పార్టీ నుంచి బయటకు వచ్చారు. అనంత‌రం నలుగురు కలసి ఆల్ ఇండియా కాంగ్రెస్ (తివారి)ని 1996లో స్థాపించారు. కానీ సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయ్యాక ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తర్వాతి కాలంలో అందరూ కీలక పదవులు అనుభవించారు. ఎన్డీ తివారి ఏపీ గవర్నర్‌గా కూడా పని చేశారు.

First Published:  26 Aug 2022 2:22 PM GMT
Next Story