Telugu Global
National

కలిసిమెలిసి ఉన్నచోట‌ మత విద్వేషాలు సృష్టించడ‍ం ఎలాగో ఇదో గొప్ప ఉదహరణ‌!

ప్రజలు కలిసి మెలిసి ఉన్నచోట మత సమస్యలు సృష్టించడం బీజేపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అనడానికి ఇదో ఉదహరణ. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఓ స్కూలుపై హిందుత్వ గ్రూపులు చేసినకుట్ర చూస్తే వాళ్ళ విద్వేష రాజకీయాలు అర్దమవుతాయి.

కలిసిమెలిసి ఉన్నచోట‌ మత విద్వేషాలు సృష్టించడ‍ం ఎలాగో ఇదో గొప్ప ఉదహరణ‌!
X

అసలు సమస్యే లేని చోట సమస్య సృష్టించడం, ప్రతీ విషయాన్ని మతం చుట్టూ తిప్పడం, మనసుల్లో విషాన్ని నింపి ప్రజలను విభజించి తమ స్వార్ద ప్రయోజనాలకు వాడుకోవడం బీజెపికీ అలవాటుగా మారిపోయింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ సంఘటన తాజా ఉదహరణ.

కాన్పూర్ లోని ఫ్లోరెట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను 2003లో ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ఆ స్కూల్ లో హిందూ, ముస్లిం, సిక్కు, క్రిస్టియన్... ఈ నాలుగు మత విశ్వాసాల ప్రార్థనలు జరగడం ఆనవాయితీ. అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే ఈ స్కూలుపై బీజేపీ కన్నుపడింది. సమయం కోసం వేచి చూస్తున్నవారికి రవి రాజ్‌పుత్ రూపంలో అవకాశం దొరికింది.

35 ఏళ్ల సేల్స్‌పర్సన్ రవి రాజ్‌పుత్ కుమారుడిని అదే స్కూళ్ళో చేర్పించాడు. అయితే అతని కుమారుడు ఇస్లామిక్ ప్రార్థనలు చదవడం అతనికి నచ్చలేదు. దాంతో ఆయన కాన్పూర్‌లోని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా నిగమ్ కు పిర్యాదు చేశారు. ఆమె వెంటనే రంగంలోకి దిగారు. ఆమెతో పాటు హిందూ జాగరణ్ మంచ్ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడిగా కొనసాగుతున్న శివమ్ దీక్షిత్ కూడా కలిశాడు. తమ అనుచరులను రంగంలోకి దించారు. హిందూ జాగరణ్ మంచ్ కార్యాలయంలో జూలై 31 న ఓ సమావేశం నిర్వహించి ప్రణాళీక సిద్దం చేశారు.

ఆ స్కూల్ లో చదువుతున్న కొందరు పిల్లల తల్లితండ్రులను ఆర్గనైజ్ చేశారు. ఆ స్కూల్ లో "శిక్షా జిహాద్" జరుగుతోందని ప్రచారం మొదలు పెట్టారు. నిరసన ప్రదర్శన‌లు నిర్వహించారు.పోలీసులకు , విద్యాశాఖ అధికారులకు పిర్యాదులు చేశారు. చివరకు స్థానిక అధికారులు స్కూల్ ను సీజ్ చేశారు.

ఇప్పుడు బాధపడుతున్నారు రవి రాజ్‌పుత్. తాను ఇస్లామిక్ ప్రార్థన ఆగిపోవాలనుకున్నాను తప్ప స్కూల్ మూసివేయాలను కోలేదని, తన కుమారుడి చదువు ఇప్పుడు ఇబ్బందుల్లో పడిందని ఆయన వాపోయారు.

కాన్పూర్‌లోని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా నిగమ్ ఆదేశాల‌ మేరకే తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రాజ్‌పుత్ తెలిపారు.

ఆగస్టు 2న రాజ్‌పుత్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్, సుమీత్ మఖిజాపై సెక్షన్ 295A - మతపరమైన భావాలను రెచ్చగొట్టడం , ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టం, 2021లోని సెక్షన్ కింద బుక్ చేయబడింది.

రవి రాజ్ పుత్ ఫిర్యాదులో.. పాఠశాల శిక్షా జిహాద్ కు పాల్పడుతోందని. తమ పిల్లల మతం మార్చేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. ఈ పిర్యాదు హిందుత్వ నాయకుల ఆదేశాలమేరకే రాశారు. ఫిర్యాదులో పాఠశాలకు సీలు వేయాలని కూడా

డిమాండ్ చేశారు. కానీ రాజ్‌పుత్ మాత్రం దానిని తాను ఎప్పుడూ కోరుకోలేదని పేర్కొన్నాడు.

ఇక బిజెపి కార్పొరేటర్ మహేంద్ర నాథ్ శుక్లా బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులతో కలిసి గంగాజలంతో స్కూల్ ను శుద్ది చేసే కార్యక్రమం చేపట్టారు. పాఠశాల యాజమాన్యం క్షమాపణ చెప్పే వరకు నిరసన కొనసాగిస్తానని ప్రతిజ్ఞ చేశాడు.

ఈ వివాదంపై పాఠశాల ప్రిన్సిపాల్ అంకితా యాదవ్ మాట్లాడుతూ 2003 లో పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచీ నాలుగు మతాల ప్రార్థనలు చదివే ఆచారం ప్రారంభమైందని చెప్పారు.ఇప్పటి వరకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందీ రాలేదని అన్నారామె.

"ఇక‌నుండి పాఠశాలలో జాతీయ గీతం మాత్రమే ఆలపించబడుతుందని పాఠశాల ఈ హిందుత్వ గ్రూపులకు తెలియజేసింది. అయినా సరే ఈ వివాదాన్ని మరింత పెంచేందుకు కావాల్సిన ప్రణాళికలు వేయడంలో బీజేపీతో సహా మిగతా హిందుత్వ గ్రూపులు బిజీగా ఉన్నాయి. మరింత మంది పేరెంట్స్ ను ఆర్గనైజ్ చేసేందుకు వాళ్ళు సిద్దమవుతున్నారు.

First Published:  4 Aug 2022 11:58 AM GMT
Next Story