Telugu Global
National

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎలా గెలిచింది? ఈ సారి ప్రతిపక్షాలు చేయాల్సింది ఏంటి?

2019 ఎన్నికల్లో బీజేపీ 224 సీట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్ల శాతాన్ని నమోదు చేసింది. బీజేపీ 303 పార్లమెంట్ సీట్లు గెలిస్తే.. అందులో 224 సీట్లలో సగాని కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకి పడటం గమనార్హం.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎలా గెలిచింది? ఈ సారి ప్రతిపక్షాలు చేయాల్సింది ఏంటి?
X

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 2019 లో‌క్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలిచి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారం చేపట్టింది. ఎన్టీయేలోని మిత్ర పక్షాల మద్దతు అవసరం లేకుండానే బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. 2014 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే.. 2019లో బీజేపీ 21 సీట్లు అదనంగా గెలిచింది. బీజేపీ ఇంతలా బలపడటానికి కారణం ఏంటో 2019 ఎన్నికల గణాంకాలు చూస్తే తెలిసిపోతుంది. అంతే కాకుండా రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలన్నది కూడా అర్థం అవుతుంది.

2019 ఎన్నికల్లో బీజేపీ 224 సీట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్ల శాతాన్ని నమోదు చేసింది. బీజేపీ 303 పార్లమెంట్ సీట్లు గెలిస్తే.. అందులో 224 సీట్లలో సగాని కంటే ఎక్కువ ఓట్లు బీజేపీకి పడటం గమనార్హం. 2014లో బీజేపీ 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ పొందిన సీట్లు 136 మాత్రమే. కానీ 2019కి వచ్చే సరికి 88 సీట్లలో భారీగా ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నది. 1971, 1980, 1984లో కాంగ్రెస్ పార్టీ, 1977లో జనతా పార్టీ ఇలా 200 కంటే ఎక్కువ సీట్లలో 50 శాతం కంటే ఎక్కువ ఓట్ షేర్ సాధించింది.

ఇక 50 శాతం కంటే తక్కువ ఓట్ షేర్‌తో బీజేపీ 79 స్థానాల్లో విజయం సాధించింది. రెండు, మూడు స్థానాల్లో వచ్చిన పార్టీల వోట్ల శాతం కలిపి 50 వచ్చిన నియోజకవర్గాలు 48 ఉన్నాయి. అంటే యాంటీ-బీజేపీ పార్టీలు కలిసుంటే ఆ 48 సీట్లు బీజేపీ ఖాతా నుంచి వెళ్లిపోయేవని గణాంకాలు చెబుతున్నాయి. 2014లో బీజేపీకి 146 స్థానాల్లో 50 శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అదే సమయంలో 2, 3 స్థానాల్లో నిలిచిన పార్టీల ఓట్ల శాతం బీజేపీ కంటే 79 నియోజకవర్గాల్లో ఎక్కువగా ఉన్నది. అంటే అప్పుడు కూడా ప్రతిపక్షాల అనైక్యతే బీజేపీకి గెలుపుగా మారింది.

ఇక బీజేపీకి పోటీగా ఒకే ఒక పార్టీ ఉన్న రాష్ట్రాల్లో 106 సీట్లు గెలిచింది. మధ్యప్రదేశ్ 28, గుజరాత్ 26, రాజస్థాన్ 24, హర్యానా 10, చత్తీస్‌గడ్ 9, ఉత్తరాఖండ్ 5, హిమాచల్ ప్రదేశ్‌లో 4 సీట్లు గెలిచింది. ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా ఉన్నది. అక్కడ చిన్న పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా.. బీజేపీని ఓడించలేని పరిస్థితి ఎదురవవచ్చు.

ఇక ప్రతిపక్షాల అనైక్యత ఉన్న రాష్ట్రాల నుంచి బీజేపీ 124 సీట్లు గెలిచింది. యూపీలో 62, కర్నాటక 25, వెస్ట్ బెంగాల్ 18, ఒడిషా 8, ఢిల్లీ 7, తెలంగాణ 4 సీట్లు బీజేపీ ఖాతాలో పడ్డాయి. ఈ రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు బరిలో నిలిచాయి. ఢిల్లీలో ఆప్, తెలంగాణలో బీఆర్ఎస్, కర్ణాటకలో జేడీఎస్, ఒడిషాలో బీజేడీ ఇలా పలు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయడం బీజేపీకి కలిసి వచ్చిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి.

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీహార్, మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి పెద్ద ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి ఎన్డీయే 88 సీట్లకు గాను 80 గెలిచింది. అయితే ఎన్డీయే నుంచి జేడీయూ బయటకు రావడం, శివసేన రెండుగా విడిపోవడం బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. దీన్ని ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకుంటే ఎన్డీయే కూటమి గెలిచే సీట్లను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తంగా చూస్తే ఆయా రాష్ట్రాలు, ప్రాంతాలను బట్టి ప్రతిపక్ష పార్టీలు ఏకం అయితే బీజేపీని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రతిపక్షాల అనైక్యతే బీజేపీకి పెద్ద వరంలాగా మారిందని.. దేశ వ్యాప్తంగా ఒక ప్రత్యామ్నాయ వేదిక ఏర్పడటం వల్ల బీజేపీకి ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో విజయావకాశాలను దెబ్బ కొట్ట వచ్చని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

First Published:  19 Jun 2023 5:14 AM GMT
Next Story